Suryaa.co.in

National

చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

ముంబయి: కళ్లెదుట హఠాత్తుగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను చేతి కర్రతోనే తరిమికొట్టారు. ముంబయి శివారులోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.స్థానికంగా నివసించే నిర్మలాదేవీ సింగ్‌ బుధవారం రాత్రి చేతి కర్ర ఊతంతో నడుచుకుంటూ వచ్చి ఇంటి ప్రాంగణంలో కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఓ చిరుత నక్కి ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేదు.
ఈ క్రమంలో అదను చూసిన చిరుత.. ఆమెపై దాడికి దిగింది. అనుకోని ఘటనతో ఆమె వెనక్కుపడిపోయింది. వెంటనే తేరుకొని, తన చేతికర్రతోనే చిరుతను ప్రతిఘటించింది. దీంతో


కొద్దిసేపటికి చిరుత అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పగాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో చిరుత దాడి జరగడం మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతన్ని రక్షించారు. ఆరే కాలనీ ముంబయి శివారు ప్రాంతం కావడం, చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో.. ఈ తరహా ఘటనలూ గతంలోనూ చోటుచేసుకున్నాయి.

LEAVE A RESPONSE