Home » వైసీపీ క్రిమినల్స్ కూ ఓ వెబ్ సైట్ ఉండాలి!

వైసీపీ క్రిమినల్స్ కూ ఓ వెబ్ సైట్ ఉండాలి!

(భోగాది వేంకట రాయుడు )

మన వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు గెలవడమో… ఓడడమో పెద్ద విషయం కాదు. ఏదో ఒక పార్టీ చెప్పే, ప్రచారం చేసే అబద్దాలకు, ప్రలోభాలకు, కుల… మత… ప్రాంత ప్రభావాలకు ఓటర్లు ప్రభావితం కావడాన్ని కూడా మనం గత డెబ్భై ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం.

ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన వారో, వారి అనుయాయులో ఎంతో కొంత అవినీతి…. అక్రమాలకు పాల్పడడాన్ని కూడా చూస్తూనే వున్నాం.

కానీ, ఇదేమిటి? ఈ అరాచకం ఏమిటి ? ఈ దోపిడీ ఏమిటి? ఈ దౌర్జన్యం ఏమిటి? ఈ ఐఏఎస్ లు ఏమిటి? ఈ ఐపీఎస్ లు ఏమిటి? అర్ధ రాత్రిళ్ళు ఇళ్ల మీద పడి, తలుపులు పగల కొట్టి ఈ దొంగ కేసులు ఏమిటి? ఇసుకలు, కొండలు, భూగర్భ వనరులు తవ్వి పోసే రాజకీయాసురులకు రక్షణ వలయంగా ఏర్పడి, ప్రశ్నించిన వారిని జైళ్లకు తరలించడం ఏమిటి?

ఈ మిడతల దండు ఎక్కడినుంచి వచ్చి…. పచ్చటి ఆంధ్రప్రదేశ్ పై వాలింది? వీరిలో ఒక్కరైనా ప్రజా జీవనానికి అర్హులేనా?
వీరిలో అత్యధికులకు పౌర సమాజం లోని జన జీవన స్రవంతి లో కలిసి జీవించే అర్హత ఉందా?
ఈ నరరూప తోడేళ్ల మంద తో కూడిన పార్టీ మరోసారి అధికారం లోకి వచ్చి ఉన్నట్టయితే…!!?
తలుచుకోడానికే భయం వేస్తున్నది. వెన్నులో వణుకు పుడుతున్నది.
ఏ రాజకీయ పార్టీ లో అయినా కొద్దో గొప్పో అవాంఛనీయ శక్తులు ఉండడం సహజం.

కానీ, గ్రామానికో ఇసుకాసురుడు,మండలానికో మరీచుడు, నియోజకవర్గానికో ఖనిజాసురుడు, అడుగడుగునా మారీచులు. ఎటుచూసినా రాక్షస గణం తో ఆంధ్ర రాష్ట్రం తల్లడిల్లి పోయింది. నోరేత్తితే కేసు. కాలు కదిపితే కేసు.
గోరు చుట్టుమీద రోకటి పోటు అన్న సామెత చందం గా… తాడు, బొంగరం లేకపోయినా…రాష్ట్రాన్ని మడిచి జేబులో పెట్టేసుకుని, రాష్ట్ర రాజకీయ యవనికపై గజ్జె కట్టి ఆడిన సజ్జల రామకృష్ణారెడ్డిని చూసినప్పుడు, రాష్ట్ర రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందో కదా అంటూ గుండెలు పిండేసినట్టు అయిపోయేది.

రాష్ట్రానికి పట్టిన ఈ రాజకీయ పీడ విరగడ అయింది. అయితే, ఈ రాజకీయాసురులు ప్రజల పట్ల, సమాజం పట్ల, వ్యవస్థల పట్ల పాల్పడిన అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీలను నియోజకవర్గ వారీగా వెలికి తీసి, నిగ్గు తేల్చి, చట్టానికి అప్పగించడం తో పాటు ;
వీరందరి ఫోటోలు, పాల్పడిన అక్రమాలతో ఒక వెబ్ సైట్ ను పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావలసిన అవసరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు రావాలి.
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు వారు మాత్రమే కాదు, ఈ భూగోళం పై ఎక్కడ నివసించే తెలుగువారికైనా ఈ రాజకీయాసురుల గురించి తెలియాలి.

*సీబీఐ, లేదా పోలీస్ వెబ్ సైట్ లలో క్రిమినల్స్ వివరాలు ఉన్నట్టే, గత అయిదేళ్ళల్లో ప్రజలపట్ల, సమాజం పట్ల, వ్యవస్థల పట్ల సమస్త అపచారాలకు పాల్పడిన రాజకీయాసురులు, పోలీసాసురులు, అధికారాసురులు, బ్రోకరాసురుల వివరాలు, వారి నిర్వాకాల తో కూడిన వివరాలతో ఒక వెబ్ సైట్ అనేది తక్షణావసరం గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి.

*నియోజకవర్గానికి ఒక డీ ఎస్పీ ని ప్రత్యేకం గా నియమించి, ఆ నియోజక వర్గం లో నిరాఘాటం గా సాగిన దౌర్జన్య కాండ కు బాధితులైన వారి నుంచి అధికారికం గా ఫిర్యాదులు స్వీకరించి, ఆ ఫిర్యాదుల మేరకు ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయాలి.

*బాధితులు ఆధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా, ప్రతి ఎస్పీ కార్యాలయం లో ఒక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసి, దానిని ఒక్క జిల్లా ఎస్పీ, లేదా ఎస్ పి అనుమతి పొందిన అధికారి తెరిచి చూసే విధం గా ఏర్పాటు చేయాలి.

*ఈ ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదు చేయాలి.
*వీటిని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం లో ప్రత్యేకం నియమితులయ్యే అడిషనల్ డీజీ స్థాయి పోలీస్ అధికారి రోజువారీ మానిటర్ చేయాలి. ఈ మొత్తం రెండు, మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నిందితులందర్నీ రౌండ్ అప్ చేయాలి.

*ఈ కేసుల విచారణకు ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ఒక ఏడాదిలో మొత్తం మురికిని శుభ్రం చేయాలి.
*నిందితుల వివరాలు, వారి అకృత్యాలను ఒక ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపర్చాలి.
*ఎవరు ఏ అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలియాలి.
ఇదంతా రాజకీయం కాదు. రాజకీయ వేధింపు చర్య కాదు. చంద్రబాబు నాయుడు కు, పవన్ కళ్యాణ్ కు ప్రజలు అప్పగించిన చారిత్రిక బాధ్యత. వారి పవిత్ర కర్తవ్యం.
175 స్థానాలకు 164 స్థానాలను పాలకపక్షానికి ప్రజలు అప్పగించడం లోని పరమార్ధం ఏమిటో కొత్త ప్రభుత్వం గుర్తించాలి.

వారి, లేదా అటువంటి వారి బెడద నుంచి తమను శాశ్వతం గా విముక్తి చేయమని వారు కోరుకుంటున్నారు. ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ బాధ్యత లో వారు విఫలమైతే, తెలుగు సమాజం వారిని క్షమించదు.

ఒక చారిత్రక బాధ్యత ను నెరవేర్చే పవిత్ర కర్తవ్యాన్ని ప్రజలు చంద్రబాబు నాయుడు కు అప్పగించారు.
హామీలు, ఉచితాల గురించి తెలుగు ప్రజలు ఆందోళన చెందడం లేదు. తాము నిర్భీతిగా, స్వేచ్ఛగా, సగౌరవం గా జీవించే హక్కు పునరుద్ధరణ కోసం ఆందోళన చెండుతున్నారు.
వారు కష్ట పండగలరు, సంపాదించుకోగలరు, తమ పిల్లలకు చదువు సంధ్యలు చెప్పించుకోగలరు. కానీ, వారికి కావలసింది రాజకీయాసురులు, ఆవారాసురుల నుంచి రక్షణ.
చంద్రబాబు నాయుడు అది గమనిస్తే ; ఆయనకు ఎదురు లేని అధికారం అప్పగించిన తెలుగు తల్లి ఆశయం నెరవేరినట్టే.

భోగాది వేంకట రాయుడు

Leave a Reply