Suryaa.co.in

Andhra Pradesh

నువ్వు మా నమ్మకం కాదు… నమ్మకద్రోహివి జగన్ అంటున్న ప్రజలు

-ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తుండడం వల్ల రాష్ట్రం లో అమ్ముడుపోని దిష్టిబొమ్మలు
-తాను అందగాడినని జగన్మోహన్ రెడ్డి మురిసిపోతుంటే, ఇంటి ముందు ఆయన ఫోటో పెట్టడం వల్ల ప్రత్యేకంగా భూతం, రాక్షసుడి బొమ్మ అవసరం లేదన్నట్టు ప్రజలు
-వాలంటీర్ల కంటే దారుణంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యుల పరిస్థితి
-స్టిక్కర్ అతికించే కార్యక్రమం ద్వారా పార్టీలో సిగ్గు ఉన్నది ఎవరికో, లేనిది ఎవరికో తెలిసిపోయింది
-సంచి మెడలో వేసుకుని ఎమ్మెల్యేలు స్టిక్కర్ అతికించాలనే కార్యక్రమానికి వ్యతిరేకంగా రాయలసీమలో తిరుగుబాటు మొదలు కావచ్చు
-ప్రభుత్వ ఉద్యోగులైన వాలంటీర్లు ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం సబబేనా ?
-ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గవర్నర్ కు లేఖ రాస్తా
-నాబార్డ్ ఇచ్చిన రుణాన్ని దారి మళ్లించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అధికార పార్టీ చేపట్టిన కార్యక్రమం పై రాష్ట్ర ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. నువ్వు మా నమ్మకం కాదు…నమ్మకద్రోహివి జగన్ అని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు మండిపడుతున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేష్టల వల్లే తిరిగి తాము అధికారంలోకి వస్తామన్న భావనలో కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, ఇంటి పన్నులను పెంచి ప్రజలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారం మోపుతుంటే , మా నమ్మకం నువ్వే జగన్ అని మంత్రులు, మాజీమంత్రులు, శాసనసభ్యులు పేర్కొంటూ ఇంటింటికి తిరిగి స్టిక్కర్లను అతికిస్తుంటే జనం అసహ్యించుకుంటున్నారని తెలిపారు .

శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పట్నం వచ్చిన ప్రతివతలు అనే చిత్రంలో ప్రముఖ నటుడు రావు గోపాల్ రావు మెడకు సంచి తగిలించుకొని మసాజ్ చేసే వ్యక్తిలా నటించారని , అలాగే చెవులలో గుబిలి, గుమిలి తీసే వారిలాగా మెడలకు సంచులు తగిలించుకొని మంత్రులు, మాజీ మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు ఆత్మగౌరవాన్ని చంపుకొని సిగ్గులేకుండా ఇంటింటికి తిరుగుతూ స్టిక్కర్లు అతికిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కూడా మెడకు సంచి తగిలించుకొని స్టిక్కర్ అతికిస్తున్న ఫోటోను ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియా ముందు ప్రదర్శించారు. రాశి సంస్థ ఫౌండర్ డైరెక్టర్లలో ఒకరైన తిమ్మరాజు తనయుడు, ఇలా స్టిక్కర్లు అతికిస్తున్న తీరు చూసి, నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న మాజీ మంత్రి రంగ నాథరాజు సైతం మెడలో సంచి వేసుకుని స్టిక్కర్లు అతికించడం పట్ల తమ సామాజిక వర్గ ప్రజలు ఛీ… కొడుతున్నారు. గుబిలి తీసే వారిలా తయారయ్యే కంటే విషం తాగి చావడం బెటర్ అని అభిప్రాయపడ్డారు . స్టిక్కర్ చిన్నగా ఉన్నదని, రేపు పోస్టర్ అతికించే కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తే, పోస్టర్ వెనుక మైదా అంటించే పని కూడా మంత్రులు, మాజీ మంత్రులు, శాసన సభ్యులకే చెబుతారేమో. ఒకవైపు తమ పార్టీ వారు ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తుంటే, చాలా చోట్ల వాటిని పీకి వేయడం కనిపించింది. స్టిక్కర్లు పీకి వేసిన వారిపై చర్యలు తీసుకుంటారన్నది నిర్వివాదాంశమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

