తాత మనవడు !
వయొలెంట్ లవ్ స్టోరీ . దాసరి సినిమాకు సీక్వెల్ !
తాతగారు !
ఏలూరు దగ్గర … ఒక పల్లెటూళ్ళో… మధ్య తరగతి కుటుంబం లో జన్మించాడు .
ఆత్మ విశ్వాసం , కృషి , పట్టుదల … ఇందనలుగా… అంచెలంచెలుగా ఎదిగాడు .
రతన్ టాటా తో కలిసి చదివాడు .
పారిశ్రామిక వేత్త అయ్యాడు .
కోట్లు గడించాడు.
ముగ్గురు కూతుళ్లు .. ఒక కొడుకు !
పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు .
దాన కర్ణుడు .. తిరుమల కొండకు 50 కోట్లు ఇచ్చాడు .
తాను చదివిన పల్లె బడికి … అయిదు కోట్లు ఇచ్చాడు .
వయసు 85 .
మనవడు !
డబ్బుల్లో పుట్టాడు . తల్లి… తండ్రి తో… విడిపోయింది .
విలాసాల్లో… విచ్చల విడిగా పెరిగాడు .
అడ్డుఅదుపు లేదు . మద్యానికి బానిస అయ్యాడు .
తాతగారి డబ్బు .. అమెరికా లో ఉన్నత విద్యాసంస్థలో సీట్ ఇప్పించింది .
డ్రగ్స్ పిచ్చి పట్టింది . .
ప్రేమ… అనురాగం… ఆప్యాయత … విచక్షణ.. లాంటి మానవ భావోద్వేగాలు మచ్చుకైనా లేవు .నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ .. ఆంటి సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ .
ద్వేషం , పగ ప్రతీకారం .. .
తాతగారి కంపెనీ .
తాగుబోతు… తిరుగుబోతు… డ్రగ్స్ కు బానిస అయిన మనవడికి … కంపెనీ డైరెక్టర్ పదవి ఇస్తే కంపెనీ అందులో పని చేసే ఉద్యోగులు నష్టపోతారు .తాను నాటిన చెట్టు తన కళ్ళముందే కూలి పోతుంది .
అందుకే తాతగారు ఆ పదవి ఈ మృగానికి ఇవ్వలేదు .
ఎంతైనా కూతరు కొడుకు కదా . మమకారం చావదు.బతకడానికి నాలుగు కోట్లు ఇచ్చాడు .
మనవడు !
నేరమయ నవ ప్రపంచానికి ప్రతినిధి .ఈ కాలం కుర్రాడు” తొక్కలో డబ్బుదేముంది . బ్రో . .. చిన్నప్పటి నుంచి తాను నోట్ల కట్టల్లో పెరిగాడు .
డబ్బు ఇచ్చే సుఖాలను అనుభవించడం తెలుసు .కృషి పట్టుదల శ్రమ సహానుభూతి లాంటివి తనకు ఒంటబట్ట లేదు .
వాటి అవసరమేముంది ? తాతగారు సంపాదించింది చాలదా ?
29 ఏళ్ళ వయసు వచ్చింది ..
ఇప్పుడు .. తనకు సమాజం లో గుర్తింపు , గౌరవం కావాలి . పెత్తనం చెలాయించాలి .
అదో తుత్తి. ఎంత సేపు తిని తొంగుంటే మడిషికి గొడ్డుకి తేడా ఏటుంటది ఇగో .. దాన్ని సాటిస్ఫాయి చెయ్యాలి సూట్ వేసుకొని బోర్డు మీటింగ్స్ కు వెళ్ళాలి .ఆర్డర్స్ ఇవ్వాలి . చప్పట్లు కొట్టించుకోవాలి. లీడర్ అని పించుకోవాలి .
తాత ఇచ్చిన నాలుగు కోట్లు ఓకే .” కానీ కంపెనీ కి డ్రైరెక్టర్ చెయ్యమంటే ముసలోడు .. వినడే. ఎంత సేపు వాడు చెప్పిందే నడవాలా? ఎనభై ఏళ్ళు వచ్చినా అంత ఇగో నా ?నేనేంటో చూపుతా . దెబ్బకు అకౌంట్ సెటిల్ అయిపోవాలి . ముసలోడు చావాలి .. కుక్క చావు చావాలి . ”
అందుకే కసి తీరా… పొడిచి… పొడిచి… చంపేశాడు .
ఒక్క సారి కాదు .. మెడ పై … డజను సార్లు .. ఒంటి పై… డెబ్భై సార్లు… .. పొడిచి కసిగా… తనివి తీరా చంపేశాడు .
తల్లి అడ్డొచ్చింది .
” కొడుకంటే ప్రేమ లేదా ?
తనకు సమాజం లో గౌరవం వద్దా? ముసలాడి కి చెప్పొచ్చుగా ?
