వైఎస్ జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయి

-వైసీపీ ఎంపీలు ఉన్నది సొంత లాబీయింగ్ కోసమే…రాష్ట్రం కోసం కాదు
-కర్ణాటక తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్ట్ తో రాయలసీమకు తీవ్ర నష్టం
-ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం సమాధానం చెప్పాల్సిందే
-దేశంలోనే ధనికుడైన రాజకీయ నాయకుడు పేదల గురించి చెప్పడమా?
-తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ల సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు

అమరావతి:- వైఎస్ జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని జగన్ ఎటు తీసుకువెళుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు జీవో నెంబర్ 1 తేవడం, రాజకీయ పక్షాల పై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు తప్ప ముఖ్యమంత్రికి రాష్ట్రం గురించి పట్టడం లేదని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ అడుగడుగునా రాజీ పడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రం సాధించాల్సిన హక్కుల విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రానికి శాపంగా మారిందని చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన హక్కుల సాధనలో కీలకమైన చివరి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పొందడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలం అయ్యిందని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీలు పనిచేసేది సొంత లాబీయింగ్ కోసమే కానీ…రాష్ట్రం కోసం కాదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరువు జిల్లాలకు నిధులు సహా ఒక్క అంశంలో కూడా జగన్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని అన్నారు.

నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో విభజన చట్టంలో ఉన్న 11 కేంద్ర సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తే…ఇప్పుడు వాటి పురోగతి ఏంటో కూడా ఈ ప్రభుత్వం చెప్పలేని స్థితిలో ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ వంటి సంస్థకు నీటి సౌకర్యం కూడా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు అన్నీ ఎందుకు చేతులు మారుతున్నాయి అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలని అన్నారు.

రాష్ట్రంలో ఈ మూడున్నరేళ్లలో నిలిచిపోయిన ప్రాజెక్టులు, సంస్థల వద్దకు వెళ్లాలని, జరిగిన ప్రతి నష్టంపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. కర్ణాటక రాష్ట్రం తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి పరంగా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని…ఈ విషయంలో జగన్ కనీస సృహ లేకుండా ఉన్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

ఇప్పటికే సీమ ప్రాజెక్టులను మూలన పడేసి నష్టం చేసిన ప్రభుత్వం….ఇప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్టుపై మౌనంతో రాయలసీమ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తుందని అన్నారు. జగన్ నాడు చెప్పిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏమయ్యిందని ప్రశ్నించారు. పోలవరం, నదుల అనుసంధాన ప్రాజెక్టులు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదని అన్నారు. టీడీపీ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో ఆన్లైన్ విధానంలో చంద్రబాబు నాయుడు పలు అంశాలపై సమీక్ష జరిపారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమ నిర్వహణ, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్ తో పాటు పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఇంచార్జ్ లకు సూచించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై జగన్ ఇప్పుడు ఇక తప్పించుకోలేరని చంద్రబాబు నాయుడు అన్నారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయని అన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత కుమార్తెతో కూడా ఫోన్ లో మాట్లాడలేకపోతున్నాను అని ఒక వైసీపీ ఎమ్మెల్యేనే చెప్పడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

దేశంలో అందరి సీఎంల కంటే ధనికుడైన జగన్….పేదల గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు. 2004 నుంచి రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ ఇప్పుడు మీటింగ్ లు పెట్టి పేదల గురించి చెబితే జనం నమ్మాలా అని ప్రశ్నించారు. జగన్ స్కీం పెట్టాడు అంటే అందులో స్కాం ఉంటుందన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జె-బ్రాండ్స్ అమ్మకాలు, ఇసుక పాలసీలు అందుకు ఉదాహరణ అన్నారు. ప్రజలను నిత్యం దోచుకుంటూ…..ఎన్నికలు వస్తున్నాయని…పేదల గురించి చెపితే జనం నమ్మరని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఒక్క వర్గం కూడా జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు అన్నారు.

Leave a Reply