– విలువల్లేని జర్నలిజం.. వలువల్లేని రాజకీయం
– హత్యకేసులో నిందితుడి మాటలు మీకు ప్రధాన శీర్షికలా..?
– ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిజం విలువలింతేనా..?
– బాబు అండ్‌కో ఆర్గనైజ్డ్ కథనాలే అప్రూవర్ దస్తగిరి నోటివెంట..
– ప్రజలకు అవసరం లేని అంశాలపై పుంఖానుపుంఖాలుగా కట్టుకథలా..?
– బాబు అండ్ కో డైరెక్షన్‌లో సీబీఐ డ్రామాలు
– అందులో భాగంగానే నోటీసులు, అరెస్టులు
– పొలిటికల్ టార్గెట్‌గా ఎంచుకోవడంతోనే భాస్కర్‌రెడ్డి అరెస్టు
– ఎంపీ అవినాశ్ కూడా అరెస్టంటూ ఎల్లోమీడియా అత్యుత్సాహం
– సుప్రీం తప్పు పట్టినా.. మారని సీబీఐ పంథా
– ఏ ఒక్క కొత్త ఆధారం అన్వేషించకుండా.. వ్యక్తుల టార్గెట్‌గా విచారణ
– సీబీఐ దర్యాప్తు అంతా ఫార్సు..
-వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
వారి డైరెక్షన్ లోనే సీబీఐ..?
వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి, నోటీసుల జారీ, వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టు, రిమాండ్‌కు పంపడం, చివరికి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి విచారణ వంటి పరిణామాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎంపీ అవినాశ్‌రెడ్డి కి సీబీఐ హైకోర్టు ముందస్తు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, సీబీఐ దర్యాప్తు సంస్థ ఈ కేసుకు సంబంధించి ఏమాత్రం ఆలోచనలు లేకుండా విచారణ పూర్తికావచ్చిందనే వాతావరణం కలిగింపజేయడం అందరికీ తెలిసిందే. వీటన్నింటినీ పరిశీలిస్తే.. సీబీఐ విచారణ అంతా ఎల్లోమీడియా, వారు వత్తాసుపలికే రాజకీయ నాయకుల డైరెక్షన్‌లతోనే నడుస్తుందేమో అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
బాబు పొలిటికల్ అజెండాలో భాగంగానే రచ్చః
సీబీఐ విచారణ ఒకపక్కన జరగుతూ ఉండగానే, ఈ కేసుకు సంబంధించి ప్రజలకు రోజువారీగా వినిపిస్తున్న మాటలు.. పదాలు చూస్తే మీడియాలో ప్రచురిస్తున్న కథనాలు, హెడ్డింగులను బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ పొలిటికల్ వ్యూహంలో భాగంగా వివేకానందరెడ్డి హత్యకేసును వాడుకోవాలని.. రేపు ఎన్నికలకు కూడా ఇదే అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని పావులు కదుపుతున్నట్లు కనిపిస్తుంది. ఏదొకటి చేసి ఉన్నపళంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయడం, అర్జెంట్‌గా చంద్రబాబును అధికార కుర్చీలో కూర్చొబెట్టాలనేది ఎల్లోమీడియా ఆరాటపడుతుంది.
హత్య కేసు నిందితుడి మాటలు మీకు పతాక శీర్షికలా..?
వివేకానందరెడ్డి ని హత్యచేసిన హంతకుల్లో ఒకరైన దస్తగిరి అనే నిందితుడు నిన్న మీడియాతో మాట్లాడిన తీరును మనం చూశాం. ఆయన మాటల్ని ఎల్లోమీడియా పతాకశీర్షికల్లో పెట్టి ఏవిధంగా కథనాలు రాశారో కూడా అందరూ చదివే ఉంటారు. ఒక హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి తాను ఎంత రాక్షసంగా ఈ నేరాన్ని చేశాడో కళ్లకు కట్టినట్లు చెప్పడం.. దాన్ని ఈ ఎల్లోమీడియా పేజీలకొద్దీ రాయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను ఏ ప్రముఖ నాయకుడో.. ప్రముఖుడో.. లేదా ఒక బాధితుడో అయితే దాన్ని పతాకశీర్షికకు తీసుకోవడంలో తప్పులేదు. హత్యకేసు నిందితుడు చెప్పినటువంటి సమాచారాన్ని పనిగట్టుకుని ప్రచారం చేయడం అనేది జర్నలిజం కిందికి వస్తుందో లేదో ఆయా పత్రికల యాజమాన్యాలే జవాబివ్వాలి.
