-కాంగ్రెస్ కు బదిలీ కానున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ ఓట్లు
-కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని గెలువ లేకపోయినా, మా పార్టీ విజయ అవకాశాలను చాలా చోట్ల దెబ్బతీయడం ఖాయం
-ఎస్సీ, ఎస్టీలలోనూ కనిపిస్తోన్న వ్యతిరేకత… రానున్న ఎన్నికల్లో 1నుంచి 2 శాతమే ధన ప్రభావం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా, దారుణంగా ఓటమిపాలవడం ఖాయం. లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 20 నుంచి 25 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల కారణంగా రోజు వారి రచ్చబండ కార్యక్రమానికి ఆయన విరామం ప్రకటించారు. వరద సహాయక పనుల్లో అందరూ నిమగ్నమై ఉంటారు కనుక, ఆ పనులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు, అకృత్యాలను గురించి ఈ రోజు చర్చించడం లేదన్నారు. రాష్ట్రంలో, వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరించి వచ్చిన వాస్తవాలను ఆధారంగా, కొన్ని సర్వే ఏజెన్సీ లతో మాట్లాడి చివరకు తాను ఒక అంచనాకు వచ్చినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ నాడీ ఎలా ఉందో ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. నెల, నెలన్నర రోజుల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో మా పార్టీకి 24 నుంచి 25 స్థానాలు వస్తాయని టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల దినపత్రిక సర్వే ఫలితాలను వెల్లడించింది. అయితే ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 8.50 కోట్ల రూపాయల ప్యాకేజీని చెల్లిస్తుండడం వల్లే, మా పార్టీ ఇమేజ్ ను దేశంలో పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యింది. తమకు ప్యాకేజీ చెల్లించినప్పటికీ, ఇమేజ్ డ్యామేజీ చేయడం నైతికత కాదని వాళ్లు తమ సర్వే ఫలితాలను మార్చి ప్రకటించి ఉంటారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలకు మించి గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. నేషనల్ ఛానల్ 24 నుంచి 25 లోక్ సభ స్థానాలను గెలుస్తుందని ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోగా, 2009లో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ, 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, కొన్ని చోట్ల నోటాకు పోలైన ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు తక్కువగానే ఓట్లు వచ్చాయి.
తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు జట్టు కట్టి 2014 ఎన్నికల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని చూసి ఆయన తనయుడి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తేలింది. గత ఎన్నికల్లోను ముస్లిం మైనారిటీ ఓటర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను చూసి, రానున్న ఎన్నికల్లో తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీలు, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు 6% ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది ఒక అంచనా. కర్ణాటక ఎన్నికల్లోను మైసూర్, ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఎంతో పట్టున్న జనతాదల్ సెక్యులర్ పార్టీకి ఐదు శాతం ఓట్లు తగ్గి, కాంగ్రెస్ పార్టీకి అదనంగా చేరడంతో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ముస్లిం మైనారిటీ ఓటర్లు గతంలో ప్రతిపక్షాలకు మద్దతుగా ఉన్నవారు అదే ఆనవాయితీని కొనసాగించాలని భావిస్తుండగా అధికార పార్టీకి మాత్రం డెంట్ అవుతోంది.. సర్వేలన్నీ ఇవే సూచన చేస్తున్నాయి.
కారణాలేమైన నా ప్రస్తుత పార్టీకి ముస్లిం మైనార్టీలు సింహభాగం దూరం కావడం ఖాయం. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు దక్కకపోయినప్పటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా స్థానాలలో నష్టపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అరకు, రాజంపేట, కడప స్థానాలలో కూడా మెజారిటీ తగ్గిపోయిన, విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం అధికార పార్టీకి మెజారిటీ తగ్గిపోయి ఈ స్థానాలలో ప్రతిపక్షాలతో నువ్వా నేనా అన్నట్లు తల పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు మరింత సమయం ఉండడం, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చార్జిషీట్ లోని పేర్లను మా పార్టీ నాయకత్వం ఎంతగా కవర్ చేయాలని భావించినప్పటికీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతనే కనిపిస్తున్నట్లు స్పష్టం అవుతోంది . ఒక వెబ్సైట్ నిర్వహించిన పోల్ సర్వేలో ఈ విషయం వెళ్లడయ్యింది. కడప, రాజంపేట పై కూడా ఎఫెక్ట్ పడితే టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే చెప్పినట్లుగా 24 నుంచి 25 స్థానాలు దక్కవచ్చునన్న రఘురామకృష్ణంరాజు, అది తమ పార్టీకి కాదని… ప్రతిపక్ష పార్టీలకని పేర్కొన్నారు.
ఇప్పటివరకు మా పార్టీకి సాలీడు ఓటు బ్యాంకు గా ఉన్న ఎస్సీ, ఎస్టీలలో కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్వీకరిస్తే, ప్రజలపై ఆమె ప్రభావం బలంగా ఉండనుంది. దీనితో, అసెంబ్లీ ఎన్నికల్లోను అధికార పార్టీ మరిన్ని తక్కువ స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు సఉన్నాయి.
ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ఖరారు అయితే, ప్రజల్లో నెలకొన్న భయం తగ్గితే ఆ సంఖ్య 20 నుంచి 25 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లుగా ట్రెండ్ కనిపిస్తోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలనే చేసినప్పటికీ విఫలమయ్యారు. కేంద్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిసిన తర్వాతే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి, నిర్ణీత సమయంలోనే ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నట్లు స్పష్టమవుతుంది.
అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా కలిసి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ తీవ్రంగా ప్రభావం చూపనుంది. నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు మరికొంత సమయం పట్టవచ్చు. పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లుగా, ఎంతోమంది ప్రజలు ఆశిస్తున్నట్లుగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, పొత్తు మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.
ఎన్నికలు సజావుగా జరగాలంటే ప్రజల్లో మనోధైర్యం రావలసిన అవసరం ఉంది. అధికారికంగా పొత్తు ప్రకటించిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. ప్రతిపక్షాల ఓట్లు చీలే అవకాశాలు కనిపించడం లేదు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అని గ్రామ సింహాల్లా మా పార్టీ నాయకులు మోరుగుతున్నప్పటికీ, వారిలోనూ మార్పు వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఎస్సీ ఎస్టీల్లోనూ ఎందుకు మార్పు వచ్చింది అంటే… గత ప్రభుత్వాల హయాంలో ప్రత్యేకించి వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యేవి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ ఎత్తివేయడం జరిగింది.
ఎస్సీ ఎస్టీ , మైనార్టీలు సంక్షేమ పథకాలను అందరితో పంచుకోవలసి రావడం, గతంలో కన్నా తమకు తక్కువ లబ్ధి చేకూరుతుందన్న విషయాన్ని ఆయా వర్గాల వారు గ్రహించారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని మహాసేన రాజేష్, రిటైర్డ్ న్యాయమూర్తి శ్రావణ్ లు వివరిస్తూ వారికి కనువిప్పు కలిగిస్తున్నారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎంతో లబ్ధి చేకూరేది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మార్జిన్ మనీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఆయా పథకాలు కూడా అమలుకు నోచుకోకుండా పోతున్నాయి.
ప్రజా జీవితంలో ఓటర్లను మించిన తెలివైన వారు ఎవరూ లేరు. రానున్న ఎన్నికల్లో ధన ప్రభావం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే. ప్రస్తుత వరదల మాదిరిగానే, రేపు ధన ప్రవాహాన్ని కొనసాగించిన ఇప్పటికే డిసైడ్ అయి ఉన్న ఓటర్లు తమ మనసు మార్చుకునే అవకాశం లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.