Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ సమక్షంలో టిడిపి లోకి 130 కుటుంబాలు

– అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా
– నారా లోకేష్

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ మంగళగిరిలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయమని అన్నారు. మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. యువనేత మాటలకు ఆకర్షితులైన వివిధపార్టీల ప్రముఖులు టీడీపీలో చేరుతున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 130 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికీ యువనేత పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన నల్లబోతుల సుబ్బారావు, చొప్పవరపు గోపి, బరిగల కోటేశ్వర రావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, ఇదే గ్రామానికి చెందిన షేక్ జిలానీ, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ జహంగీర్ బాషా ఆధ్వర్యంలో 30 మైనార్టీ కుటుంబాలు, కురగల్లు గ్రామానికి చెందిన తోట శివశంకరావు, తాడిబోయిన కామేశ్వరావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, నిడమర్రు గ్రామానికి చెందిన మేడ రామయ్య ఆధ్వర్యంలో 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఆ ప్రాంతంలో కనపడకుండా తిరుగుతుంటారు. 2019లో నేను ఓడిపోయినప్పటి నుంచి మంగళగిరిలో నియోజకవర్గంలోనే ఉండి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దాదాపు 29 కార్యక్రమాలు నియోజకవర్గంలో అమలుచేస్తున్నాం. అధికారంలో లేకపోయినా నేను తీసుకువచ్చిన ఐటీ పరిశ్రమ ద్వారా 150 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం.

గత ఎన్నికల్లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను, ఈసారి 53వేల మెజార్టీతో గెలిపించి నన్ను శాసనసభకు పంపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా. 50 రోజులపాటు రోజుకు 2 గంటలు నా కోసం కేటాయించి గెలుపు ఆవశ్యకతపై ప్రచారం చేయాలని లోకేష్ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, తోట పార్థసారథి, ఆకుల జయసత్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE