Suryaa.co.in

Editorial

కేటీఆర్‌.. సెంటి‘మంట’!

– మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ రగిలించే వ్యూహం?
– కిరణ్‌కుమార్‌రెడ్డి, కెవిపి భుజంపై ‘తెలంగాణ’ తుపాకీ
– సెంటిమెంట్‌తో రేవంత్‌, కిషన్‌రెడ్డిని పేల్చే ఎత్తుగడ
– గతంలో టీడీపీపై సంధించిన అస్త్రమే మళ్లీ కాంగ్రెస్‌-బీజేపీపై ప్రయోగం
– గత ఎన్నికల్లో టీడీపీపై కేసీఆర్‌ ‘ఆంధ్రాపార్టీ’ అస్త్రం
– ఇప్పుడు మళ్లీ కిరణ్‌-కెవిపిని అడ్డుపెట్టి అధికారంలోకి వచ్చే వ్యూహం?
– బీఆర్‌ఎస్‌ మళ్లీ తెలంగాణవాదాన్నే నమ్ముకుంటోందా?
– అభివృద్ధి-సంక్షేమ అస్ర్తాలు ఇక ఎన్నికల నినాదాలు కావా?
– జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ అంశాలకే పరిమితం
– చిట్‌చాట్‌లో జాతీయ అంశాలపై పెదవి విప్పని కేటీఆర్‌
– కర్నాటక, మహారాష్ట్ర, ఏపీలో పోటీపై మౌనం
– సనాతనధర్మంపై కేటీఆర్‌ మౌనరాగం
– పేరుకు జాతీయ పార్టీ అయినా తీరు ప్రాంతీయమేనా?
– కేటీఆర్‌ వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ వాదాన్ని భూమార్గం పట్టించి.. తెలంగాణవాదులను ఏకోన్ముఖులను చేసి అధికారంలోకి వచ్చిన నాటి ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌.. నేడు బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మారినప్పటికీ, మళ్లీ తెలంగాణవాదంపైనే ఆశలు పెట్టుకుంటోందా? తమది ఇకపై జాతీయ పార్టీ అని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. నీళ్లపంచాయితీ, ప్రాంతాల వంటి వాటిని పట్టించుకోమని చెప్పిన బీఆర్‌ఎస్‌… మళ్లీ తన పాత మూలాలనే నమ్ముకుంటోందా?

అందుకే ఆంధ్రా నేతల భుజాలపై తుపాకి పెట్టి, తెలంగాణలోని జాతీయ పార్టీ పై గురి ఎక్కుపెట్టిందా? ఆ ప్రకారంగా మళ్లీ తెలంగాణ సెంటి‘మంట’ను రగిలించడమే బీఆర్‌ఎస్‌ నాయకత్వ వ్యూహమా? బీఆర్‌ఎస్‌ ఉత్తరాధికారి, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటయిన మంత్రి కేటీఆర్‌ మాటలు చూస్తే.. ఈ అనుమానాలు నిజమేననిపించక మానవు.

టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందినప్పటికీ, మళ్లీ తన మూలాలనే ఆశ్రయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేసిన సందర్భంలో, బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు వ్యూహమేమిటన్నది ఆవిష్కృతమయింది. నిజానికి జాతీయ పార్టీగా మారి, మహారాష్ట్రలో హడావిడి చేస్తూ, ఏపీలో రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించి, కొద్దిరోజులు కర్నాటకలో ఉనికియాత్రలు చేసిన బీఆర్‌ఎస్‌.. జాతీయ అంశాలు- విధానాలపైనే మాట్లాడాల్సి ఉంది. ముఖ్యంగా ఇది ఎన్నికల సీజన్‌ కాబట్టి.. తాను ఏయే రాష్ర్టాల్లో పోటీ చేస్తుంది? ఇండియా కూటమితో పొత్తు ఉంటుందా? లేదా? ఏయే అంశాలపై దృష్టి సారించనుందన్న అంశాలనే ప్రస్తావించాల్సి ఉంది.