నేరస్తుడు సవాళ్ళు విసరడమా..?
ఇక, ఆ దస్తగిరి అనే అతను ఎంత రాక్షసంగా హత్యచేశామనేది కళ్లకు కట్టేవిధంగా చెప్పడం..తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరడం, కొంతమందికి సవాళ్లు విసరడాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు వాళ్లకు సంబంధించిన మీడియా ఛానెళ్లలో చూశాం. ఇక్కడ జర్నలిజం విలువలు అనేవాటివి పక్కనబెడితే.. ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి ‘మేమే నరికాం.. అలా తిట్టాం.. తాగివెళ్లాం..’ అని చెప్పడం వీళ్లు రాయడం.. ఇదంతా బాబు పొలిటికల్ అజెండాకు సంబంధించి అటు టీడీపీ, ఇటు ఎల్లోమీడియా కలిసి వీళ్లే ఆర్గనైజ్డ్‌గా మాట్లాడిస్తుదన్నారేమో అనిపిస్తుంది. నిజానికి దస్తగిరి అనే వ్యక్తి మాట్లాడేది పబ్లిక్‌కు అవసరమైందా..? ఇది జర్నలిజం అనిపించుకుంటుందా..? అసలు నేరస్తుడు సవాల్ విసరడమేంటి..? ఎల్లోమీడియా ఆత్రుతేంటి..?
నిందితుడికి సీబీఐ వత్తాసా..?
నేరానికి పాల్పడి హత్యకేసులో ఉన్న వ్యక్తి బయట ఎలా తిరుగు తున్నాడు..? ముందుగానే ముందస్తు బెయిల్ ఇప్పించి.. సీబీఐ అతని ద్వారా తమకు ఏం కావాల్నో అది చెప్పించి పైగా అతనికి రక్షణ కావాలంటే ఏపీ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ ఇవ్వడం.. దాన్ని ప్రివిలేజ్డ్‌గా తీసుకుని ఆ దస్తగిరి ప్రయివేటు సెటిల్‌మెంట్‌లు చేసుకోవడం వంటి పరిణామాల్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి..? దీనిమీద మేమూ మాట్లాడాల్సిరావడం మా దౌర్భాగ్యం.
– ఇదంతా ఎల్లోమీడియా ఆతృత్ర, చంద్రబాబు రాజకీయ దివాలాకోరుతనంగా అర్ధం చేసుకోవాలి. దస్తగిరి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని తద్వారా బాబు అండ్ కో పొలిటికల్ అజెండాను సఫలీకృతం చేసుకోవాలనుకుంటున్నారు.
జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేకే..
చంద్రబాబు గానీ ఎల్లోమీడియా గానీ ఈరోజు ఈకేసుకు సంబంధించి ప్రచారం చేసుకోవడంలో ప్రజలు, ప్రజలకు సంబంధించిన అంశాలేమీ లేవు. కేవలం, జగన్‌మోహన్‌రెడ్డి ని రాజకీయంగా ఎదుర్కొలేక, 2014–19లో ప్రజలకు వాళ్లేం చేశారో చెప్పుకునే ధైర్యం లేక.. గతంలో వారు చేయలేనిది రాబోయేకాలంలో చేస్తామనేది కూడా వాళ్లకు అర్ధంకాక.. జగన్ గారిని దెబ్బకొట్టాలంటే వ్యక్తిగత ప్రతిష్టతను దిగజార్చాలని వీరంతా కంకణం కట్టుకున్నారు. గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పై ఏవిధంగా వ్యక్తిగతమైన విమర్శలకు పాల్పడి బదనాం చేయాలని చూశారో.. ఇప్పుడు కూడా అదేవిధంగా జగన్ గారిపై పొలిటికల్ అజెండాను పెట్టుకుని ఆర్గనైజ్డ్‌గా పావులు కదుపుతున్నారు.
అవే కుట్రలుః
ఆరోజు జగన్ కాంగ్రెస్‌ను కాదని బయటకొచ్చాక.. ఇదే చంద్రబాబు కాంగ్రెస్‌ను రెచ్చగొట్టి మా నాయకుడి మీద అక్రమకేసులు బనాయించడం, సీబీఐ విచారణలో ఏం జరుగుతుందనేది.. ఏం జరగబోయేది కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే ముందుగా రావడం అందరికీ తెలిసిందే. అదేమాదిరిగానే ఈరోజు వివేకానందరెడ్డి హత్యకేసును కూడా బాబు, ఎల్లోమీడియా వాడుకుంటున్నారు.
ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడం సీబీఐ పరాకాష్టః
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత వారి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి ఆరోజు ఇంట్లో సభ్యుల వత్తిళ్ల వల్లనో..లేదంటే, ఆయన వ్యక్తిగత కారణాలతోనే జగన్‌గారితో పాటు కాంగ్రెస్‌ను వదిలి బయటకు రాలేకపోయారు. తన తల్లిగారైన విజయమ్మ పైన పోటీచేసినప్పటికీ, మళ్లీ వివేకానందరెడ్డి ని తన పార్టీలోకి జగన్ గారు సాదరంగా ఆహ్వానించారు. అప్పట్నుంచి వివేకానందరెడ్డి గారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి ముఖ్యంగా కడపజిల్లాకు సంబంధించి కీలకంగా పనిచేశారు.
ఎంపీ అవినాశ్‌రెడ్డితోను, మిగతా జిల్లా పార్టీ నాయకులతోనూ కలిసి అడుగులు వేయడమే కాకుండా కీలకమైన విషయాల్లో వివేకానందరెడ్డి సూచనలిచ్చేవారు. జగన్‌కి అన్ని విషయాల్లో అటు కుటుంబానికి, పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న వివేకానందరెడ్డి హత్యకు గురవడం ఎంత బాధతో కూడిన విషయమో అందరికీ తెలిసిందే. అలాంటిది, పైగా.. ఈ హత్యకేసుకు సంబంధించి అదే కుటుంబాన్ని టార్గెట్ చేసి నిందితులు ఇక్కడ్నే ఉన్నారంటూ ఒక వ్యూహాత్మక కుట్రకు పాల్పడటాన్ని ఈరోజు సీబీఐ విచారణ వైఖరికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
సీబీఐ దర్యాప్తు అంతా ఫార్సుః
నిజానికి, సీబీఐ దర్యాప్తేమీ పెద్దగా జరపడంలేదు. దానికి కావాల్సిన మనుషులకు నోటీసులిచ్చి విచారణకు పిలవడం.. అరెస్టులంటూ హడావిడి చేయడం మాత్రమే చేస్తుంది. విచారణలో కూడా 161 సీఆర్‌పీసీ స్టేట్‌మెంట్ అనేది వ్యక్తులు చెప్పింది కాకుండా సీబీఐనే రాసుకుంటుందని ఇప్పటికి పదిమంది దాకా బయటకు వచ్చి చెప్పారు. సీబీఐ పోకడపై కొంతమంది కోర్టుల్లో కూడా కేసులేశారు. ఇలాంటి అన్యాయంగా విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు, ఎల్లోమీడియా కుమ్మక్కై నడిపిస్తున్న సీబీఐ డ్రామాగా దీన్ని పరిగణించాల్సి వస్తుంది.
సుప్రీం తప్పుబట్టినా.. పంథా మారని సీబీఐః
సుప్రీంకోర్టులో తాజాగా దాఖలైన పిటీషన్ ప్రకారం సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్ ఒంటెత్తుపోకడగా వెళ్తున్నాడని, వాస్తవాల్ని పక్కనబెట్టి వ్యక్తుల టార్గెట్‌గా విచారణను కొనసాగిస్తున్నారని చెప్పినప్పుడు.. దానిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు బృందాన్ని మార్చివేసింది. విచారణ కాలపరిమితిని పెట్టిందంటే దాని అర్ధమేంటి..? సీబీఐ విచారణ సక్రమంగా, సవ్యమైన పద్ధతిలో జరగడంలేదని స్పష్టమైంది కదా.. మరి, కొత్తగా నియామకమైన విచారణ బృందం ఏ ఒక్క కొత్త ఆధారాన్నైనా గుర్తించగలిగిందా..? కేవలం, ఆరోజు రామ్‌సింగ్ చేయాలనుకున్న పనినే ఈ బృందం పూర్తిచేయడానికి వచ్చినట్టుంది. ఈనెల 30వ తేదీలోగా కేసు ఛార్జిషీట్ వేయమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి, ఈలోగా ఎంపీ అవినాశ్‌రెడ్డిని, భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయాలనే లక్ష్యంగా సీబీఐ అడుగులు వేయడం బాధాకరం.
ఆధారంలేకుండానే అరెస్టులా..?
అసలు వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది..? అంతకుముందు నిందితుడు కాని భాస్కర్‌రెడ్డి కేవలం నోటీసు ఇవ్వగానే నిందితుడైనట్లు అరెస్టు చేస్తారా..? అంతకుముందు లేని అవినాశ్‌రెడ్డి ఇప్పుడు సహ నిందితుడవుతాడా…? ఇందుకు కొత్తగా మీకు అందిన ఆధారం, సాక్ష్యం ఒక్కటైనా చూపుతున్నారా..?
