– ఊరు మనదే తోసెయ్.. టోల్‌ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేత దాడి
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగనన్న అభిమానస్తులకు బీపీ వస్తే ఏం జరుగుతుందో… మంగళ గిరి టీడీపీ పార్టీ ఆఫీసు దుస్థితి చూసి కూడా, అన్న అభిమానస్తులకు రక్తపోటు వచ్చేలా చేయడం సబబు కాదు. సాధ్యమయినంతవరకూ వారికి బీపీ రాకుండా చూసుకోవడం రాష్ట్ర ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగుల ధర్మం. కాబట్టి వైసీపీ నేతలు హోటల్‌లో ఏదైనా తిన్నా.. రూములు బుక్ చేసినా, కల్యాణమండపాలు-కార్లు అడిగినా, ఆటో- ఆర్టీసీ బస్సెక్కినా, చివరాఖరకు సులభ్‌కాంప్లెక్స్‌లో మల-మూత్రవిసర్జనకు వెళ్లినా డబ్బులు అడక్కపోవడం అందరి ఆరోగ్యాలకూ మంచిది. ఒకవేళ డబ్బులు అడిగితే… జగనన్న అభిమానస్తులకు వచ్చే రక్తపోటు, ఎంత భయానకంగా ఉంటుందో విశాఖ జిల్లా టోల్‌ప్లాజాలో జరిగిన ఈ దృశ్యం ఒక్కటి చాలు. కాదు..
కూడదూ అని డబ్బులడిగేశారనుకోండి. మీరూ సత్యనారాయణ మాదిరిగా తలపగలకొట్టించుకుని, ఆసుపత్రిలో చేరి ‘అలో జగనన్నా’ అని రాగాలు తీయాల్సిందే. ఏంటీ? కాదంటారా.. అంతా అబద్ధమంటారా?.. అయితే ఓసారి ఇది చదివేయండి.

అధికారం ఉందన్న అహంకారంతో వైసీపీ నేతలు.. క్షేత్రస్థాయిలో చేస్తున్న గూండాగిరితో ఆ పార్టీ అధినేత,సీఎం జగన్ పరువు అప్రతిష్ఠపాలవుతోంది. తాజాగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజాలో.. వాహనానికి సంబంధించి డబ్బు కట్టమన్నందుకు ఆగ్రహించిన వైసీపీ నేత, టోల్‌ప్లాజాలో
పనిచేసే సత్యనారాయణ అనే ఉద్యోగిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకారణంగా సిబ్బందిపై దాడి చేసిన వైసీపీ నేతల గూండాగిరిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో రెండున్నరేళ్ల నుంచి రౌడీయిజం పెరిగిపోవడం, బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనపరుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి సాధారణ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలను, పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేక గతంలో సోషల్‌మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టినప్పుడు చెప్పినట్లుగానే.. మీకు పార్టీ అండగా ఉంటుందా అని చెబుతారా? అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చూడాలి. పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో? చూశారుగా?.. జగనన్న అభిమానస్తులకు రక్తపోటు వస్తే… సీను ఎంత బీభత్సంగా ఉంటుందో?!