తనని తాను అతిగా ప్రేమించుకోవడం ఒక మానసిక రుగ్మత
తనని తాను అతిగా ప్రేమించుకోవడం ఒక మానసిక రుగ్మత. ఆ జబ్బు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుంది. అందుకే, ఎక్కడ చూసినా చిక్కటి చిరునవ్వు చిందించే ఆయన ఫోటో ఉండాలని భావిస్తున్నారు. ఈ రకమైన మానసిక రుగ్మతను నార్సిసిజం అని అంటారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోతో పాటు, ఉదయిస్తున్న సూర్యుడిలా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించేవారు. కానీ కాలక్రమేనా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు అస్తమించిన సూర్యుడిలా కనుమరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల ప్రకటనల్లోనూ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫోటో కనిపించకుండా పోయింది. కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే ముద్రిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచార పబ్లిసిటీ కోసం ముద్రించిన తన ఫొటోలు , పత్రికల్లో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలోని తన ఫోటోలను చూసుకొని జగన్మోహన్ రెడ్డి మురిసిపోతుంటే, మన వాడికి ఫోటోల పిచ్చి అధికంగా ఉందని అధికారులు ఆయన్ని లోబర్చుకోవడానికి అదే ఆయుధంగా వాడుతున్నారు. తన ఫోటోలను చూసుకొని తన్మయత్వం చెందుతున్న జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుకున్న ల్యాండ్ సర్వే అధికారులు, రాష్ట్రంలోని భూములను రీ సర్వే చేయించి జారీ చేసే పట్టాదారు పాసుపుస్తకాలపై ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలని కోరుకుంటున్నట్టు గా వారు అబద్ధం చెప్పినట్టు ఉన్నారు . దానికి ఆయన ఓకే చెప్పడం, అధికారులు రీసర్వే ప్రారంభించడం జరిగిపోయింది. భూముల హద్దురాళ్లపై కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలని కోరుకుంటున్నారని గ్రానైట్ బ్యాచ్ చెప్పడంతో ముఖ్యమంత్రి సరేనని చెప్పినట్టనిపిస్తుంది. నార్సీ అనే ఓ రాజు నీటిలో తన ప్రతిబింబాన్ని తదేకంగా చూసుకుంటూ మురిసిపోతూ , చివరకు నీటిలో పడి చనిపోయారు. నార్సిసిజం అనే మానసిక రుగ్మత ఉన్నవాళ్లు తమని తాము అధికంగా ప్రేమించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి వంటి వారు మాత్రం తనలాంటి వాళ్లు మంచి మాటలు చెప్పినా వినకుండా దండిస్తుంటారని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు .

గ్రహ శాంతికి నువ్వే మా నమ్మకం జగన్ స్టిక్కర్ చాలు
రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రభుత్వమే ఉచితంగా వాటిని సరఫరా చేస్తోందని, గ్రహ శాంతికి, భూతం, రాక్షసుడి బొమ్మ అవసరం లేదని నువ్వే మా నమ్మకం జగన్ అనే స్టిక్కర్ చాలని ప్రజలు భావిస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. నువ్వే మా నమ్మకం జగన్ అనే కార్యక్రమం రాష్ట్రంలోని 14 వేల సచివాలయాల పరిధిలో మారు మోగిపోయిందని సాక్షి దినపత్రికలో రాసుకున్నారు.
ఇక 68 ఏళ్ల వృద్ధుడైన షేక్ బాబ్జి అనే వ్యక్తి నువ్వే మా నమ్మకం జగన్ అనే స్టిక్కర్ ను చూసి, దేవాలయంలో దేవుడికి దండం పెట్టుకున్నట్లు జగన్ ఫొటో కు దండం పెట్టుకొని ” మనవడా మళ్లీ నువ్వే ముఖ్యమంత్రి కావాలని ” కోరుకున్నాడట. 51 ఏళ్ల వయసు కలిగిన జగన్మోహన్ రెడ్డిని మనవడా అని షేక్ బాబ్జి సంబోధించాలి అంటే ఆయన 100 ఏళ్ల వృద్ధుడై ఉండాలి. లేకపోతే కనీసం 90 ఏళ్ల వయసు కలిగిన వాడైనా అయి ఉండాలి. తనకు తానే కుర్రాడిలా జగన్మోహన్ రెడ్డి బిల్డప్పులు ఇస్తున్నారని మండిపడ్డారు.