ఎల్లో మీడియానే శిక్షలు ఖరారు చేస్తుంది…!
ఇవన్నీ మేం ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు కారణమేమంటే.. ఈ కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మీద ఆరోపణలు చివరికి నిలబడేవి కాదు. మేం పూర్తిగా నమ్మకంతో ఉన్నాం. అయితే, ఇందులో బాధాకరమైన విషయమేమంటే, కుటుంబంలో మమ్మల్ని నేరస్తులుగా చిత్రీకరణ చేస్తున్నారని.. ఆరోజు జగన్ పై ఏవిధంగా నిరాధారమైన కేసులు బనాయించారో.. అదేవిధంగా చేస్తున్నారంటూ.. దీన్ని ఎల్లోమీడియా పతాకశీర్షికల్లో ప్రజల్ని నిజమని నమ్మించేలా ప్రచారం చేయడమనేది అత్యంత బాధాకరం.
అధికారమే ఉంటే, ఈ ఎల్లోమీడియా కథనాలు విచారణతో పాటు శిక్షల్ని కూడా ఖరారు చేసేవేమో.. ఈ కథనాల ప్రభావం ఎలా ఉందనేది ప్రజలకు చెబుతున్నామే తప్ప.. కేసుకు భయపడి మాత్రం కాదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈరోజు నోరుతెరిస్తే బూతులు తిడుతూ.. ఏవేవో పదాలు ప్రచారం చేస్తూ.. ఈ కేసును వారి రాజకీయానికి వాడుకుంటున్నారు కనుకనే ఈ వాస్తవాల్ని మేం ప్రజల ముందుకు తెస్తున్నాం.
ప్రత్యక్షసాక్షిని వదిలేసి అప్రూవర్ మాటలకు విలువ ఎలా ఇస్తారు..?
కేసు వాస్తవాలు తేలనప్పుడో.. విచారణ చివరికి వచ్చినప్పటికీ.. నేరస్తులు పట్టుబడనప్పుడో.. అందులో ఏ ఒక్కరినో అప్రూవర్‌గా మార్చి దోషుల్ని అరెస్టు చేయడం రివాజు. అయితే, వివేకా హత్యకేసుకు సంబంధించి వాచ్‌మెన్ రంగన్న అనే అతను ప్రత్యక్షసాక్షిగా ఉండి.. నలుగురు ఈ హత్యకు పాల్పడ్డారని, వాళ్ల పేర్లుతో సహా చెప్పినతర్వాత సీబీఐకి ఇక అప్రూవర్‌తో పనేంటి..?
అవినాశ్-వివేకా మధ్య వైరం ఎల్లోమీడియా సృష్టేః
ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివేకానందరెడ్డి ని అందరి ఏకాభిప్రాయంతో జగన్‌మోహన్‌రెడ్డి ఫైనల్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప స్థానిక సంస్థలకు సంబంధించి క్లియర్ మెజార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఉండగా, చంద్రబాబు టీడీపీ తరఫున ఎందుకు అభ్యర్థిని నిలబెట్టారు.? ఆయన పోటీ పెట్టడమే తప్పు ఒక్కటైతే, బీటెక్ రవిని పెట్టి గెలిపించుకుంటే.. అప్పుడు వివేకానందరెడ్డికి కోపం ఎవరిమీద రావాలి..? ఆయన్ను ఓడించడానికి నాయకత్వం వహించిన చంద్రబాబు మీదనే కదా..? మరి, ఈరోజు బాధితులంతా చంద్రబాబు పక్షాన నిలబడి.. అటు బాబు, ఇటు ఎల్లోమీడియా చేత మమ్మల్ని శత్రువులుగా చూపించడం ఎంతవరకు సబబు. ఇంతకంటే, విచిత్రం, అన్యాయం ఏమైనా ఉంటుందా..?
సీబీఐది అడ్డగోలు వాదనః
సిట్టింగ్ ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని పూర్తిగా ఓన్‌చేసుకుని వివేకానందరెడ్డి ఎన్నికల సమయంలో.. హత్యకు ముందురోజు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ కూడా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉండి.. స్థానికంగా తనకు ముఖ్యుడిగా ఉంటాడని.. యువకుడు, విద్యావంతుడుగా ఉన్న అవినాశ్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దాన్ని కూడా రాజకీయం చేయడంలో అర్ధమేంటి..? వివేకానందరెడ్డి ని తప్పిస్తే తనకు ఎంపీ పదవి వస్తుందని అవినాశ్ చేస్తాడా..? సీనియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయిన సీబీఐ ఇంత అడ్డగోలుగా వాదించడంలో ఏమైనా అర్ధముందా..? అని అడుగుతున్నాను.
