Suryaa.co.in

Andhra Pradesh

పాలకొల్లు ఉదంతంతో ప్రజలకు జగన్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

పాలకొల్లు ఉదాంతంతో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నమ్మకం పోయిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. పాలకొల్లులో లబ్ధిదారులకు తెలియకుండానే టిడ్కో ఇళ్లపై మూడేసి లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వమే రుణాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పాలకొల్లులో 100 మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తెలియకుండానే, జిల్లా కోపరేటివ్ బ్యాంక్ లబ్ధిదారుల పేరిట రుణాలను మంజూరు చేసింది. లబ్ధిదారులను మొదటి ఏడాది వడ్డీతోపాటు వాయిదా కూడా అడగవద్దని ప్రభుత్వమే అప్రమత్తం చేసినట్టుంది.. ప్రభుత్వమే ఆ రుణం డబ్బులను చెల్లించాలని బహుశా భావించి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఖజానా ఖాళీ కావడంతో వాయిదాలను చెల్లించలేక చేతులెత్తేసింది.

లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేరిట రుణాన్ని ఎత్తడమనేది ఓ పెద్ద కుంభకోణం. టిడ్కో ఇళ్లు ఉచితమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. జీవితాంతం లబ్ధిదారులు వాయిదాలు కట్టుకుంటుపోతూ ఉండాలా? అని గతంలో ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులకు, జిల్లా కోపరేటివ్ బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడంతో వారు లబోదిబోమంటూ స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తో మొరపెట్టుకున్నారు. బాధితులతో కలిసి జిల్లా కోపరేటివ్ బ్యాంక్ కార్యాలయానికి వెళ్లిన నిమ్మల రామానాయుడు , అధికారులను ప్రశ్నించగా, రుణాలు మంజూరు చేసిన మాట నిజమేనని వారు తెలిపారు .

లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేరిట రుణాలు ఎలా మంజూరయ్యాయన్న దానిపై తర్జనభర్జన పడితే, అసలు లబ్ధిదారులకు ఇంటి పత్రాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందజేయలేదు. ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి, రుణాలను ఎత్తింది. రేపు మన ఆస్తి పత్రాలను కూడా ఇదేవిధంగా తాకట్టు పెట్టి రుణాలను పొందదనే గ్యారెంటీ ఏమీ లేదు. మన ఆస్తి పత్రాలను మనకు ఇవ్వకుండా, నకలు ఆస్తిపత్రాలను ఇచ్చి అవే ఒరిజినల్ ఆస్తి పత్రాలు అనుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. నకలు ఆస్తి పత్రాలు యజమానుల వద్ద ఉంటే వాటిని తనఖా పెడతామంటే , పెట్టుకుని బ్యాంకు అధికారులు రుణమిచ్చే అవకాశం లేదు. నిజమైన ఆస్తి పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి కాబట్టి ఆపత్రాలను ప్రభుత్వమే తాకట్టు పెట్టి అప్పు లేపేస్తే డానికి బాధ్యులు ఎవరని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

మన ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి ప్రభుత్వం రుణాన్ని ఎత్తితే, రేపు బ్యాంకు అధికారులు వాయిదాలు చెల్లించ లేదన్న కారణంగా ఇంటిని వేలం వేస్తామంటారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోవడం ఖాయం. గతంలో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో ఆస్తిని అనుభవించే హక్కు మాత్రమే ఉండేదట. భూమి అంతా బ్రిటిష్ రాజు ప్రిన్స్ చార్లెస్ పేరిటనే ఉండేదట. ఇప్పుడు ఈ అభినవ ప్రిన్స్ చార్లెస్ కూడా అదే విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారేమోనని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

చట్టాన్ని ఉల్లంఘించే అధికారాన్ని ధర్మారెడ్డి కి ఎవరు ఇచ్చారు?!
చారిత్రాత్మక కట్టడాలను, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు 1958లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపాన్ని 2011 లో కూల్చి వేశారు. చారిత్రాత్మక కట్టడాలను, వారసత్వ సంపదను కూల్చి వేయవద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజీ, మ్యూజియం శాఖల డైరెక్టర్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అధికారికి ఒక లేఖ రాశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయినా ఇప్పుడు కూడా తిరుమలలోని 600 సంవత్సరాల క్రితం నిర్మించిన పారువేట మండపాన్ని కూల్చి వేయడం పట్ల రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారువేట మండపం ఛాయాచిత్రాన్ని మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శించారు. ఏమాత్రం చెక్కుచెదరని పాల్వేటి రాజులు నిర్మించిన పారువేట మండపాన్ని కూల్చివేసి, దాని స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను పైన వేసి మరొక నిర్మాణాన్ని చేపట్టారు. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన చెక్కుచెదరని నిర్మాణాన్ని కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ నూతన నిర్మాణాన్ని చేపట్టాలని అనుకుంటే, మరొక ప్రాంతంలో నిర్మించి ఉండవచ్చు కదా అంటూ నిలదీశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనాధికారిగా ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా, జగన్మోహన్ రెడ్డి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారి ధర్మారెడ్డి ని నియమించారన్నారు. ఒక పథకం ప్రకారం తిరుమలలో చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ధ్వంసం చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఇప్పుడు ఆ గుడి బాగాలేదని, వైకాపా రంగులతో మరొక గుడి నిర్మిస్తారా అంటూ అపహస్యం చేశారు. పార్వేటి రాజులు నిర్మించిన పారువేట మండపాన్ని కూల్చిన తర్వాత ఇటువంటి అనుమానాలు తలెత్తడం సహజం.

ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దృష్టికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి తీసుకు వెళ్లేందుకు ఒక లేఖ రాశారు. అలాగే గతంలో తిరుపతి పట్టణానికి చెందిన బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనాధికారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సవాల్ చేసినట్లు తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అధికారి సవాళ్లు చేయడం కాదని, చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

పదిమందికి దేవుడి ప్రసాదాలు అందజేసినంతమాత్రాన న్యాయం తన చేతుల్లోనే ఉందని టీటీడీ ఇంచార్జ్ ఈవో ధర్మారెడ్డి భావించడం హాస్యాస్పదంగా ఉంది. ధర్మారెడ్డి కి బహుశా 1958 లో రూపొందించిన చట్టం గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఆ చట్టం ప్రకారం చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ధ్వంసం చేయడం నేరం. ఈ విషయాలపై ఆయన ఒకవేళ సవాల్ చేస్తే, స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను, భారతీయ సాంస్కృతిని ప్రతిబింబించే నిర్మాణాలను కూల్చివేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాస్తానని తెలిపారు. ప్రజా సంపదతో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడం ప్రస్తుతం అధికారం లో ఉన్న నాయకులకు అలవాటేనని, కూల్చివేతలు మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు.

ప్రజా వేదికను కూల్చమనే అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి కి ఎవరు ఇచ్చారు?!
గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం తీసుకొని, బడ్జెట్ ను కేటాయించి నిర్మించిన ప్రజా వేదికను కూల్చమనే అధికారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఎవరిచ్చారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికారాలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని, ఆ పరిమితులకు లోబడే ఆయన పనిచేయాలి. అంతేకానీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాన్ని కూల్చమని ఆదేశాలు జారీ చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదు. జ

గన్మోహన్ రెడ్డి పెద్దగా చదువుకోలేదు, అనుభవం కూడా లేదు కాబట్టి ఆయన తప్పుడు నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. పక్కనే ఉన్న సి ఆర్ డి ఏ అధికారుల బుద్ధి ఏమయింది?, ఈ విషయాన్ని వారు ఆయన కు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశించగానే బుల్డోజర్ ను తీసుకువచ్చి ప్రజా వేదికను కూల్చడం దారుణం. ప్రజా వేదికను కూల్చమనే అధికారిక ఆదేశాలు వారికి ఏమైనా ఉన్నాయా? అంటూ నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గంలో ఆమోదించి, నిర్మించిన భవనాన్ని కూల్చి వేసిన విధానం పట్ల న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ( పిల్ ) దాఖలు చేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సిటిజన్ ఫోరం ప్రతినిధులు ముందుకు వచ్చి పిల్ దాఖలు చేస్తామంటే సరే సరి… లేదంటే నేనే దాఖలు చేస్తానని స్పష్టం చేశారు.

చైతన్యానికి ప్రతీక నరసాపురం నియోజకవర్గం
చైతన్యానికి నరసాపురం నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తుందని రామకృష్ణంరాజు అన్నారు. నరసాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ హరి రామ జోగయ్య తెలంగాణ హైకోర్టు లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిల్ నెంబర్ నమోదు చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తో పాటు, సిబిఐకి నోటీసులు జారీ చేశారు. ఈ వయసులో కూడా పట్టువదలని విక్రమార్కుడిలా హరి రామ జోగయ్య గారు పోరాటం చేయడం అభినందనీయం. రెండేళ్ల క్రితం నేను వేసిన ఒక పిటిషన్ లిస్ట్ కాలేదు. హరి రామ జోగయ్య గారి స్ఫూర్తితో మళ్లీ ఆ పిటిషన్ ను కోర్టు ముందు మూవ్ చేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి సచీలుడైతే విచారణ ఎదుర్కోవాలి
ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ తన కుటుంబ సభ్యులకు, అనుయాయులకు లబ్ధి చేకూర్చడం ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని నేను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాగా, న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అని చెప్పారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలుడైతే విచారణను ఎదుర్కోవాలన్నారు . శ్రీరాముడు సీతకు అగ్నిపరీక్ష పెట్టినట్టుగా, మా పార్టీ ఎంపీ నాకు అగ్నిపరీక్ష పెట్టారని భావించి సిబిఐ విచారణకైనా సిద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాక్షి దినపత్రికను అమ్ముకోవడానికి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని, సిమెంటు పోర్టల్ ద్వారా తన కుటుంబ కంపెనీ సిమెంట్ తో పాటు, సహా నిందితుల కంపెనీల సిమెంటు అధికారికంగా విక్రయిస్తున్నారు. స్మార్ట్ గా ఇసుక కుంభకోణానికి పాల్పడుతున్నారని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడం జరిగిందన్నారు.

LEAVE A RESPONSE