-
వైసీపీ ఎమ్మెల్యేల డిమాండ్
-
అసెంబ్లీకి వెళ్లకపోతే జనం తిడుతున్నారు
-
మీకు ఓటు ఎందుకు వేశామని నిలదీస్తున్నారు
-
జగన్ రాకపోతే పెద్దిరెడ్డితో నడిపించండి
-
ఎన్టీఆర్ రాకపోతే బాబుతో అసెంబ్లీ నడిపించలేదా?
-
ఇప్పుడు పెద్దిరెడ్డికి పగ్గాలివ్వండి
-
మాకు అనుభవం అక్కర్లేదా?
-
మరి ఎమ్మెల్సీలు ఎందుకు హాజరవుతున్నారు?
-
మాకంటే వాళ్లే ఎక్కువా?
-
వారినీ వద్దని చెప్పే ధైర్యం లేదా?
-
వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ ఎమ్మెల్యేలలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. జగన్, పెద్దిరెడ్డి మినహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావలసిందేనని పట్టుపడుతున్నారు. జగన్ ఇగో సమస్యతో సభకు రాకపోతే, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికయినా పగ్గాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు గళమెత్తుతున్నారు. ప్రజలతో ఎన్నికయిన మమ్మల్ని అసెంబ్లీకి వెళ్లవద్దంటున్న జగన్.. పరోక్షంగా గెలిచిన ఎమ్మెల్సీలను మాత్రం కౌన్సిల్‌కు ఎందుకు అనుమతిస్తున్నారు? వారిని కూడా కౌన్సిల్‌ను బహిష్కరించమనండి అని కొత్త లాజిక్‌కు తెరలేపడం ఆసక్తికరంగా మారింది.
తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు శాసనసభ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఫ్లోర్‌లీడర్ జగన్ వైఖరి, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు. జగన్ ఇప్పటికి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినందున.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ మొదటిసారి గెలిచిన తమకు, శాసనసభ వ్యవహారాల్లో కనీస అనుభవం లేకపోతే ఎలా అని వాదిస్తున్నారు. మాకు ఇప్పటివరకూ శాసనసభలో ఏ రూము ఎవరిదో తెలియదు. అసలు ఎన్ని రూములుంటాయో కూడా తెలియదు. వాటిని తెలుసుకునే అవకాశం జగన్‌సార్ మాకు ఇవ్వడం లేదని ఓ ఎమ్మెల్యే వాపోయారు.
తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను కనీసం అసెంబ్లీలో ప్రస్తావించకపోతే, జనం తమను అసమర్ధులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసెంబ్లీకి వెళ్లకపోతే నువ్వేం ఎమ్మెల్యేవి? అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వెళతావా అని చివరకు సొంత బంధువులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారని వాపోతున్నారు. మేం విడిరోజుల్లో ప్రజలను కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇస్తున్నాం. అయితే తీరా అసెంబ్లీ సమావేశాలప్పుడు మా పార్టీ అసెంబ్లీని బహిష్కరిస్తుంది. మరి అలాంటప్పుడు మేం మా నియోజకవర్గ సమస్యలపై ఎలా మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? పోనీ మంత్రుల వద్దకు వె ళదామా అంటే, మా పార్టీ అందుకు అంగీకరించడం లేదు. ఏం చేయాలో తెలియని దిక్కుమాలిన పరిస్థితి మాది. అసలు ఎమ్మెల్యే ఎందుకయ్యామో కూడా అర్ధం కావడం లేద’’ని ఓ కొత్త ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ప్రజల నుంచి నేరుగా గెలిచిన తమను అసెంబ్లీ సమావేశాలకు రావద్దంటున్న జగన్.. పరోక్షంగా ఎన్నికైన ఎమ్మెల్సీలను మాత్రం ఎందుకు అనుమతిస్తున్నారు? అంటే సంఖ్యాబలం ఉంటేనే సభకు వస్తారా? ఇదేం పద్ధతి అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అలాంటప్పుడు కౌన్సిల్‌ను కూడా బహిష్కరించాలి. పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి లేని ప్రధాన ప్రతిపక్ష నేత హోదా, కౌన్సిల్‌లో బొత్స సత్యనారాయణకు ఎందుకు? అంటే ఇప్పుడు జగన్ గారి కంటే బొత్సకే గౌరవం ఎక్కువ. మరి అలాంటప్పుడు కౌన్సిల్‌ను కూడా బహిష్కరించడమే సబబు కదా? అని మరికొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ జగన్‌కు అసెంబ్లీకి వచ్చేందుకు ఇగో అడ్డువస్తే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసెంబ్లీ పార్టీ పగ్గాలివ్వాలని డిమాండత్ చేస్తున్నారు. జగన్ కంటే పెద్దిరెడ్డి సీనియర్ అని వారు గుర్తు చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌ను హేళన చేసినప్పుడు ఆయన నేను అసెంబ్లీ ముఖం చూడను. మళ్లీ సీఎంగానే అడుగుపెడతానని శపథం చేసి అసెంబ్లీని బహిష్కరించారు. కానీ అంతమాత్రాన టీడీపీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించలేదు కదా? చంద్రబాబునాయుడు, మాధవరెడ్డి, రఘుమారెడ్డి, బొజ్జల, కోడెల, కోటగిరి విద్యాధర్‌రావు లాంటివాళ్లతో ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు కదా? అంతెందుకు 27 మంది ఎమ్మెల్యేలతోనే పీజేఆర్ టీడీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేదా? ఇప్పుడు కూడా జగన్ అదే సిద్ధాంతాన్ని ఎందుకు అమలు చేయరు? అసలు సంఖ్యాబలం లేకపోతే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు’’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.