అందుకే . తాతను పొడిచిన కత్తితోనే .. తల్లిని కూడా పొడిచాడు .
ముసలాడు పోయాడు . తల్లి ఇప్పటికి బతికింది . తనను పోలీస్ లు పట్టుకొంటారని తెలుసు . అయితేనేమి? పగ ప్రతీకారం ముఖ్యం .
తనకు పదవి నివ్వని తాత చావాలి .తల్లి కూడా చావాలి . నవ మాసాలు మోయడం లాంటి తొక్కలో కబుర్లు వద్దమ్మా .తాగమా!.. డ్రగ్స్ తీసుకొన్నామా! .. ఎంజాయ్ చేశామా! ..
ఇదే జీవితం .
అవును నాకు జీవితం ఇదే నేర్పింది .నేను ఈ కాలం కుర్రాడిని . ”
నిజ జీవిత కథలో నీతి.
ఆస్తులు సంపాదిస్తారు ..పిల్లలు… మనవలు … మానవరాండ్రు… చల్లగా ఉండాలని … వారి కష్టం కూడా మీరే పడుతూ ..వారికి కష్టం తెలియక .. కష్టపడాల్సిన అవసరం లేకుండా .. వారి బతుకు కూడా మీరే బతికేస్తారు .
డబ్బు సంపాదనలో మీరు … .
డబ్బు కావాలి .డబ్బు సంపాదించాలి .నిజమే .
కానీ బాలన్స్ తెలియాలి గా? ..
పిల్లకు కేవలం డబ్బే ఇచ్చి .. .. మీ సమయం ఇవ్వక .. పెంచితే ?
వారు మృగాలు అవుతారు .రాక్షసులు అవుతారు .
తప్పెవరిది ?
మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఇలాగే పెంచారా ?
డబ్బు ఇవ్వకపోయినా వారు… మీకు సమయం ఇచ్చారు . ప్రేమ… అనురాగం… ఆప్యాయత నేర్పారు .
మరి మీరు ?
చంద్రునిలో కుందేలు ఉందని మీరు మాత్రమే విన్నారు . గోరు ముద్దలు తిన్న.. అనగనగా తో… మొదలెట్టి కంచికి కి చేరే దాక … కథలు విన్న … చివరి తరం మీది .
” ఈ కాలం యువత… సెల్ ఫోన్ కు… నీలి చిత్రాలకు… మద్యానికి… డ్రగ్స్ కు బానిస అని మీ పెద్దలు అంటున్నారు .మీరు మాత్రం సంపాదన వ్యసనపరులు కాదా ? స్టేటస్ పిచ్చి మీకు లేదా ?మా బాల్యాన్ని దోచిన దొంగలు ఈరు కదా ?
మీరున్నది ఒక తీరు .. మమ్మల్నే తప్పు పడుతారు ఎందుకు ?”
… యువ ఘోష .
మీరు సంపాదించిన డబ్బు .. దిండు కింద నాగు !
చేతిలో డబ్బు .. ఇంట్లో … తల్లితండ్రి ప్రేమ కరువు … . చెడు సావాసాలు .
.. చెడిపోరా ?
అసలు మంచి- చెడు అంటే ఏంటో వారికి బాల్యం లో నేర్పారా ?డబ్బు తో చదువు కొన్నారు .కారు కొన్నారు . బంగాళా కొన్నారు .కానీ .. మానవత్వాన్ని కొనగలరా ?
మీకు డబ్బే ముఖ్యం .అందుకే మీ డబ్బే మీకు …ఇప్పుడు… ఉరితాడు .
మానవత్వం నేర్వని నేటి కుర్రరికం ..డబ్బు పిచ్చి పట్టిన పెద్దరికం పై పగ తీర్చుకొంటోంది .
అయ్యో పెద్దాయనా!
మధ్య తరగతి నేపథ్యం .. డబ్బు పెద్దగా లేకపోవడం .. మీలో కసి పెంచింది . కష్టించి పని చేసేలా చేసింది . నాయకత్వ లక్షణాలు అలవాటు చేసింది .
తరం మారింది . కూతురు మీ ఇంట్లో ఉంది . కొడుకును ఎలా పెంచిందో చూడు !
వాడి పెంపకం .. కుటుంబ నేపథ్యం .. విలాసాలకు బానిస చేసింది . పాజిటివ్ భావోద్వేగ లక్షణాలు చంపేసింది . ఏంటి నీకు ఈ శిక్ష పెద్దాయనా !
డబ్బు సంపాదించాలి .
నిజమే . అంత కంటే పిల్లల్ని ఎలా పెంచాలో నేర్వాలి .వారితో టైం గడపాలి . వివాహ కుటుంబ వ్యవస్థలను గౌరవించాలి .
– అమర్నాధ్ వాసిరెడ్డి