– హత్యా రాజకీయాలు, బూతు పదజాలం, నేర ప్రక్రియ వల్లనే పార్టీ భ్రష్టు పట్టింది
– రౌడీ షీటర్ కు వత్తాసు… సిగ్గుచేటు
– వైసీపీ అధిష్ఠానానికి ప్రశ్నలు సంధించిన పచ్చల శ్యామ్
మంగళగిరి : వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ కార్యకర్తల సమస్యలను గాలికి వదిలారని, వారి సమస్యలపై మాట్లాడలేదని మంగళగిరి వైసీపీ దళిత నాయకుడు, వైఎస్ఆర్సిపి మాజీ గుంటూరు పార్లమెంటు అధికార ప్రతినిధి, మంగళగిరి నియోజకవర్గ బూత్ కమిటీల కన్వీనర్, న్యాయవాది పచ్చల శ్యామ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్లు గత తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడుతూ బాధితులుగా ఉంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ కేసులు అంటూ ఈరోజు గగ్గోలు పెడుతున్నారని కానీ తమ వైసీపీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి నివసిస్తున్న ఇదే నియోజకవర్గంలో నిడమర్రు గ్రామంలో దళితవాడలోని పదిమంది కుర్రవాళ్లను, మాదిగ యువకులను నక్సలైట్లుగా, తీవ్రవాదులుగా కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి నాలుగు రోజులపాటు కాళ్లు చేతులు విరగ్గొట్టినప్పుడు తమ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పటి శాసన సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అక్రమ కేసులు పెట్టించి దారుణంగా వ్యవహరిస్తే ఆనాడు మీరు ఎక్కడికి వెళ్ళారని ఆయన ప్రశ్నించారు.
కృష్ణాయపాలెంలో ఎస్సీల పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్లు పెట్టించిన ఘన చరిత్ర మన వైసీపీ ప్రభుత్వాని దేనిని అప్పటి ఎమ్మెల్యే ఆర్కే నియంతలా వ్యవహరించి వారిని రిమాండ్కు పంపిన ఘటన మీకు గుర్తు చేస్తున్నానని తెలిపారు. ప్రాతూరు గ్రామంలో మన పార్టీ వారే ఇల్లు కట్టుకోవడానికి ఇసుక తీసుకెళ్తే స్టేషన్ కి పిలిచి గుల్ల గుల్లగా కొట్టించిన ఘనత అప్పటి మన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నే కదా అని తెలిపారు. అప్పటి దుగ్గిరాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న ముత్తయ్యకు కనీసం విలువ లేకుండా చేసింది మన వైసీపీనే, అప్పటి శాసన సభ్యుడు ఆర్కే నే అని తెలిపారు.
మన వైసీపీ హయాంలో దళితులపై జరిగిన అన్యాయంపై గురించి మాట్లాడాలని తెలిపారు. మంగళగిరిలో జరిగిన బీసీ నాయకుని హత్య కేసులో నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తి వేమారెడ్డి అని అది తనకూ తెలుసునని, అధికారంలో ఒకలాగా లేనప్పుడు మరోలాగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు