– కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది
– పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్నా
– ఇదేనా నాకు పార్టీ ఇచ్చే బహుమతి?
-నాకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారు
– బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు ఇస్తారా?
– కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి అసమ్మతి గళం విప్పారు. తనకు మంత్రి పదవి రానందుకు మరోసారి నిరసన స్వరం వినిపించారు. తనను పార్టీ మోసం చేసిందని కన్నెర్ర చేశారు. సొంత ఆస్తులు అమ్మి పార్టీని కాపాడినందుకు నాకు ఇచ్చే బహుమతి ఇదా అంటూ అగ్గిరాముడయ్యారు.
కాంగ్రెస్‌లోని కొందరు నాయకులే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని ఆరోపించారు.
రాజగోపాల్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..”కాంగ్రెస్ పార్టీని కాపాడటం కోసం నేను నా సొంత ఆస్తులు అమ్ముకున్నాను. అయినా పార్టీ నన్ను మోసం చేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి, ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ, పార్టీ కోసం కష్టపడిన నన్ను మాత్రం పక్కన పెట్టారు”