– ఎంఎంటిఎస్ రైలులో ఉద్యోగిని పై జరిగిన అత్యాచార యత్నం ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది
– హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి మీ చేతగాని పాలనే కారణం
-మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్లు? ఆ కీచకుడి నుండి తనను తాను కాపాడుకోవడం కోసం రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఆడబిడ్డ దీన స్థితికి ఎవరు బాధ్యులు?
ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాదిలో అత్యాచారం కేసులు 29% పెరుగుదలతో 2945 కేసులు నమోదైనట్లు సాక్షాత్తు డిజిపి గారు ప్రకటించారు. అంటే సగటున ప్రతి నెలా 250 అత్యాచార కేసులు నమోదవుతున్న దారుణమైన పరిస్థితి. ప్రతీ రోజూ రాష్ట్రంలో మహిళలు అత్యాచారాలు, హత్య, వేధింపులకు గురవుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకు చూస్తున్నది.
మహిళలకు భద్రత కల్పించడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి మీ చేతగాని పాలనే కారణం. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదు. ముందు మహిళల ప్రాణాలకు భద్రత కల్పించండి.