లుచ్చా మంత్రి జోగి రమేష్ గులిమి తీసే వాడిలా మెడకు సంచి వేసుకుని తిరుగుతుంటే… ఆయన సామాజిక వర్గ ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు
అధికార పార్టీ శాసనసభ్యులకు, గృహ సారధులకు, వాలంటీర్లకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ, స్వచ్ఛందంగా తమ ఇంటికి నువ్వే మా నమ్మకం జగన్ అనే స్టిక్కర్లను అతికించుకుంటున్నారని సాక్షి దినపత్రికలో రాయడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు . తమ పార్టీలో ఇంత మంది సిగ్గులేని నాయకులు ఉన్నారని, ఈ కార్యక్రమం ద్వారా తెలిసింది. తనని లుచ్చా అన్న ఓ లుచ్చా మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో గుమిలి తీసే వాడి మాదిరి మెడకు సంచి తగిలించుకొని తిరుగుతుంటే, ఆయన సామాజిక వర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇంటింటికి స్టిక్కర్ అంటిస్తూ ఫోటోలను దిగి వాటిని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి పంపితే ఆయన సాక్షి దినపత్రికలో వేయిస్తారట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బానిస విధానం, గతంలో ఈజిప్షన్ రాచరికంలో కొనసాగేది. నల్ల జాతీయులను మెట్లపై పడుకోబెట్టి వారి పైనుంచి ఫెరోలు నడుచుకుంటూ వెళ్లిన దానికంటే, తమ పార్టీలో దారుణమైన బానిసత్వం కొనసాగుతోంది. మంత్రులు, శాసనసభ్యుల పరిస్థితి , వాలంటీర్ల కంటే దారుణంగా ఉంది. ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమములో పాల్గొనే విషయం లో రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన పెద్ద రెడ్లైనా తమ పార్టీ శాసనసభ్యులు మెడకు సంచి తగిలించుకొని నువ్వే మా నమ్మకం జగన్ అని ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికిస్తారని తాను భావించడం లేదు. మంత్రి రోజా, తన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు రాజులు వంటి వీక్ పార్టీలు స్టిక్కర్లు అతికిస్తున్న ఫోటోలు మాత్రమే బయటికి వచ్చాయి. కానీ పుంగనూరు శాసనసభ్యుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారు స్టిక్కర్లు అంటిస్తున్నట్లుగా ఫోటోలు అయితే బయటికి రాలేదు.

