బ్రిటన్‌లోని బోరిస్ జాన్సన్ సర్కారు మరింత మేర కష్టాల్లో పడిపోయింది. మంగళవారం నుంచి మొదలైన రాజీనామాలు బుధవారం సాయంత్రానికి ఏకంగా 10కి చేరిపోయాయి. మంగళవారమే జాన్సన్ సర్కారులో కీలక మంత్రులుగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావెద్ లు తమ పదవులకు రాజీనామా చేశారు. బుధవారం ఉదయం మరో ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయగా… బుధవారం మధ్యాహ్నం రాజీనామాల సంఖ్య ఏకంగా 10కి చేరిపోయింది.
ఫలితంగా జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పదా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే పెను వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవడంతో జాన్సన్‌పై ఆయన కేబినెట్ మొత్తం అసంతృప్తిగా ఉంది. ఈ కారణంగానే వరుసబెట్టి మంత్రులంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం నుంచి జాన్సన్ ఎలా బయటపడతారన్నది చూడాలి.