Suryaa.co.in

Andhra Pradesh

బాబుతో యనమల భేటీ

– లేఖపై వివరణ
– దురుద్దేశం లేదని స్పష్టీకరణ

అమరావతి: ఇటీవల కాకినాడ సెజ్‌లో భూములు కోల్పోయిన బీసీ సైతులు, మత్స్యకారుల భూములు వెనక్కి ఇచ్చేయాలంటూ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాసి సంచలనం సృష్టించిన మాజీమంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. సచివాలయానికి వచ్చిన యనమల, సీఎం బాబుతో దాదాపు ముప్పావుగంట సేపు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా యనమల, తాను రాసిన లేఖకు వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు ఎలాంటి దురద్దేశం లేదని, సెజ్‌లో తక్కువ ధరకు భూములు అమ్మి నష్టపోయిన స్థానికుల మనోభావాలు, మీ దృష్టికి తీసుకువచ్చేందుకే లేఖ రాసినట్లు యనమల వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక బీసీ నాయకుడిగానే స్పందించాల్సి వచ్చిందని బాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

పార్టీని ఇబ్బందిపెట్టే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని యనమల స్పష్టం చేసినట్లు సమాచారం. తన లేఖ తర్వాత మీడియా, సోషల్‌మీడియాలో వచ్చిన వివిధ కథనాల నేపథ్యంలో.. వాస్తవ పరిస్థితులు వివరించేందుకే వచ్చినట్లు యనమల చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు సైతం యనమల వివరణతో సంతృప్తి చెందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A RESPONSE