బాబు క్షుద్రరాజకీయ విన్యాసమిదిః
చంద్రబాబు క్షుద్ర రాజకీయ విన్యాసంలో భాగంగా శవాలమీద పేలాలేరుకునే కుట్రలకు పాల్పడుతున్నారు. ఆయనకు వత్తాసు పలికే ఎల్లోమీడియా రకరకాల కోణాల్లో అభూతకల్పనలు వండివారుస్తూ ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నానికి ఒడిగడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఖండిస్తున్నాం. ఎంపీ అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరిస్తున్నప్పుడు ఇదిగో ఈరోజు అరెస్టు, రేపు అరెస్టు అని ఎల్లో మీడియాలో కథనాలు ఎలా రాస్తారు..?
గూగుల్ టేకవుట్ అబద్ధాలకోటః
గూగుల్ టేకవుట్ అంటారు. అర్ధరాత్రి 1.30కి తాగుతూ ఎక్కడ్నో ఉన్నామని అప్రూవర్ చెబుతాడు. కాదు వాళ్లంతా అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని గూగుల్ టేకవుట్ కనిపెట్టిందని సీబీఐ చెబుతుంది. ఇందులో వాస్తవాలెంత..? బెంగుళూరు ఆస్తి సెటిల్‌మెంట్ జరగనప్పుడు.. మరి, హత్య జరిగాక వివేకా ఇంట్లో ఏవో రౌండ్‌సీల్‌తో ఉన్న డాక్యుమెంట్లు తీసుకెళ్లారని అంటున్నారు. మరి, ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయనేది సీబీఐ దర్యాప్తు చేసిందా..? వివేకానందరెడ్డికి ఉన్న మరో వైవాహిక సంబంధం నేపథ్యంలో వారి అబ్బాయికి ఏవో ఆస్తులు రాసిచ్చారని.. ఆయన చెక్ పవర్‌ను ఎందుకు రద్దు చేయించారని.. ఇవన్నీ సీబీఐకి కనిపించలేదా..? . పోనీ, ఈ అంశాలన్నింటిపైనా ఆరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు సిట్‌తో విచారణ చేయించలేదు..?
గుండెపోటు అని చెప్పింది వివేకా అల్లుడి తమ్ముడే కదా..
వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో పాటు ఆయన తమ్ముడు శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌లు చేస్తేనే కదా ఎంపీ అవినాశ్‌రెడ్డి సంఘటనాస్థలానికి వెళ్లాడు. మరి, ఇదే శివప్రకాశ్ రెడ్డి అతని బంధువు ఆదినారాయణరెడ్డికి గుండెపోటు అని ఎందుకు చెప్పాడు..? ఘటనాస్థలంలో వివేకా రాసిన లెటర్ సంగతి అవినాశ్‌కు వారిద్దరు ఎందుకు చెప్పకుండా పీఏ కృష్ణారెడ్డి చేత మాయం చేయించారు..? వీటన్నింటిపై సీబీఐ రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిలను విచారించిందా..? ఇందులో సీబీఐకి అనుమానం ఎందుకు రాలేదని మేం అడుగుతున్నాం. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాలి. ఖచ్చితంగా అన్ని విషయాలపై అన్ని కోణాలపై విచారణ జరగాలనేదే మా డిమాండ్. సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక అబద్ధాల కథను అల్లిందని మేం ఆరోపిస్తున్నాం.
బాబు, ఎల్లోమీడియా కుట్రల్ని ఛేదిస్తాం..ః
ఆదినుంచీ కుట్ర, కుతంత్రాలతోనే అధికారాన్ని కైవసం చేసుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. న్యాయవ్యవస్థను మేనేజ్ చేయడంలో కూడా ఆయన ఎంత సమర్ధుడనేది అందరికీ తెలిసిందే.. అందుకే, ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన కూడా మాట్లాడుతున్నారంటే, బాబు కపట రాజకీయాల్ని అందరూ గమనించాలి. ప్రత్యేకంగా ఈ కేసును పొలిటికల్ అజెండాగా పెట్టుకుని బాబు అండ్ కో చేసే విషప్రచారాన్ని మేం సమర్ధంగా తిప్పికొడతాం. కుట్రల్ని ఛేదిస్తాం.