Suryaa.co.in

Features

రైతు ఉద్యమం ఫలిస్తుందా?

ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఏ పత్రికలోనూ కథనాలు ఇప్పటి వరకూ రాలేదు. మొదటగా 21 తేదీన ఒక యువ రైతు పోలీస్ కాల్పుల్లో మరణించాడని పత్రికలు రాశాయి. లక్షలాది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్లు, ట్రక్కులతో తరలి వస్తుంటే , కేంద్ర ప్రభుత్వం రోడ్లను మూసివేయడమే కాక కాంక్రీటు అడ్డు గోడలు కూడా నిర్మించింది. మిగిలిన రోడ్లకు ఇనప మేకులు దించి రైతుల రాకను నిరోధిస్తోంది. పంజాబ్, హర్యానా రైతులే కాక యు.పి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రైతులు కూడా జతకలిసారు.

2020-21 నాటి ఐక్య కిసాన్ మోర్చా నేతృత్వంలో ఉద్యమం జరగగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉప సంహరించు కుంటున్నామని , రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. ఇవి కాక ఉత్పత్తులకు తగిన ధరల హామీని, రుణ మాఫీని , శ్రామికుల వేతన ధరలు ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని అడుగు తున్నారు రైతులు. దేశ జనాభాలో సగం పైగా వ్యవసాయ రంగంలో వుంటున్నా , దేశ జి.డి.పి లో వ్యవసాయరంగ వాటా 15 % మాత్రమే ఉండడానికి కారణం ఉత్పత్తులకు తగ్గ గిట్టుబాటు ధరలు లేక ఆదాయం కోల్పోవడం వల్లనే. రుణ మాఫీ అన్నది కేవలం బ్యాంకులో తీసుకున్న రుణాలకే వర్తింప జేస్తూ , ప్రైవేటుగా వడ్డీలు తీసుకున్న వారికి వర్తించడం లేదు.

వ్యవసాయ రుణాలను రెట్టింపు ఇస్తున్నామని బ్యాంకులు చెబుతున్నారు. పట్టణ బ్యాంకుల్లో బంగారం కుదవబెట్టి వ్యవసాయ రుణాలుగా తీసుకుంటున్నారు. పట్టణ , నగరాలలో వ్యవసాయ భూమి ఎక్కడ వుంది ? ఇలాంటి రుణాలన్నింటినీ వ్యవసాయ రుణాలుగా బ్యాంకులు చూపిస్తున్నాయి. దానివల్ల మేము ఇవ్వవలసిన కోటా అయిపోయిందని పల్లె రైతుల రుణాలలో కోత విధిస్తున్నారు బ్యాంకర్లు.

విచిత్రం ఏమిటంటే రైతులకు న్యాయం చేయదు గాని, రైతుల పక్షాన నిలబడిన స్వామినాథన్ , చరణ్ సింగ్ లకు ‘భారతరత్న’ ప్రకటించి మేమూ రైతు పక్షపాతిమే అని చూపించు కోవాలని అధికార కేంద్ర ప్రభుత్వం తాపత్రయం పడుతోంది. రైతులకు మేలు చేసిన ఆ మహానుభావులను గౌరవించుకోవడం ఆనందించ దగ్గ విషయమే అయినా , వారు వేటికోసం తమ జీవితాలను ధారబోసి రైతులకు న్యాయం చెయ్యాలని చేసిన సూచనలను మాత్రం గాలికి వదిలేశారు.

రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా మొదటగా స్వామినాథన్ సిపార్సులను అమలు చేస్తామని ప్రకటించాడు. కనీస మద్దతు ధరకు ( msp ) చట్టబద్ధత కల్పిస్తామని కూడా ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకటన చేసినా కాంగ్రెస్ పార్టీనే మొట్ట మొదటగా చేసిన కీలక ప్రకటనగా గుర్తింపు లభిస్తుంది. అసలు స్వామినాథన్ సిపార్సులను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే , పూర్తి మద్దతు ధర అని కాకుండా కనీస మద్దతుధర అన్నారు స్వామి నాథన్. కనీస మద్దతు ధరకు కూడా ఈ ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. అదే పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి , వారు నష్టాల పాలయ్యారని 14 లక్షల కోట్ల మేర వారికి రుణ మాఫీ చేశారు.

పారిశ్రామిక ఉత్పత్తులకు ధరలు వారే నిర్ణయించు కుంటారు. కానీ 140 కోట్ల ప్రజల ఆకలి తీరుస్తున్న , ప్రపంచానికి కూడా ఆకలి తీరుస్తున్న రైతులు ఉత్పత్తి చేస్తున్న ధాన్యానికి మాత్రం ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. ధరలు కొద్దిగా పెరగగానే విదేశాల నుండి దిగుమతులు చేసుకుంటుంది. ఉచిత ఆహార పధకాల కోసం రైతుల నుండి ధాన్యాన్ని సేకరించడం కోసం ధరలను పెంచకుండా ఉండడం , విదేశాలకు ఎగుమతులను నిషేదించడం వల్ల ఉత్పత్తి పెరిగినప్పుడు ఒక్కసారిగా ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కనీస మద్దతు ధర ( msp) నిర్ణయంలో అనేక అవక తవకలకు పాల్పడి ధాన్యం ధరలకు కోత విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. msp నిర్ణయించే డప్పుడు రైతులను పిలవ కుండా కార్పోరేట్ రంగం వారి ఆదేశానుసారం ప్రభుత్వ అధికారులే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

విత్తనాలు , ఎరువులు, క్రిమిసంహారక మందులను మాత్రమే పరిగణ లోకి తీసుకుని , పెరిగిన శ్రామికుల వేతనాన్ని కలపడం లేదు. పెరిగిన శ్రామిక వేతనాలే రైతుకు గుదిబండ అయ్యాయి. అప్పుకు వడ్డీలు చెల్లించాలి. ధాన్యానికి ధర నిర్ణయించాలి అంటే ఖర్చులు , పెట్టుబడి అంతా ఒక పట్టికలాగా వేసుకుని వచ్చి , మొత్తం ఖర్చుకు వడ్డీ కలిపి , మొత్తం ఖర్చును తేల్చి , ఖర్చులో సగం అదనంగా కలిపి కనీస ధరను ఇవ్వాలని స్వామినాథన్ సూచించారు.

రైతుల దుస్థితికి ఒక్క మోడీనే కారణం కాదు గానీ , 2014 నుండి బాగా దిగజారింది రైతు పరిస్థితి. పి.వి. నరసింహా రావు గారి సరళీ కృత ఆర్ధిక విధానాలతో క్రమేణా కొద్ది కొద్దిగా సంక్షోభంలోకి వ్యవసాయం నెట్టివేయబడింది. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించని బి.జె.పి , కార్పొరేట్ రంగం వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మడమే దీనికి అసలు మూలం. కార్పొరేట్ రంగాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తూ, వారికి కాలికి ముళ్లు గుచ్చుకుంటే, తమకు కంట్లో ముళ్లు గుచ్చుకున్నట్లుగా బి.జె.పి ప్రభుత్వం భావిస్తోంది. కార్పోరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ, వ్యవసాయాన్ని నట్టేట ముంచి వేస్తున్నారు.

ఈ ఎన్నికలకు రామాలయ నిర్మాణాన్ని చూపించి ఓట్లు దండుకోవాలని సర్వరోగ నివారణి లాగా , అన్ని సమస్యలకు రామాలయం నిర్మాణమే పరిష్కారమని చూపిస్తోంది. రైతులకు ఇవ్వవలసిన రుణాలను కార్పొరేట్ రంగానికి మళ్లిస్తోంది. గత కొంత కాలంగా చేపలు, రొయ్యలు , పామాయిల్ , పళ్లు, వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి, అనేక మంది ఈ రంగంలో ఉపాధి పొందుతుంటే , రుణాలు కూడా అదే క్రమంలో పెంచాలి.

ఈ వ్యవసాయాన్ని కూడా గంపగుత్తుగా కార్పొరేట్ రంగానికి అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానిని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తలంచి వారిపై దమన నీతిని ప్రయోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ సాధనాలు, ఇతర సాంకేతికత పనిముట్లు, అంతా కార్పొరేట్ రంగం శాసిస్తూ , ఖర్చును తగ్గించే ఆధునిక సాంకేతికతను రైతుకు అందకుండా చేస్తున్నారు కార్పొరేట్లు.

అన్నం పెట్టే రైతుల మీద విష ప్రచారం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎ.పి లో వై.సి.పి ప్రభుత్వం పెత్తందార్లకు , బడుగుల మధ్య పోటీ అని ఎలా ప్రచారం చేసుకుంటున్నదో, రైతులు ఉగ్రవాదులని, దేశద్రోహులని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ దేశాన్ని ఇప్పటి వరకు పాలించిన ప్రధానుల్లో చరణ్ సింగ్ మాత్రం పూర్తి రైతు పక్షపాతి. కానీ వారు ఎక్కువకాలం పరిపాలించలేక పోయారు. మిగతా అందరూ కార్పొరేట్లకు అనుకూలురే. సమస్యలు అంటే కార్పొరేట్ల సమస్యలే సమస్యలు. రైతుల మొహం చూసే వారే లేరు. స్వామినాథన్ చేసిన సూచనల వల్ల , హరిత విప్లవం వచ్చి స్వయంసమృద్ధి సాధించుకుని , విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం.

ఆ క్రెడిట్ అంతా రైతులదే. అప్పులు చెల్లించలేక ఎన్నో వేల ఆత్మహత్యలు జరిగినా, రైతులు మాత్రం ప్రజల నోటికి ఆహారం అందిస్తున్నారు. నేడు ప్రధాని మోదీ మాత్రం రైతుల కోసం శ్రమిస్తానని , రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా చట్టాలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. రామాలయం ప్రారంభోత్సవంతో , ఇక గెలిచిపోయామని విర్రవీగే సమయంలో, 400 సీట్లు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వేళ హఠాత్తుగా రైతులు నిరసన మొదలుపెట్టడంతో , మరో పక్క కాంగ్రెస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు , msp చట్టబద్ధత చేస్తామని ప్రకటించడంతో , దిక్కుతోచని స్థితిలో స్వామినాథన్ , చరణ్ సింగ్ లకు ‘భారతరత్న’ ప్రకటించి, విషయాన్ని ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మేధావులు భావిస్తున్నారు.

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు మాదిరి , చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించి , ఇండియా కూటమిలో ఉన్న చరణ్ సింగ్ మనవడు జయంత్ సింగ్ ను బి.జె.పి లోకి చేర్చుకో బోతున్నారట. msp ప్రకటిస్తే ద్రవ్యోల్బణం పెరుగు తుందని , దానివల్ల 10 లక్షల కోట్లు ఆర్ధిక భారం పెరిగుతుందనే అడ్డగోలు వాదన చేస్తోంది బి.జె.పి. కేవలం గుప్పెడు కార్పోరేట్లకు 14 లక్షల కోట్లు రుణ మాఫీ చేయగా , కోట్ల మంది రైతులకోసం స్థూల జాతీయ ఆదాయంలో 1 % 10 లక్షల కోట్లు ఏ మూలకు వస్తాయి. దానివల్ల కొనుగోలు శక్తి పెరిగి , అది మరలా కేంద్ర ఆదాయం కింద మారుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా భారత్ ను తీసుకు వెళతాను అని చిలక పలుకులు పలుకుతున్న బి.జె.పి ప్రభుత్వం దేశ జనాభాలో 60 % పైగా ఉన్న రైతులను పట్టించుకో కుండా, వారిని ఆర్థికంగా బలోపేతం చెయ్యకుండా, ఏ విధంగా మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ?

దేశంలో రైతుకు సరాసరి దినసరి ఆదాయం 30 రూపాయలు మాత్రమే . అంటే భారత్ లో కడు పేదవాడు రైతే అని అర్థం అవుతోంది. వరి, గోధుమలకు మాత్రమే నియంత్రిత మార్కెట్ వ్యవస్థలు ఉన్నాయి. మిగతా 21 పంటలకు సరైన మార్కెట్ వ్యవస్థ లేదు. 15 % మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని, మిగతా 85 % మంది మార్కెట్ దయాదాక్షిణ్యాలపై, కమిషన్ ఏజంట్లపై , వ్యాపారులపై ఆధారపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. వారికి న్యాయం జరగాలి అంటే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడమే ఏకైక మార్గం.

రైతులకు ఆదాయం పెరిగితే, ఆర్థిక వ్యవస్థ పుంజుకుని దేశం బలవర్ధకమయి , కొనుగోలు శక్తి పెరిగి , అనుబంధ వ్యాపారాలు పెరిగి, పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాల భయం , రైతులు తమకు ప్రత్యామ్నాయం అవుతారని , తమను శాసిస్తారని భయపడి అణచివేత విధానాలను అవలంభిస్తున్నారు. రైతుల ఆందోళనలు ఒక్క భారత్ లోనే కాదు , ప్రపంచంలో చాలా దేశాల్లో ఆందోళనలు జరుగు తున్నాయి. ఏ పరిశ్రమకైనా ముడి సరుకు అందించేది రైతులే. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎక్కువ చెలిస్తే తమ లాభాలు తగ్గిపోతాయని పారిశ్రామిక వేత్తలు భావిస్తారు.

అందుకే రైతులపై విష ప్రచారం చేస్తున్నారు. msp పొందడం అనేది రైతు హక్కు. కాంగ్రెస్ పార్టీ msp చట్టబద్ధత అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోగలగాలి. కూటమి పార్టీలు ఎక్కువ రైతు మద్దతు పార్టీలే కనుక , పత్రికలు కూడా రైతు ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించి , పార్టీలు కూడా రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చి ముందుకు నడిపిస్తే స్వామినాథన్ సిపార్సుల ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది.

– వి. ఎల్. ప్రసాద్

LEAVE A RESPONSE