– జగన్‌పై మహిళా పోలీస్ ఫైర్
– వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం డిమాండ్
అమరావతి: “పోలీసులందరి బట్టలు ఊడదిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు, మహిళా పోలీసుల బట్టలు కూడా ఊడదీస్తామనే విధంగా ఉన్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారనే విషయం జగన్ కు తెలియదా? ముఖ్యమంత్రిగా పని చేసిన మీరే ఇలా మాట్లాడితే, పబ్లిక్ లో అందరూ ఏమనుకుంటారనే దాన్ని మీరే ఆలోచించాలి. తన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని పోలీసు అధికారుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నా” అని మహిళా పోలీసు అధికారిణి భవాని డిమాండ్ చేశారు. పోలీసుల బట్టలు ఊడదీస్తామన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీసు అధికారుల సంఘం జగన్ వ్యాఖ్యలను ఖండించింది.