Suryaa.co.in

Andhra Pradesh

సిండికేట్‌ తో మామిడి రైతును దోచుకునేందుకు వైసీపీ పన్నాగం!

– ఏపీఎస్‌ఏఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణ

మంగళగిరి: మామిడి రైతుల కష్టాలను రాజకీయంగా ఉపయోగించుకునే వైఎస్సార్‌సీపీ నాయకుల వైఖరిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ (ఏపీఎస్ఏఎం) వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళగిరి టీడీపీ కేంద్రకార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని విస్మరిస్తూ, వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , ఆ పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్చుకోలేక, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో గుమ్మరిస్తున్నారని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో రాష్ట్రం వ్యవసాయ రంగంపైనే ఆధారపడిందని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను రాజుగా చూడాలంటే వ్యవసాయం బలోపేతం కావాలని, ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోందని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత నాలుగైదు నెలల్లో, పంటల సేకరణ తర్వాత ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్టు తెలిపారు. ప్రతి గింజను కొనుగోలు చేసిన ప్రభుత్వం, మార్కెట్ జోక్యం ద్వారా మిర్చి, కోకో, పొగాకు, మామిడి రైతులకు ధరల సమస్యలు ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. వాతావరణం అనుకూలించకపోవడం, దిగుబడులు తగ్గడం, లేదా మార్కెట్ ధరలు సరిగా లేకపోవడం వంటి సమస్యల నుండి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

రాయలసీమలో, ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు తమ రాజకీయ ప్రభావం, స్థానిక ఫ్యాక్టరీలతో సంబంధాలను ఉపయోగించి మామిడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది మామిడి ఉత్పత్తి 6.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరగా, గత ఏడాది 2.5 లక్షల టన్నులతో పోలిస్తే దిగుబడి గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ నాయకులతో సంబంధం ఉన్న పీఎల్ఆర్ ఫుడ్స్, సీజీఆర్ ఫుడ్స్, టాసా, సన్నిధి వంటి కంపెనీలు రైతుల నుండి కిలో రూ.3కే మామిడిని కొనుగోలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వం నిర్దేశించిన కిలో రూ.8 ధరకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. పీఎల్ఆర్ ఫుడ్స్‌లో డైరెక్టర్లుగా ఉన్న పెద్దిరెడ్డి ఇందిర, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులేనని, వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రకాష్ రెడ్డికి చెందిన సీజీఆర్ ఫుడ్స్ కూడా రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి, మామిడి రైతుల కష్టాలను దోచుకునే ప్రయత్నం చేస్తూ, కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ ఎగుమతులు లేక మిగిలిపోవడం వల్ల మార్కెట్ ధరలు తగ్గాయని, అయినప్పటికీ ప్రభుత్వం రైతులకు కిలోకు రూ.4 సబ్సిడీ అందిస్తూ, మొత్తం కిలో రూ.12 ధరను నిర్ధారించేందుకు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కర్ణాటకలో మామిడి కిలో రూ.16కు కొనుగోలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి కర్ణాటకలో మండీల వద్ద కిలో రూ.2, ఫ్యాక్టరీల వద్ద రూ.4కే కొనుగోలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం కిలో రూ.8 కొనుగోలు ధరను నిర్ధారించి, అదనంగా రూ.4 సబ్సిడీ అందిస్తోందని ఆయన తెలిపారు.

కూటమి ప్రభుత్వం రైతులకు అండ

మామిడి రైతుల నష్టాలను తగ్గించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మామిడి పల్ప్‌పై 12% జీఎస్టీని పూర్తిగా తొలగించాలని, పండ్ల రసాల ఆధారిత జ్యూస్‌లపై జీఎస్టీని 12% నుండి 5%కు తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.

వైఎస్సార్‌సీపీ దిగజారుడుతనం

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలను నిర్వాకంతో పీడించారని, ఇప్పుడు సిగ్గూశరం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ చిత్తూరు జిల్లాకు వెళ్తాననడం దిగజారుడుతనానికి నిదర్శనమని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలను రాజకీయంగా ఉపయోగించుకుని, పొదిలిలో గతంలో జరిగిన సంఘటనలను పునరావృతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఈ పరిస్థితిని ప్రజలు గమనించి నిజాలను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

 

LEAVE A RESPONSE