– ఇప్పటిదాకా జగన్‌ను కలవని కేసీఆర్
– దేశ పర్యటనలో విపక్షాలను కలుస్తున్న కేసీఆర్
– మరి పక్కనే ఉన్న ఏపీ సీఎం జగన్‌ను కలవరా?
– ‘బీఆర్‌ఎస్’లో జగన్ వైసీపీ భాగస్వామి అవుతుందా?
– ‘బీజేపీ ముక్త భారత్’ లక్ష్యంలో జగన్‌ను తీసుకురారేం?
– కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్‌లో కేసీఆర్ పర్యటనలు
– ఏపీలో ఎన్డీఏ భాగస్వాములు కాని వైసీపీ, టీడీపీ, జనసేన
– గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చిన జనసేన
– మరి వారితో కేసీఆర్ భేటీ ఎప్పుడు?
– దక్షిణాది పార్టీలను సమన్వయం చేసుకుంటారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ ముక్త భారత్.. ఇదీ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యం. నినాదం! దానికోసం భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీకి ప్రాణం పోసేందుకు దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్న తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు, ఎన్డీఏ వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్న కేసీఆర్ ప్రయత్నాలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. నితీష్, శరద్‌పవార్, స్టాలిన్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, హేమంత్ సొరెన్, కుమారస్వామి, థాక్రే వంటి కీలక నేతలతో భేటీ అవుతున్న కేసీఆర్.. తన పక్క రాష్ట్రమైన ఏపీ విపక్ష నేతలతో మాత్రం, ఇప్పటిదాకా భేటీ కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా.. తన రాజకీయ శిష్యుడయిన ఏపీ సీఎం జగన్‌ను బీజేపీ ముక్తభారత్‌లో భాగంగా, ఇప్పటివరకూ కలవకపోవడమే రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
బీజేపీ ముక్త భారత్ నినాదం తెరపైకి తెచ్చి.. బీఆర్‌ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించేందుకు ఉత్సాహపడుతున్న కేసీఆర్ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే జాతీయ మీడియాలో మాత్రం.. ఆయన తన జాతీయ రాజకీయ రంగప్రవేశంపై, విస్తృతంగా కథనాలు వచ్చేలా చూడటంలో సఫలీకృతులవుతున్నారు. జాతీయ మీడియాకు భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తుండటంతో, అందరి దృష్టిని తన వైపు మళ్లించుకునే వ్యూహానికి తెరలేపారు. తన బీహార్, బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబయి పర్యటనకు ముందు.. ఆయా నగరాల్లో భారీ స్థాయిలో హోర్డింగులు ఏర్పాటుచేయించడం ద్వారా, కేసీఆర్ గురించి ఆయా రాష్ర్టాల్లో చర్చ మొదలయ్యే వ్యూహానికి పదునుపెట్టడం కనిపించింది.
ఇప్పటివరకూ నితీష్, కుమారస్వామి మినహా మిగిలిన వారు కేసీఆర్ ప్రయత్నాలకు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. తాజాగా గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ వచ్చి కేసీఆర్‌ను కలిసి, కేసీఆర్ ప్రయత్నాలకు మద్దతునిస్తానని ప్రకటించారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తులను కూడగట్టే పనికి నాయకత్వం వహిస్తానని, నితీష్ కొద్దిరోజుల క్రితమే తన కోరికను బయటపెట్టారు. అంటే ప్రధాని రేసులో తానే ఉంటానని నితీష్ చెప్పకనే చెప్పినట్టయింది.
ఇక తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తన పార్టీ ఏ కూటమిలో ఉండదని స్పష్టం చేయటం ద్వారా.. తాను ఎవరి కింద పనిచేయనని విస్పష్టంగా ప్రకటించినట్టయింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబె నర్జీలో, ప్రస్తుతం బీజేపీపై మునుపటి శత్రుత్వ భావన తగ్గిపోయింది. దీనితో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలు కొంచెం ముందుకు, కొంచెం వెనక్కి అన్నట్లు తయారయింది.
