Suryaa.co.in

Editorial

వైఎస్‌.. బాబు.. ఒక రేవంత్‌!

– పార్టీ నేతలతో వైఎస్‌లా సఖ్యత
– క్యాడర్‌కు ప్రేరణనిచ్చే నేతలా వ్యవహారశైలి
– పాలనలో చంద్రబాబు మార్కు
– భేషజాలు ప్రదర్శించని నిరాడంబరత
– సహజశైలికి భిన్నమైన అడుగులు
– మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు
– సీనియర్లతో సమన్వయం చేసుకుంటున్న తీరు
– ఉప ముఖ్యమంత్రికి విలువ ఇచ్చిన తొలి సీఎం
– ఇద్దరూ కలిసే ఎక్కడికైనా
– సీఎం క్యాంపు ఆఫీసు భట్టికే
– ఉత్తమ్‌తోనూ సఖ్యత.. కలసి ఢిల్లీకి
– కాంగ్రెస్‌లో రేవంత్‌ కొత్త కల్చర్‌
– సానుకూలంగా రేవంత్‌ నెలరోజుల పాలన
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ సీఎం-పీసీసీ చీఫ్‌ బాధ్యతలను జమిలిగా పోషిస్తున్న రేవంత్‌రెడ్డి గద్దెనెక్కి నెలరోజులయింది. ఈ నెలరోజుల్లో కాంగ్రెస్‌ సంస్కృతికి విరుద్ధమైన దృశ్యాలు పార్టీ శ్రేణులను నోరెళ్లబెట్టిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి సహజ సిద్ధమైన దూకుడు, శైలికి భిన్నమైన అడుగులు ఈనెలరోజుల్లో కనిపించాయి. ఆమాటకొస్తే.. అసలు కాంగ్రెస్‌ కల్చర్‌కు భిన్నమైన వ్యవహారశైలి దర్శనమిస్తోంది.

కాంగ్రెస్‌ అంటేనే కొట్లాటలు. కొట్లాటలంటేనే కాంగ్రెస్‌. అలాంటి సందడి ఉంటేనే అది కాంగ్రెస్‌ అవుతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను చూసి పెరిగిన వారికి ఇది తెలిసిందే. కానీ ఈ నెలరోజులు తెలంగాణ కాంగ్రెస్‌లో అరుపులు లేవు. కేకలు లేవు. నిందలు లేవు. నినాదాలూ లేవు. డిమాండ్లు లేవు. డాం డుష్‌ పంచాయితీలు లేవు. అవును.. ఇవన్నీ నిజంగా కాంగ్రెస్‌లోనే!

రేవంత్‌రెడ్డి అంటేనే ఫైర్‌బ్రాండ్‌. ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకైక క్రౌడ్‌పుల్లర్‌. సూటిగా చెప్పాలంటే.. రేవంత్‌ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్‌ బండి పరుగులు తీసింది. మూడోస్థానంలో ముక్కీమూలుగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ను, ఎకాఎకి తొలిస్థానంలోకి తీసుకురావడంలో రేవంత్‌ రెక్కల కష్టం కూడా ఉంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, కాంగ్రెస్‌ను గద్దెనెక్కించడంలో రేవంత్‌దే కీలక స్థానం.

కేసీఆర్‌ సర్కారుపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవడంలో గత నాయకత్వం విఫలమయింది. అందుకే కేసీఆర్‌ రెండోసారి సీఎం కాగలిగారు. ఇప్పుడు కూడా అదే వ్యతిరేకత ఉన్నా, దాన్ని ఓట్ల రూపంలో పోగుచేసిన వ్యూహకర్త మాత్రం, నిస్సందేహంగా రేవంతే అన్నది మనం మనుషులం అన్నంత నిజం.

సీఎం బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ వెంటనే.. కేసీఆర్‌ను ఏదో ఒక కారణంతో అరెస్టు చేయించి, ప్రతీకారం తీర్చుకుంటారని భావించారు. కానీ విచిత్రంగా కేసీఆర్‌ను ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. అదో పెద్ద విభ్రాంతికర ఘటన. ఏపీలో జగన్‌ సీఎం అయిన తర్వాత.. అలాంటి ప్రతీకార చర్య ప్రారంభించి, ఎన్నికల ముందు బాబును జైల్లో వేసి, తన కసి తీర్చుకోగలిగారు.

ఓటుకు నోటు కేసులో తనను చెరబట్టిన కేసీఆర్‌పై రేవంత్‌ కూడా, సీఎం అయిన తర్వాత అలాంటి పనే చేస్తారని చాలామంది అంచనా వేశారు. కూతురు పెళ్లి ఏర్పాట్లు కూడా చూసుకోలేని విషాదం కల్పించిన కేసీఆర్‌ను, రేవంత్‌ విడిచిపెట్టరన్న భావన సామాన్యుల్లో సైతం స్థిరపడింది. కానీ ఆయన అలాంటి ప్రయత్నాల జోలికి వెళుతున్న దాఖలాలు లేవు. కాకపోతే న్యాయబద్ధంగానే కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీ, ఇతర అక్రమార్కులను చెరబట్టాలన్న వ్యూహం కనిపిస్తోంది.