వారు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికిస్తారని తాను భావించడం లేదు. మాజీ మంత్రి కొడాలి నాని కూడా కచ్చితంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే కొడాలి నాని రెండుసార్లు శాసనసభ్యుడు. స్టిక్కర్లు అతికిస్తేనే ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారా?. ఈ కార్యక్రమం ద్వారా తమ పార్టీలో సిగ్గులేని వారు ఎవరో?, సిగ్గున్న వారు ఎవరో తెలిసిపోయింది. రంగనాథరాజు , నరసింహ రాజు లు ఇతరులను పెట్టి స్టిక్కర్లను అతికించి ఉంటే బాగుండేది. నాయకత్వాన్ని అంగీకరించడం తప్పుకాదు , కానీ బానిస మనస్తత్వాన్ని చాటుకోవడం దారుణం అని రఘురామకృష్ణం రాజు అన్నారు. తనని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు మూడేళ్ల క్రితం ఓ మూర్ఖుడు ఫిర్యాదు చేయించారు. ఈరోజు తనకు ఎంతో సంతోషంగా ఉంది. స్టిక్కర్లు అతికించే కార్యక్రమములో తాను వీరి మాదిరిగా తిరిగి ఉండేవాడిని కాదు. చెవి లో గులిమి తీసేవారి, మసాజు చేసేవారి మాదిరిగా మెడకు సంచి తగిలించుకొని తిరుగుతున్న వారి దీనస్థితిని చూసి బాధ కలుగుతుంది. వారిని ఇంతా అధ్వానంగా ట్రీట్ చేస్తున్న వ్యక్తికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మీసం తిప్పే రెడ్లు, ఇంటింటికి తిరిగి స్టిక్కర్ ను అతికించే ప్రశ్నయే లేదని రఘు రామకృష్ణంరాజు తేల్చి చెప్పారు.

మీసం తిప్పగలిగిన రెడ్లకు సెల్యూట్ చేస్తున్నాను. ఈ భూమండలంలో ఇప్పటివరకు రాచరిక వ్యవస్థలో మినహా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా ఇంటింటికి ఫోటోలను అతికించుకున్న వారు లేరు. సెల్ ఫోన్ వెనక కూడా స్టిక్కర్ ను అతికించుకోవాలనడం హాస్యాస్పదం. ఇంటింటికి స్టిక్కర్లను అతికించింది సరిపోదు అన్నట్లుగా ఫోను వెనక కూడా స్టిక్కర్ ను అతికించాలని నిర్ణయించడం పరిశీలిస్తే, రేపు ఎమ్మెల్యే టికెట్ రాదని ఎవరైతే భావిస్తారో, వారు జగన్మోహన్ రెడ్డి ఫొటో ను పచ్చబొట్టుగా పొడి పించుకుని ఆయన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదని పార్టీ సీనియర్ శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… ముఖ్యమంత్రికి అనుభవం లేదని, వారు తమకున్న అనుభవంతో చెప్పినట్లే కదా? అంటూ ఎదురు ప్రశ్నించారు. స్టిక్కర్ ఉద్యమానికి తిరుగుబాటు రాయలసీమ ప్రాంతంలో ప్రారంభమై, కోస్తా జిల్లా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇంటింటికి స్టిక్కర్ అతికించే బాధ్యతలను నలుగురు ఉద్యోగులను నియమించి చేపట్టవచ్చు. కానీ తమ పార్టీ పెద్దలు అలా చేయడం లేదని, మంత్రులను, శాసన సభ్యులను ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి అవమానిస్తున్నారంటూ రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు .

ప్రభుత్వ ఉద్యోగులైన వాలంటీర్లు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం సబబేనా?
ప్రభుత్వ ఉద్యోగులైన వాలంటీర్లు ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతవరకు సబబు? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ కు లేఖలు రాస్తాను. వాలంటీర్లకు ప్రభుత్వమే జీత, భత్యాలను చెల్లిస్తోంది . వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు, ఒక పార్టీ కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు. ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్ల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించకపోతే, అప్పుడు ఏమి చేయాలో ఆలోచిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