కాకపోతే అనూహ్యంగా కమ్యూనిస్టులు చేరువ కావడం, కేసీఆర్ ప్రయత్నాలకు కొంత ఊపు వచ్చినట్టయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం, కేసీఆర్‌కు బోలెడు ఊరటనిచ్చింది. ఆ బంధాన్ని కొనసాగించేందుకు, విజయవాడలో జరిగే సీపీఐ మహాసభలకు సైతం కేసీఆర్ వెళ్లనున్నారు. బీజేపీని బహిరంగంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు.. ప్రస్తుతం అదే లక్ష్యంతో పనిచేస్తున్న కేసీఆర్‌తో కలసి ఉమ్మడి కార్యాచరణకు ఊపిరిపోయడం ఆయనకు కొంతవరకూ జాతీయ పార్టీ ప్రయత్నాలకు ఉపకరించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. బీజేపీ ముక్తభారత్‌లో భాగంగా దేశంలోని ప్రాంతీయ- జాతీయ పార్టీలతో భేటీ అవుతున్న కేసీఆర్.. దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలతో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రస్తుతం ఎన్డీఏతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఆయనతో ఇప్పటిదాకా కేసీఆర్ భేటీ కాలేదు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఇటీవల కేసీఆర్‌ను కలిసినప్పటికీ, ఆయన నేతృత్వంలోని జనతాదళ్ పార్టీ, కర్నాటకలోని 40-50 నియోజకవర్గాలలో మాత్రమే ఉనికిలో ఉంది. పైగా ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఇటీవల వచ్చిన చీలిక, కుమారస్వామిని రాజకీయంగా మరింత బలహీనపరిచింది. కాకపోతే కర్నాటక రాష్ట్రంలో కూడా కేసీఆర్‌కు ఒక రాజకీయ మిత్రుడు ఉన్నారని చెప్పేందుకు ఆ కలయిక అక్కరకొస్తుంది. మహారాష్ట్రలో థాక్రేని కలిసినప్పటికీ, అక్కడ శివసేన కాంగ్రెస్‌తో కలసి ఉంది. కేరళలో ఎలాగూ సీపీఎం అధికారంలోనే ఉంది కాబట్టి, కేసీఆర్‌కు అక్కడ సమస్యలేమీ ఉండవు.
ప్రధానంగా పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి.. ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రయత్నాలకు మద్దతు లభించకపోవడం, అసలు ఆమేరకు ఆయన వారి మద్దతు కోరకపోవడమే విస్మయం కలిగిస్తోంది. ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ, అన్ని విషయాల్లోనూ కేసీఆర్‌తో కలసి పనిచేస్తోందన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో అటు బీజేపీతో సైతం జగన్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవలి రాష్ట్రపతి-ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునిస్తే, టీఆర్‌ఎస్ మాత్రం యుపీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది.
తాజాగా జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ-సీపీఎంతో, కేసీఆర్ చెట్టపట్టాలేసుకుని కొత్త బంధానికి తెరలేపారు. విజయవాడలో జరిగే సీపీఐ మహాసభలకు వెళ్లేందుకూ సిద్ధమవుతున్నారు. అయినా వైసీపీ-టీఆర్‌ఎస్ బంధంలో ఎలాంటి మార్పులు లేకపోవడం ప్రస్తావనార్హం. మరి బీజేపీ ముక్తభారత్‌లో భాగంగా జగన్‌ను, కేసీఆర్ ఎందుకు కలవడం లేదన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.