ఈ మార్పు ప్రతీకారధోరణిలో మాత్రమే కాదు.. సహచరులను గౌరవించడంలోనూ కనిపిస్తోంది. తనను వ్యతిరేకించి, చివరకు సీఎం పదవికి పోటీ పడిన సీనియర్లతో రేవంత్‌ కలసి నడుస్తుండటమే ఆశ్చర్యం. సహజంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే సీఎం-పీసీసీ చీఫ్‌కు పడదు. అధికారం లేకపోతే సీఎల్పీ నేత-పీసీసీ చీఫ్‌కూ సరిపడదు. సీఎంగా ఉన్నవాళ్లయితే.. తన తర్వాత సీఎం అయ్యే అవకాశం ఉన్నవారిని తొక్కేస్తుంటారు.

కానీ రేవంత్‌.. తనతో సీఎం పదవికి పోటీ పడిన వారితో కలసి నడుస్తున్నారు. తన ఆలోచనలను వారితో పంచుకుంటున్నారు. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్‌ పాదయాత్రకు ముందు, పార్టీలో తన ప్రత్యర్ధులతో రాజీ చేసుకుని గద్దెనెక్కారు. తర్వాత తాను వ్యతిరేకించినవారిని, తనను వ్యతిరేకించిన వారినీ గౌరవించారు. ఇప్పుడు రేవంత్‌ అడుగులు కూడా, వైఎస్‌నే గుర్తుకు తెస్తున్నాయన్నది సీనియర్ల విశ్లేషణ.

సహజంగా డిప్యూటీ సీఎం పదవి ఆరోవేలు లాంటిది. ఏ ప్రభుత్వంలోనయినా దానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఏదో రాజకీయ సమీకరణ కోసం ఇద్దరు, ముగ్గురికి ఆ పదవులిచ్చి.. ఫలానా సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవులిచ్చామని, ప్రచారం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ రేవంత్‌ అందుకు భిన్నంగా డిప్యూటీ సీఎం, సీనియర్‌ నేత భట్టి విక్రమార్కకు తనకు సమాన స్థాయి ప్రాధాన్యం ఇవ్వడం కనిపిస్తోంది. తాను ఉండాల్సిన క్యాంపు ఆఫీసును భట్టికే కేటాయించారు. ఢిల్లీకి భట్టిని వెంటబెట్టుకుని పార్టీ అగ్రనేతలతోపాటు, ప్రధాని వద్దకూ తోడ్కొని వెళ్లి ఆశ్చర్యపరిచారు.

నిజానికి తెలుగురాష్ర్టాల్లో ఇప్పటివరకూ.. ఏ ఒక్క డిప్యూటీ సీఎంను, సీఎంలు ప్రధాని వద్దకు తీసుకు వెళ్లిన చరిత్ర లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి వరకూ అందరు సీఎంలు, ఢిల్లీకి ఒంటరిగానే వెళ్లేవారు. మామూలుగా అయితే ప్రధాని వద్దకు, సీఎం ఒక్కరే వెళ్లే ఆనవాయితీ ఉంది. కానీ దానిని రేవంత్‌ బ్రేక్‌ చేసి, డిప్యూటీ సీఎం భట్టిని కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. ఇది కాంగ్రెస్‌లో కొత్తగా రేవంత్‌ ప్రారంభించిన కల్చర్‌. దీనిని తర్వాత వచ్చే సీఎంలు కూడా కొనసాగించేలా రేవంత్‌ బాటలు వేశారు.

సీఎం రేసుతో త నతో పోటీ పడిన.. సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా రేవంత్‌, తనతో ఢిల్లీకి తీసుకుని కేంద్రమంత్రులను కలిశారు. సహజంగా కాంగ్రెస్‌లో ఇలాంటి కలసి తిరిగే దృశ్యాలు, భూతద్దం వెట్టి వెతికినా కనిపించవు. ఫలితంగా.. సీనియర్ల విషయంలో రేవంత్‌ విధానమేమిటన్నది చెప్పకనే చెప్పినట్టయింది.

సహచరులు-అనుచరుల విషయంలో వైఎస్‌ ఎలా వ్యవహరిస్తారో, రేవంత్‌ కూడా దానినే అనుసరిస్తున్నట్లు.. ఈనెలరోజుల ఆయన అడుగులు స్పష్టం చేశాయి. మంత్రులు-ఎమ్మెల్యేలు-సీనియర్లకు అపాయింట్‌మెంట్‌ విషయంలో, పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. ఈవిషయంలో ఎవరినీ కలవని కేసీఆర్‌తో పోలిస్తే, రేవంత్‌ వెయ్యి రెట్లు మేలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాకపోతే రేవంత్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్న వారంతా, ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారన్న ప్రచారం బాగా ఉంది.

ఇక పాలనలో చంద్రబాబునాయుడు మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. సమీక్షలు, అధికారులతో భేటీలు- నిర్ణయాలు- మీడియాతో భేటీలు తదితర అంశాల్లో, చంద్రబాబు తరహా వైఖరి కనిపిస్తోంది. బాబు పాత తరం నాయకుడు. రేవంత్‌ ఆవులించకుండానే పేగులు లెక్కబెట్టే నేత కాబట్టి.. ‘అంతకుమించిన’ ఆధునిక ఆలోచన-నిర్ణయాలు తీసుకుంటున్నట్లు, నెలరోజుల అడుగులు స్పష్టం చేస్తున్నాయి.

కాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై, ఎన్నికల ముందు చూపిన దూకుడు.. ఇప్పుడు చూపించడం లేదన్న వ్యాఖ్యలు పార్టీవర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. నాడు సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌, ఇప్పుడెందుకు సీబీఐకి ఇవ్వడం లేదన్న ప్రశ్నలకు.. ప్రజలకు సంతృప్తినిచ్చే సమాధానం దొరక్కపోవడం, రేవంత్‌ సర్కారుకు మైనస్‌ పాయింటే. ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’లో ఆరితేరిన కాంట్రాక్టర్లపై.. కఠినంగా వ్యవహరించకపోవడం సంబంధించి, అప్పుడే అనుమానాలు తెరపైకి రావడం, రేవంత్‌ ఇమేజీకి మంచిదికాదు.

అయితేకేసు సీబీఐ చేతిలో పెడితే.. బీజేపీ-బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాల ఫలితంగా, కేసు నీరుగారిపోతుందన్నది రేవంత్‌ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ కేసును అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ను, బీజేపీ బ్లాక్‌మెయిల్‌ చేస్తుందన్న మరో కోణం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ.. ప్రజలకు విశ్వాసం కల్పించకపోతే, రేవంత్‌ ఇమేజ్‌కి డామేజీ తప్పదన్నది కాంగ్రెస్‌వాదుల హెచ్చరిక.

కేసీఆర్‌ జమానాలో సెక్రటేరియేట్‌కు ప్రజల రాకపై నిషేధం ఉండేది. ఎమ్మెల్యేలకూ ప్రవేశం ఉండేది కాదు. స్వయంగా విపక్ష నేతగా రేవంతే ఆ విషయంలో సమస్య ఎదుర్కొన్నారు. జర్నలిస్టులపైనా ఆంక్షల కత్తి వేళ్లాడేది. ఇప్పుడు సెక్రటేరియేట్‌ ముందు ప్రజలు బారులుతీరి కనిపిస్తున్నారు. జర్నలిస్టులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా, స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారు. కేసీఆర్‌ ప్రగతిభవన్‌ ముందు ప్రజలపై నిషేధం ఉండగా, ఇప్పుడక్కడ జన సందోహం కనిపిస్తోంది. రేవంత్‌ నివాసం వద్ద కూడా ప్రజలు కనిపిస్తున్నారు.

ఇదంతా ‘జన తెలంగాణ- మన తెలంగాణ’ నినాదాలు, నిజం చేసేలా కనిపిస్తున్నాయి. అంటే నియంతపాలన స్థానంలో.. ప్రజాస్వామ్య పాలన ఆవిష్కృతమైందన్న భావన, తెలంగాణ సమాజంలో తొంగిచూస్తోంది. ఇప్పుడు ప్రజలపై నిషేధం లేదు. పదేళ్లపాటు ప్రజాస్వామ్యవాదుల గొంతులకు వేసిన ఉరితాడు, ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటోంది. తాము స్వేచ్ఛాజీవులన్న భావన, తెలంగాణ సమాజంలో దర్శనమిస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకు రేవంత్‌ ఇచ్చిన ప్రధాన హామీ ఇదే.

గద్దెనెక్కిన నెలరోజుల్లోనే.. ప్రజల చేతికి కేసీఆర్‌ సర్కారు వేసిన స్వేచ్ఛాసంకెళ్లను బద్దలు కొట్టడంతో, రేవంత్‌ సహజంగా జనాలకు దగ్గరయ్యారు. నిజానికిది కాంగ్రెస్‌ మార్కు ప్రజాస్వామ్యం! పదేళ్లపాటు నిర్బంధాలు.. దౌర్జన్యాలు.. అరాచకాలు.. నియంతృత్వాన్ని అనుభవించిన తెలంగాణ సమాజం, నెలరోజుల నుంచి స్వేచ్ఛగా ఊపిరిలూదుతోంది. మరి ఇది శాశ్వతమా? తాత్కాలికమా? అన్నది చూడాలి.

LEAVE A RESPONSE