Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ రెడ్డి టాప్

అడ్డూ అదుపూ లేని అప్పులతో గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థ
– యనమల రామకృష్ణుడు

అవసరం కోసం వాడుకుని, అవసరం తీరాక నిలువునా వంచించి వదిలేయడంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టాప్ ర్యాంకర్. అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. తమ అనైతిక చర్యలకు, అక్రమ అరెస్టులకు గౌతం సవాంగ్ ను అడ్డగోలుగా వాడుకుని.. ఇప్పుడు అవమానకర రీతిలో గెంటేశారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఘోరాతి ఘోరంగా అవమానించారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నిర్వహించే సీఎస్, డీజీపీల బదిలీలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా పని చేసే మ్యూజికల్ చైర్ గా మార్చేశారు. గతంలో సీఎస్ గా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అని పిలుస్తూనే.. ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసి అవమానించారు.

ఇదే విధంగా పీవీ రమేష్, అజేయకల్లాం వంటి వారి పట్ల అవమానకర రీతిలో అధికారాల్లో కోత విధించి పొమ్మనకుండా పొగబెట్టారు. న్యాయమూర్తుల మీద విషం కక్కే పనిని అజేయ కల్లంతో చేయించిన జగన్ రెడ్డి….పని అయిపోగానే ఆయనను పక్కన పెట్టారు. దీంతో సిఎంవో అంతా నాదే అనుకున్న స్థానం నుంచి అసలు సిఎంవోకు వెళ్లడానికీ అనుమతి లేని స్థితికి దిగజార్చారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతా నీవే అన్న ప్రవీణ్ ప్రకాశ్ ను రాష్ట్రం దాటి కనీసం ఎలాంటి ప్రాధాన్యం లేని ఢిల్లీ లోని ఏపీ భవన్ కు తరిమేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్నా, తమ్ముడూ మీరే నన్ను నడిపించాలన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు అడ్డగోలుగా తరిమేస్తూ ఉద్యోగుల్ని తీవ్రంగా అవమానిస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలి. తన అవినీతికి, అక్రమాలకు సహకరించని వాళ్లు ఎవరైనా.. తన కాళ్ల కింద పడి బాధితులుగా మారాల్సిందే అనేలా జగన్ రెడ్డి తీరు ఉంది.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. మరోవైపు.. ఆస్తులు తాకట్టు పెట్టి, భూములు అమ్మకానికి పెట్టి భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. కానీ.. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా అందించలేకపోవడం రాష్ట్రంలో లోపించిన ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేశారు. వారంలో రద్దు చేస్తానని ఘంటాపథంగా చెప్పిన సీపీఎస్ పై అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్ల పాటు కమిటీల పేరుతో కాలయాపన చేసి, తర్వాత తెలియక హామీ ఇచ్చామంటూ తప్పించుకున్నారు. పీఆర్సీ ఇచ్చేశామంటూ చెప్పుకుంటూ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఎప్పుడిస్తారో తెలియని దుస్థితి నెలకొంది. ఉద్యోగుల జీతాలనే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

జగన్ రెడ్డి దుబారా, లూటీతో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసింది. కరోనాను బూచిగా చూపించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా రూపాయి పెట్టుబడి తేలేదు. పరిశ్రమ ఏర్పాటు కాలేదు. కానీ.. సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశారు. వచ్చిన పెట్టుబడుల్ని కమిషన్ల కక్కుర్తితో తరిమేశారు. సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఘోరంగా తయారు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఆర్ధిక అత్యయిక పరిస్థితి కల్పించారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలి. లేకుంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

LEAVE A RESPONSE