– తెలంగాణ అభివృద్ధి కోసం న మోదీ ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది.
– దీనిపై కాంగ్రెస్ చర్చకు సిద్ధమా?
– ఏఐసిసి అంటే ఆలిండియా చీటింగ్ కమిటీ
– ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి ధర్మయుద్ధం
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: మామూలు కార్యకర్తగా పార్టీలో పనిచేస్తూ, సైకిళ్లపై తిరుగుతూ పోస్టర్లు అంటించడం, బ్యానర్లు వేయడం, బూత్ ఏజెంట్‌గా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయడం ద్వారా నా రాజకీయ ప్రయాణం బిజెపిలో ప్రారంభమైంది.విద్యార్థి పరిషత్‌లో ఉన్న సమయంలో ప్రారంభించిన ఉద్యమ స్వభావం, బిజెపిలో కొనసాగించాను.
దేశంలో సొంత మెజార్టీతో బిజెపి ప్రభుత్వం 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ద్వారా అధికారంలో ఉంది. ఇటువంటి బలమైన పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు, పార్టీ అధిష్టానం నమ్మకంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను అప్పజెప్పడం, నేను పనిచేసిన కృషికి గుర్తింపుగా భావిస్తున్నాను.
బీజేపీ అంటే కార్యకర్తల పార్టీ. ఈ రోజు తెలంగాణలో 40 లక్షల మంది కార్యకర్తలు బూత్ స్థాయిలో అహర్నిశలు పనిచేస్తున్నారు. బీజేపీ బలోపేతం వెనుక వేలాది మంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయి. వారి ప్రాణత్యాగాలే బిజెపిని 14 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేను కూడా ఒక కార్యకర్తగా అహోరాత్రులు పార్టీ కోసం కృషి చేశాను.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు రెండు విఫలమైన ప్రభుత్వాలు. ఈ రోజు తెలంగాణ ప్రజలు బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ప్రజలు బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలనే భావనతో ఎదురుచూస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇచ్చింది. రైతులు, మహిళలు, విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, “డబ్బుల్లేవు… ప్రభుత్వం భిక్షాటన స్థితిలో ఉంది… ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని ఏడుస్తోంది.
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ హామీలు ఎలా ఇచ్చింది? ఇది ప్రజలను మోసం చేసే ఆలోచనే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి వాటిలో ఏవీ అమలు చేయలేదు. రైతుల రుణ మాఫీను పూర్తిగా చేయకుండా మధ్యలో నిలిపివేశారు. రైతు భరోసా పేరుతో రూ. 15 వేలు ఇస్తామని చెప్పి రూ. 12 వేలకు తగ్గించారు. ఇప్పటివరకు రెండు దఫాలు మోసం చేశారు. మళ్లీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా రూ. 6 వేలు చొప్పున మాత్రమే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
రైతులను మోసం చేస్తే, దగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. బిజెపి పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్న కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.
“తెలంగాణలో యూరియా లేదంటూ” దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా కొరత యూపీఏ ప్రభుత్వంలోనే వచ్చింది. ఆ సమయంలో యూరియాకు రైతులు షాపుల ముందు క్యూలలో నిలబడాల్సి వచ్చేది. యూరియా దొరక్క రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జరిగాయి.
కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన మేరకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మంజూరు చేసింది. కేంద్రం పంపిన యూరియాను సకాలంలో సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ యూరియాను ఏమయ్యిందో చెప్పాలి. యూరియా సరఫరా విషయంలో బిజెపి చర్చకు సిద్ధంగా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా?
కాంగ్రెస్ నిర్వహించిన “సామాజిక న్యాయ సమర భేరి” సభలో మోదీ , బిజెపి, ఆర్ఎస్ఎస్‌ను విమర్శించడమే తప్ప సామాజికంగా వెనుకబడిన వర్గాల గురించి కనీసం మాట్లాడలేదు. దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కాంగ్రెస్ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుతూ వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడించారు. బిజెపి ప్రజల కోసం పనిచేసే పార్టీ, కాంగ్రెస్ అధికారం కోసం, అవినీతి కోసం పనిచేసే పార్టీ.
ఏఐసిసి అంటే ఆలిండియా చీటింగ్ కమిటీన్నట్టుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్.
అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల మధ్య విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఇంత తక్కువ కాలంలో ఇంతటి వ్యతిరేకత వచ్చిన పార్టీ మరొకటి లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధిచెబుతారు.
నిన్నటి సభలో భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 ఎమ్మెల్యేలు, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. బహుశా ఆ కాంగ్రెస్ నాయకులు టంగ్ స్లిప్ అయి మాట్లాడినట్లున్నారు. 100 మంది ఎమ్మెల్యేలు, 15 ఎంపీ సీట్లు బిజెపి గెలుస్తుందని చెప్పబోయి పొరపాటుగా కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు “కాంగ్రెస్ ముక్త్ భారత్” అని నినదిస్తారు. ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి ధర్మయుద్ధం చేస్తుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బిజెపి మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి ఇస్తామని చెప్పి ఆ హామీని మర్చిపోయారు. సంపదతో ఉన్న తెలంగాణను భిక్షాటన చేసే స్థితికి తీసుకువచ్చారు. బిజెపి నాయకులు అందరి సహకారంతో, కార్యకర్తల బలంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ల నుంచి జడ్పీటీసీల వరకు అన్ని సీట్లలో బిజెపి పోటీ చేస్తుంది. అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది. హర్యానా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ప్రజలు బిజెపిని గెలిపించినట్లుగా తెలంగాణలోనూ గెలిపిస్తారు. బిజెపి పరిపాలనలో అవినీతి ఉండదు, అబద్ధాలు ఉండవు.
తెలంగాణను వికసిత రాష్ట్రంగా మార్చేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. అందుకు కార్యకర్తలంతా కృషి చేయాలి. బీజేపీ బలోపేతం అవుతోంది. త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. “సెక్యులరిజం”, “సోషలిజం” వంటి పదాలు కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ తర్వాత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. కాంగ్రెస్ మతపరమైన రాజకీయాలతో ఈ పదాలను చేర్చింది.దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను కాలరాసిన పార్టీ కాంగ్రెస్.
ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత సైనికుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడే వాళ్లు ప్రజల ముందుకి వచ్చి క్షమాపణ చెప్పాలి. బడుగు, బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం కృషిచేస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి మోదీ బ్యాక్‌వర్డ్ క్లాస్‌కు చెందినవారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సగం మందికిపైగా ముఖ్యమంత్రులు బ్యాక్‌వర్డ్ వర్గాలకు చెందినవారే ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి విశేష ఆదరణ లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు, లోక్‌సభలో 8 ఎంపీ స్థానాల్లో గెలుపుతో పాటు, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లలో విజయం సాధించాం. ఇవి బిజెపి బలపడుతున్న సంకేతాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు శాతం స్థిరంగా పెరుగుతుండటం ప్రజల విశ్వాసానికి నిదర్శనం.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. అసలు ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆలోచన లేదు. కేవలం బీసీలను బిజెపి పార్టీ నుంచి డైవర్ట్ చేసేందుకే రిజర్వేషన్ల హామీ ఇచ్చింది.
42 శాతం రిజర్వేషన్ల విషయంలో తీసుకొచ్చిన బీసీ బిల్లుకు బిజెపి మద్దతు ఇచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయే సమయానికి రాష్ట్రంలో లక్షా 30 వేల ఉద్యోగ ఖాళీలు ఉండేవి. మరి ఆ ఖాళీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదు..? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ చర్చకు సిద్ధమా..?