ఎన్నికలకు ముందు అవాకులు చెవాకులు పేలితే జనం ఓట్లేయరు

-అసెంబ్లీ ఎన్నికలకు 16 నెలల ముందు అవాకులు చెవాకులు పేలితే జనం ఓట్లేయరు, ‘బాబూసాహబ్‌’!
( వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)

ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభ ఎన్నిలకు 16 నెలలకు పైగా గడువు ఉంది. కాని, అధికారం లేకుండా అల్లాడిపోతున్న తెలుగుదేశం అప్పుడే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ముఖ్యంగా, ఏ మాత్రం అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల, టీడీపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుత్రరత్నం లోకేష్‌ నాయుడు ఓడిపోయిన మంగళగిరిలో గొడవ చేయడం లేదా ఈ స్థానాల గురించి నోటికొచ్చినట్టు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం మానుకోలేదు పసుపు పచ్చ కుల పార్టీ నేతలు.

మంగళగిరి నియోజవర్గంలోని ఓ గ్రామంలో పాలనాపరమైన సమస్యపై జరిగిన గొడవ పెద్దది చేయడానికి లోకేష్‌ నాయుడు బుధవారం చేసిన ప్రయత్నం ఫలించలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో అన్నీ కూల్చివేతలే జరుగుతున్నట్టు చిన్ననాయుడు ఎప్పటిలా అబద్ధాలే మాట్లాడారు. వాస్తవానికి, ఆయన తండ్రి చంద్రబాబు హయాంలోనే అడ్డగోలు కూల్చివేతలు జరిగాయి.

విజయవాడలో రోడ్లు వెడల్పు చేసే పేరుతో ముందూ వెనుకా చూడకుండా ప్రార్థనాస్థలాలలోని దేవాలయాలను టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. టీడీపీ పాలనలో జేసీబీలు విచక్షణారహితంగా వినియోగించారు. జేసీబీల పేరు చెప్పి వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎలాగైనా కిందామీదా పడి గెలవాలన్న ‘లోకనాయకుడి’ వ్యూహం ఫలించదు. ఇకపోతే, ఆయన పితాశ్రీ, పార్టీ అధినేత అసెంబ్లీ నియోజవర్గాల సమీక్ష పేరుతో చేస్తున్న కాలక్షేపం రక్తికట్టిస్తోంది.

పులివెందుల నియోజకవర్గానికి పాలకపక్షం వల్ల మంచి పేరు రావడం లేదని చంద్రబాబు అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కోరిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడికి ప్రజలు ఐదేళ్ల పాలనకు అధికారం అప్పగించారు. ఆయన తన పాలనా సామర్ధ్యంతో మరో నాలుగు ఎన్నికల్లో గెలిచే విధంగా జనాదరణ సంపాదించారు.

వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ అధినేత కొడుకును మించిపోయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనపై తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో చెలరేగిపోయారు. రాజకీయ పార్టీల పనితీరును బట్టి ఎన్నికల్లో జనం గెలిపిస్తారు గాని పార్టీల నేతల దూషణలు విని కాదని 72 ఏళ్ల స్వయంప్రకటిత సీనియర్‌ మోస్ట్‌ నేత గుర్తిస్తే మంచిది.

Leave a Reply