వైసీపీతో అంత రాజకీయ బాంధవ్యం ఉన్న కేసీఆర్.. తన బీజేపీ వ్యతిరేక కూటమిలో జగన్‌ను చేరాలని ఇప్పటిదాకా కోరకపోవడమే వింత. ఆ మేరకు ఆయనతో భేటీ వేయకపోవడం ఆశ్చర్యం. గతంలో ఒకటి, రెండు సార్లు కేసీఆర్-జగన్ భేటీ జరిగినా.. కీలకమైన కేసీఆర్ జాతీయ పాన్టీ ఏర్పాటుపై మాత్రం వారిద్దరి మధ్య, ఇప్పటివరకూ భేటీ జరగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దానితో దేశమంతా తిరుగుతున్న కేసీఆర్, పక్కనే ఉన్న ఏపీకి ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నలు వినిస్తున్నాయి. సీపీఐ మహాసభలకు విజయవాడకు వెళుతున్న కేసీఆర్ ఆ సందర్భంలో ఏపీ సీఎం జగన్‌ను కలిసే అవకాశాలు లేవన్నది సమాచారం. ‘బహుశా జగన్ ప్రస్తుతానికి బీజేపీతో కలసి ఉన్నందుకే, కేసీఆర్ ఆయన మద్దతు కోరలేదేమో. లేక శిష్యుడిని ఇబ్బందిపెట్టడం ఎందుకన్న మొహమాటం వల్ల జగన్‌ను కలిసినట్లు లేరన్న’ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక సాంకేతికంగా-రాజకీయంగా, టీడీపీ-జనసేన పార్టీల్లో జనసేన ఒక్కటే బీజేపీకి మిత్రపక్షం. కానీ గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన మిత్రపక్షమైన బీజేపీని కాకుండా, టీఆర్‌ఎస్‌ను గెలించాలని పవన్ బాహాటంగా పిలుపునిచ్చి, కేసీఆర్‌ను మెప్పించారు. ఆ ప్రకారంగా.. పవన్ కల్యాణ్ ఏపీలో బీజేపీకి, తెలంగాణలో కేసీఆర్‌కు మిత్రుడేనని స్పష్టమవుతోంది. అయినప్పటికీ కేసీఆర్ తన జాతీయ పార్టీ ప్రయత్నాల్లో భాగంగా, పవన్‌ను కూడా కలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏపీలో టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏకు మిత్రపక్షం కాదు. అలాగని వ్యతిరేకమూ కాదు. వారిద్దరి మధ్య పొత్తు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో మహాకూటమి కట్టి, టీడీపీ-టీఆర్‌ఎస్ కలసి పోటీ చేసినవే. కేసీఆర్ జాతీయ పార్టీ నేపథ్యఐలో.. అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న క్రమంలో, ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బీజేపీతో కలసి ఉన్న జగన్‌తోనే రాజకీయ బంధం కొనసాగిస్తున్న కేసీఆర్.. అదే జగన్‌ను వ్యతిరేకిస్తున్న వామపక్షాలతో కలసి పనిచేస్తున్నారు. మరి అదే సిద్ధాంతం ప్రకారం జగన్‌ను వ్యతిరేకించే చంద్రబాబును కలసి, జాతీయ పార్టీ మద్దతు కోరి, అంతా కలసి బీజేపీపై యుద్ధం చేద్దామని ఎందుకు ప్రతిపాదించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
యుపిఏ పక్షాలతోనే భేటీ ఎందుకు?
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంధించిన ప్రశ్న కేసీఆర్ ప్రయత్నాలపై అనుమానాలకు కారణమయింది. ‘కేసీఆర్ యుపీఏ పక్షాలతోనే చర్చిస్తున్నారు తప్ప, ఎన్డీఏ పక్షాలతో చర్చించడం లేదు. అంటే కేవలం యుపీఏలో చీలికతెచ్చి ఎన్డీఏని గెలిపించడమే కేసీఆర్ లక్ష్యమ’ని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజానికి కేసీఆర్ దేశ పర్యటనలు పరిశీలిస్తే.. ఆయన భేటీ అవుతున్న పార్టీలన్నీ, ప్రస్తుతం కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో కలసి ఉన్నవే. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్, బీహార్‌లో నితీష్ జెడియు-కాంగ్రెస్ కలసి పనిచేస్తున్నాయి. తమిళనాడులో డిఎంకె-స్టాలిన్, యుపిలో సమాజ్‌వాదిపార్టీ అఖిలేష్‌యాదవ్ , జార్ఖండ్ సీఎం హేమంత్‌సొరేన్ జెఎంఎం పార్టీతో కాంగ్రెస్ పనిచేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలను చీల్చకుండా, కేవలం కాంగ్రెస్ మిత్రపక్షాలను చీల్చడం ద్వారా బీజేపీ ముక్తభారత్ ఎలా సాధ్యమన్నది కాంగ్రెస్ నేతల వాదన. బీజేపీ మిత్రపక్షాలను కలిసినప్పుడే కేసీఆర్ ప్రయత్నాలతోపాటు, ఆయన జాతీయ పార్టీ అసలు సత్తా ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.