అందుబాటులో లేని సి ఎఫ్ ఎం ఎస్ వెబ్ సైట్
గత నాలుగు రోజుల నుండి సి ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్ ఎవరికి అందుబాటులో లేకుండా పోయింది. ఇదే విషయమై కాగ్, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. సి ఎఫ్ ఎం ఎస్ వెబ్ సైట్ ను తమకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో 45 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా చూపించిన సి ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్లో, మరుసటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి అసలు బకాయి చెల్లింపులేవీ లేనట్లుగా పేర్కొనడం జరిగింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కేవలం 3000 కోట్ల రూపాయలేనని పేర్కొనడం విస్మయాన్ని కలిగించింది.
గత ఏడాది చెల్లించాల్సిన బకాయిలను మరుసటి ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయడం లేదు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన, పనిని చేసిన వారికి చెల్లించాల్సిన బకాయి బిల్లులు ఎన్నో స్పష్టంగా తెలియజేయడం లేదు. ఈ విషయాలను ఆరా తీసిన న్యాయమూర్తి బట్టు దేవానంద్ ను తమ టక్కు టమారా విద్యల ద్వారా బదిలీ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయి బిల్లుల వివరాలు తెలియజేయాల్సింది కాగ్ ను ఒక ఎంపీగా కోరుతాను. ఇదే విషయమై రాష్ట్ర గవర్నర్ కు కూడా లేఖ రాస్తాను. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోగా, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను సిఎఫ్ ఏం ఎస్ వెబ్ సైట్ లో క్యారీ ఫార్వర్డ్ చేస్తే, ఈ ప్రభుత్వం కాకపోయినా, రేపు నూతనంగా ఏర్పడే ప్రభుత్వమైనా బిల్లులు చెల్లిస్తుందని నమ్మకం పనిచేసిన వారికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు .

జల్ జీవన్ మిషన్ కు మార్జిన్ మనీ చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఖర్చు చేస్తుందో, దానికి అంతే డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 1650 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది. జల జీవన్ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే, కేంద్రం మరో 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఉండేది. దీంతో దశలవారీగా ఇంటింటికి నల్లాలను బిగించుకునే అవకాశం ఏర్పడేది. రాష్ట్ర ప్రభుత్వ వాటా లోని 1650 కోట్ల రూపాయలకు గాను 800 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, మిగతా మార్జిన్ మనీ సొమ్మును అప్పుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం,నాబార్డ్ ను ఆశ్రయించింది. నాబార్డ్ కూడా సానుకూలంగా స్పందించి 850 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. అయితే ఆ సొమ్ము మొత్తాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే కార్యక్రమం కోసం దారి మళ్లించారు. ఇప్పుడు తాము ఇచ్చిన రుణాన్ని వెనక్కి ఇవ్వాలని నాబార్డ్, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. లోకల్ బ్రాంచ్ లో ఉండాల్సిన సొమ్ము, హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కు తరలించారనే అభియోగాన్ని మోపి ఈనాడు అధినేత రామోజీరావు పై తనకు వ్యక్తిగతంగా ఉన్న కక్షను తీర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి, మార్గదర్శి సంస్థపై, కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. జిల్లా కలెక్టర్లను పని వారి మాదిరిగా చూడడం మాను కోవాలి. జిల్లా కలెక్టర్లకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని, చిలుకలూరిపేట సభలో చోటు చేసుకున్న ఘటనను ఒక మీడియా ప్రతినిధి, రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా, ఆయన ఈ విధంగా స్పందించారు. అలాగే ఎంపీ కృష్ణదేవరాయ కు కూడా సభా వేదికపై కుర్చీని ఏర్పాటు చేయకపోవడం దారుణం. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

మాతృభాషకు ఎంతో గౌరవం ఇచ్చే ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లిన ఆ ప్రాంతం మాతృభాషకు ఎంతో గౌరవం ఇస్తారని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలును ప్రారంభించబోయే సందర్భంగా ఆయన తెలుగులోనే ట్విట్ చేశారు. తెలంగాణ ప్రాంత నాయకులకు తెలుగు పై మమకారం ఉన్నప్పటికీ, ఆంధ్ర నాయకులు పరభాష పై వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి, మాతృభాషను చులకన చేస్తున్నారన్నారు. అటువంటి వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసైనా మాతృభాష గొప్పతనాన్ని తెలుసుకోవాలని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.

LEAVE A RESPONSE