కానీ కేటీఆర్‌ ప్రస్తావించిన వాటిలో ఒక్కటీ జాతీయ అంశం లేకపోవడం, కేవలం తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కావడం విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికలు- సనాతనధర్మం- కామన్‌సివిల్‌కోడ్‌- మహిళాబిల్లు- జనాభా నియంత్రణ వంటి కీలక అంశాలపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ప్రధానంగా సనాతన ధర్మ అంశంపై దేశంలోని అన్ని పార్టీలూ తమ వైఖరి ప్రకటించాయి.

జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్‌ఎస్‌ మాత్రం సనాతన ధర్మ వివాదంపై ఇప్పటిదాకా పెదవి విప్పింది లేదు. గతంలో జమిలి ఎన్నికలకు లోక్‌సభలో మద్దతునిచ్చిన నాటి టీఆర్‌ఎస్‌ వైఖరి, ఇప్పుడు జాతీయ పార్టీగా మారిన తర్వాత మారిందా? లేక అదే వైఖరి కొనసాగుతుందా అన్న అంశంపై కూడా స్పష్టత ఇవ్వలేదు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన కేటీఆర్‌, తన చిట్‌చాట్‌లో ఈ అంశాలను ప్రస్తావిస్తారని భావించారు. అయితే వాటిలో ఏ ఒక్క అంశంపైనా ఆయన తన పార్టీ వైఖరి స్పష్టం చేయలేదు. సనాతనధర్మంపై కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారన్న బీజేపీ నేతల ప్రశ్నలకూ, కేటీఆర్‌ నుంచి జవాబు లేకపోవడం విస్మయం కలిగింది. మహిళా బిల్లుపైనా పార్టీ వైఖరి చెబుతారనుకున్న వారికి నిరాశే ఎదురయింది.

అయితే అలాంటి జాతీయ అంశాలన్నీ పక్కనపెట్టి.. మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేయడమే, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. దశాబ్దాల కాలం నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్న కాంగ్రెస్‌ కీలకనేత, మాజీ ఎంపి కెవిపి రామచంద్రరావు, తాజాగా బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లు వ్యూహాత్మకంగానే ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.

ఆమేరకు తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిలించే ప్రయత్నం చేసిన కేటీఆర్‌ వ్యాఖ్యలు పరిశీలిస్తే.. అభివృద్ధి నినాదం కంటే, తెలంగాణ సెంటిమెంట్‌పైనే బీఆర్‌ఎస్‌ ఆధారపడుతోందని స్పష్టమవుతోంది. లేకపోతే ప్రతి ఇంట్లోనూ తమ అభివృద్ధి-సంక్షేమ ఫలాలు ఉన్నాయని మొన్నటి వరకూ ప్రచారం చేసిన బీఆర్‌ఎస్‌.. హటాత్తుగా రూటు మార్చి, ‘కారు’ను సెంటిమెంటు మార్గం పట్టించదన్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

‘‘తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి, తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసిన కెవిపి, తాను తెలంగాణ పౌరుడినని చెప్పుకోవడం మన కర్మ’’ అంటూ కేటీఆర్‌ పాత విషయాన్ని తవ్వేపని ప్రారంభించారు. ఇక తెలంగాణ వ్యతిరేకులైన కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ కూతురు షర్మిల వంటి వారంతా ఒకటవుతున్నారంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ రకంగా ఆంధ్రానేతలైన కెవిపి-కిరణ్‌కుమారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జాతీయ పార్టీలూ.. తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని, కేటీఆర్‌ చెప్పకనే చెప్పినట్టయింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని కిషన్‌రెడ్డి, తెలంగాణవాదులపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముసుగులో వచ్చారని, కేటీఆర్‌ గతాన్ని గుర్తు చేయటం ప్రస్తావనార్హం. చివరగా బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కిరణ్‌కుమార్‌ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కెవిపి ఆడిస్తున్నారంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణ.. మళ్లీ తెలంగాణ సెంటి‘మంట’గానే భావించక తప్పదని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి దళితబంధు, బీసీబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాబీముబారక్‌, కెసిఆర్‌ కిట్‌, మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరధ వంటి పథకాలు-ప్రాజెక్టులే, తమను గెలిపిస్తాయంటూ మొన్నటివరకూ బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు వాటిని పక్కనపెట్టి, మళ్లీ తెలంగాణ సెంటిమెంటు రగిలించడం బట్టి.. ఎన్నికల వరకూ బీఆర్‌ఎస్‌, తన జాతీయ పార్టీ ప్రత్యర్ధులపై అదే అస్త్రం సంధించబోతుందన్నది సుస్పష్టం. అందుకే కేటీఆర్‌.. ఏపీకి చెందిన కాంగ్రెస్‌ నేత కెవిపి భుజంపై నుంచి రేవంత్‌రెడ్డిని, ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భుజంపై నుంచి బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని పేల్చినట్లు కనిపిస్తోంది.

