Suryaa.co.in

Andhra Pradesh

మహిళలే మహరాణులు

-మహిళల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తా
– విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి

మహిళల ఆర్థికాభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం సితార వద్ద ఉన్న కన్వెన్షన్ సెంటర్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుజనా చౌదరికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ కేఎల్వీ సతీష్ కుమార్ స్వాగతం పలికారు.

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా తమలోని నైపుణ్యాలతో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సుజనా చౌదరి ప్రశంసించారు. మహిళల్లో చైతన్యం రావాలని, ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని ఉద్బోధించారు. మహిళల్లో శక్తిసామర్థ్యాలు నైపుణ్యాలు అధికంగా ఉన్నాయని వారిని ప్రోత్సహిస్తే ఆనందమయ కుటుంబంతో పాటు మంచి సమాజానికి పునాది ఏర్పడుతుందన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తనకు మహిళా సంక్షేమం మీద పూర్తి అవగాహన ఉందన్నారు.

మహిళలు పారిశ్రామిక వ్యాపార రంగంలో రాణించేలా ఒక లక్ష్యంతో పని చేస్తున్నానని అన్నారు. మహిళలు సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ పరిజ్ఞానం కూడా అలవర్చుకుని రాజకీయాల్లోకి రావాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి మహిళల కోసం 33% శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. మహిళలందరూ రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని కోరారు.

మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తానని నియోజకవర్గ ప్రజలకు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు రానున్న ఎన్నికల్లో తనని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ గవర్నర్ పాలకుర్తి గాయత్రి, టీడీపీ యువ నాయకులు డూండీ రాకేష్, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE