Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల కదనరంగంలోకి “యువగళం” సారధి

-30వ తేదీ నుంచి నారా లోకేష్ సుడిగాలి పర్యటన
-రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు

అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలను చైతన్యంచేస్తూ యువగళం పేరుతో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల మేర పాదయాత్రచేసిన యువనేత నారా లోకేష్… ఈనెల 30వతేదీ నుంచి ఎన్నికల కదనరంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేష్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారంరోజులపాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు.

30వతేదీన ఒంగోలులో ప్రారంభం కానున్న యువనేత లోకేష్ పర్యటన… మే 6వతేదీన ఏలూరు వరకు కొనసాగనుంది. ఈనెల 30వతేదీన ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలు కొనసాగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి 6గంటలవరకు యువతతో సాగే ముఖాముఖి సమావేశాల్లో యువతీయువకుల సందేశాలను లోకేష్ నివృత్తి చేస్తారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ యువతతో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

అదేతరహాలో కొనసాగే యువగళం సభలకు భారీఎత్తున యువతీయువకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కూటమి ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఓ పార్లమెంటు కేంద్రంలో యువతతో నిర్వహించే ఈ ముఖాముఖి సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో వారు నెరవేర్చాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారు. అయిదేళ్ల జగన్ విధ్వంసక పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిపోగా, యువత బంగారు భవిష్యత్తును నాశనం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీచేస్తానని, ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నజగన్… ఎటువంటి క్యాలెండర్ ఇవ్వకుండానే అయిదేళ్లు కాలయాపన చేశారు.

జగన్మోసం కారణంగా రాష్ట్రంలో చదువుకున్న లక్షలాది యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు. అయిదేళ్లలో రాష్ట్రానికి కొత్తగా ఎటువంటి పరిశ్రమలు రాకపోగా, జె-ట్యాక్స్ కోసం ఉన్న పరిశ్రమలను సైతం పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సిన భారత్ బయోటెక్, అమర్ రాజా, ఫ్యాక్స్ కాన్, జాకీ. అదానీ డాటా సెంటర్ వంటివి పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో స్థానిక యువత లక్షలాది ఉద్యోగావకాశాలు కోల్పోయారు.

మూడుముక్కలాటతో అమరావతి రాజధానిని నాశనం చేయడంతో లక్షమంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాల కల్పన విషయంలో జగన్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు తాము ఏవిధంగా భరోసా కల్పిస్తామో లోకేష్ వివరిస్తారు.

ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులభర్తీ, ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాలద్వారా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగం వచ్చేవరకు యువగళం పేరుతో ప్రతినెలా 3వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి హామీలపై యువతకు అవగాహన కల్పిస్తారు.

LEAVE A RESPONSE