ఈ విషయంలో కేటీఆర్‌.. గత ఎన్నికల్లో తన తండ్రి టీడీపీ సంధించిన అస్ర్తాన్నే, తాజాగా కాంగ్రెస్‌-బీజేపీపై ప్రయోగించినట్లు అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్‌.. ఆంధ్రాపార్టీ అస్ర్తాన్ని అందుకున్నారు. ‘ఆంధ్రాపార్టీ అయిన టీడీపీతో నాలుగుసీట్ల కోసం పొత్తు పెట్టుకున్నారు.. థూ.. మీ బతుకులు చెడ’ అంటూ చండ్ర నిప్పులు చెరిగారు.

‘అసలు ఆంధ్రా పార్టీకి తెలంగాణలో ఏం పని? రేపు కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ సీఎం ప్రతి చిన్నపనికీ అమరావతి వెళ్లి అనుమతి తీసుకోవాలా’? అంటూ సంధించిన సెంటిమెంట్‌ ప్రశ్నాస్ర్తాలు, సగటు తెలంగాణ ప్రజల మనుసును సూటిగా తాకాయి. దానితో మళ్లీ కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు కూడా రావడం విశేషం.

అప్పుడు తండ్రి కేసీఆర్‌, టీడీపీపై భుజం నుంచి కాంగ్రెస్‌ను పేల్చినట్లుగానే.. ఇప్పుడు తనయుడు కేటీఆర్‌ కూడా, ఆంధ్రా నేతలైన కెవిపి-కిరణ్‌కుమార్‌రెడ్డి భుజంపై నుంచి, బీజేపీ-కాంగ్రెస్‌ను తెలంగాణ తాటాలతో పేల్చి..మరోసారి అధికారంలోకి రావాలన్న ఎత్తుగడ ఆసక్తికరంగా మారింది.

అయితే రెండుసార్లు అధికారంలో ఉండి.. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చి, రెండు రాష్ర్టాల్లో కమిటీలు కూడా వేసుకున్న బీఆర్‌ఎస్‌ సంధించే.. ‘తెలంగాణ సెంటిమెంట్‌’ ప్రయోగం ఫలిస్తుందా? అడ్డం తిరుగుతుందా అన్నది చూడాలి.

తాను ఇతర రాష్ర్టాల్లో అధికారం కోసం పోరాడుతూ, అక్కడ కమిటీలు కూడా వేసి, ఇతర రాష్ర్టాల పార్టీలు-నేతలు.. తెలంగాణలో రాజకీయాలు చేయకూడదన్న ద్విజాతి సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారా? తిరస్కరిస్తారా అన్నది చూడాలి. మొత్తానికయితే.. బీఆర్‌ఎస్‌ ఎన్నికల అస్త్రం.. అభివృద్ధి నినాదం కాకుండా, తెలంగాణ సెంటి‘మంట’నేనని.. కేటీఆర్‌ మాటల్లో స్పష్టమైందన్న వ్యాఖ్యలు, రాజకీయ వ ర్గాల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE