ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్ల తో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సాలార్జింగ్ మ్యూజియంలో ఈ నెల 24 న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఈరోజు మరణించిన లాల్ దర్వాజ దేవాలయం మాజీ చైర్మన్ మహేష్ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే తెలంగాణ పండుగలను విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్రు చేశారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం బోనాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా పండుగలు జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి అభిమతం అన్నారు. ఓల్డ్ సిటీ బోనాల సందర్భంగా చేపట్టిన పనులు ఈ నెల 15 వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయాల పరిధిలో ఎక్కడ కూడా సీవరేజ్ లీకేజీ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంబారీ పై ఊరేగింపు ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సందర్భంగా ఊరేగింపు సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ తీగలను సరిచేయడం వంటి పనులు వెంటనే చేపట్టాలని చెప్పారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ దైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు అందించేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 2 లక్షల వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఉత్సవాలను వీక్షించే విధంగా పలు ఆలయాల వద్ద LED స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా దమయంతి భవన్, ఢిల్లీ దర్వాజ వద్ద త్రీడీ మ్యాప్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకు రాగా, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ రోడ్లపై చెత్త, చెదారాలు లేకుండా చూడాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రాంతాలలో డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ, జోనల్ కమిషనర్ లు సామ్రాట్ అశోక్, రవి కిరణ్, ఎలెక్ట్రికల్ CGM నర్సింహా స్వామి, స్ట్రీట్ లైట్ SE నర్సింగ్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, RDO వెంకటేశ్వర్లు, DCP సాయి చైతన్య, అడిషనల్ DCP ఆనంద్, ట్రాఫిక్ DCP కరుణాకర్, ACP శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ ENC కృష్ణ, CGM వినోద్ భార్గవ, RTC DVM రాములు, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్, I&PR CIEO రాధాకృష్ణ, జూపార్కు క్యూరేటర్ రాజశేఖర్, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ యాదవ్, జనరల్ సెక్రెటరీ క్రాంతి కుమార్, ఆనంద్, మామిడి కృష్ణ, గాజుల అంజయ్య, మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.