Suryaa.co.in

Andhra Pradesh

సీఐడీ వాస్తవాలు కోర్టుల ముందు పెట్టకుండా ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది?

• చంద్రబాబుని శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్న పాలకుల కుట్రలు నెరవేరవు
• ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా అన్యాయంగా ఒకరిని రిమాండ్ కు పంపడం దేశచరిత్రలో ఎన్నడూ జరగలేదు
• సత్యాన్ని వధించి, ధర్మాన్ని చెరపట్టిన ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తాత్కాలిక ఆనందం పొందుతున్నారు
• సీఐడీ చీఫ్ సంజయ్ తానే నమ్మే దైవం సాక్షిగా వాస్తవాలు బయటపెట్టగలరా?
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్

కారుకూతలు కూయడంలో మంత్రి కారుమూరి మంచి సిద్ధహస్తుడని, జగన్ రెడ్డి విసిరే బిస్కట్లు బాగా వంటపట్టించుకున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఉపముఖ్యమం త్రిగా ఏనాడూ తన విధులు, హక్కుల గురించి మాట్లాడిందిలేదని, ఆయన నోటిని అదుపులో పెట్టుకోకపోతే కాలగర్భంలో కలిసిపోయేవారిలో ముందుంటారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై మాట్లాడే వైసీపీనేతలు, మంత్రులంతా ఒక్కసారి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధించిన వైనం, దానిపై డిఫెన్స్ చేసు కునే అవకాశం కూడా సదరు వ్యక్తికి ఇవ్వని తీరుపై ఆలోచించుకుంటే మంచిది. అన్యాయంగా ఒకరిని రిమాండ్ కు పంపడం బహుశా దేశచరిత్రలో ఇంతవరకు జరిగి ఉండదు. చంద్రబాబు వయసుకు, ఆయన అనుభవానికి, ఆయన చేసిన మంచికి గౌరవం ఇవ్వకుండా ఆయన్ని ఇబ్బందిపెడుతున్న వారు తప్పకుండా మూల్యం చెల్లిం చుకుంటారు.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను చంద్రబాబు కేబినెట్ కు తెలియకుండా నెలకొల్పారని అదొక నేరమని ఈ ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేషన్ ప్రతిపాదన ఫైల్ అధికారుల ముందు పెట్టి, జీవోలు ఇచ్చి, తరువాత కేబినెట్లో రాటిఫికేషన్ చేద్దామని రాస్తే దానిపై సంతకం పెట్టారు..ఇదే నిజం. అదే ఫైల్లో అప్పటి విద్యాశాఖ కార్యదర్శి శ్రీ మతి నీలం సహానీ, ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావులు కూడా సంతకాలు పెట్టారు.

ఫైల్ వచ్చిందిగానీ, దానిపై రాటిఫికేషన్ జరగలేదని కిందిస్థాయి అధికారులు చెప్పినా, నీలం సహానీ, అజయ్ కల్లం రెడ్డి, ఐ.వై.ఆర్ కృష్ణారావులు పట్టించుకోలేదనేది వాస్తవం. అయినా వారిని ప్రశ్నించరు.. శిక్షించరు. వారిని వదిలేసి కేవలం అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడిని మాత్రమే ఎందుకు నిందితుడిగా పెట్టారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలి. ఆనాటి ఫైళ్లు సీఐడీ ఎందుకు కోర్టు ముందు ఉంచడం లేదో కూడా చెప్పాలి.

తన మనుషులని పెట్టి అడ్వాన్స్ గా రూ.370కోట్లు విడుదలచేసి, కోట్ల కుంభకోణానికి చంద్రబాబు కుట్రపన్నారని మరో అభియోగం మోపారు. దాన్నే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

అదే నిజమైతే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో మనీ ల్యాండరింగ్ చట్టం సెక్షన్ 50కింద వాంగ్మూలమిచ్చిన అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి ప్రేమచంద్రా రెడ్డి కార్పొరేషన్ అమలుకు అవసరమైన రూ.370కోట్లు తానే విడుదలచేశానని చెప్పాడు. ఆర్థికశాఖకు చెప్పి అన్ని శిక్షణాకేంద్రాల్లో కేంద్రప్రభుత్వ సంస్థ సీఐటీడీతో మదింపు చేయించానని చెప్పాడు. తన రిటైర్ మెంట్ తర్వాత బాధ్యతలు చేపట్టిన అధికారులు పర్యవేక్షణకు బాధ్యులని కూడా ఆయన చెప్పడం జరిగింది.

నిధుల చెల్లింపునకు సంబంధించిన ఫైల్ ఉన్నా…దానిలోని విషయాలు సీఐడీ పట్టించుకోదు. అలానే ప్రేమ చంద్రారెడ్డిని విచారించదు. కేవలం చంద్రబాబునాయడే బాధ్యుడని మూర్ఖంగా వాదిస్తోంది.

ఆర్థికశాఖ అధికారులు వద్దని మొత్తుకున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు బలవంతంగా నిధులు విడుదలచేయించారు.. దోపిడీకోసమే ఇలా జరిగిందని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీమతి సునీత చెప్పింది అనేది మరో ఆరోపణ..

ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చలో అధికారులందరం మాట్లాడుకొని కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను సమర్థవంతంగా అమలుచేయాలని దానికి అవసరమైన నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు తెలిపారు. ఇదే విషయం ఆయన గతంలో సీఐడీ విచారణలోకూడా చెప్పారు. దీనికి సంబంధించిన కాగితాలు కూడా సీఐడీ వద్ద ఉన్నాయని కృష్ణారావు చెప్పారు.

నిధుల విడుదలకు ముందు సిమెన్స్ సంస్థతో వ్యక్తిగతంగా చర్చించి, పీ.వీ.రమేశ్ ఆరు సూచనలు చేసి, రెండు విడతలుగా నిధులు విడుదలచేస్తామని ఒప్పుకున్నారు. ఆ విషయం స్వయంగా ఫైల్లో కూడా రాశారు. రెండో విడత నిధుల విడుదల గురించి ప్రేమచంద్రారెడ్డి కోరినప్పుడు శ్రీమతి సునీత, పీ.వీ.రమేశ్ చెప్పిన షరుతులపై ప్రశ్నిస్తే ప్రేమచంద్రారెడ్డి సుదీర్ఘమైన వివరణ ఇచ్చా రు. ఈ వ్యవహారానికి సంబంధించిన కాగితాలు అన్నీ ఏసీబీ కోర్టుకు సీఐడీ సమర్పించింది.

పేర్నినాని కావాలనే జగన్ రెడ్డిని అభాసుపాలు చేసేలా మాట్లాడుతున్నాడు
సిమెన్స్ సంస్థ పేరు బాగుందని చంద్రబాబు వారితో సంప్రదించకుండానే బోర్డు పెట్టారని ఏదేదో మాట్లాడుతున్న పేర్నినానికి బందరుకు, మచిలీపట్నానికి తేడా తెలియదు. జగన్ రెడ్డిని ఎంత నాశనం చేయాలో..ఏవిధంగా అల్లరి చేయాలో అన్నీ నాని చేస్తున్నా డు. పేర్నినాని స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా? జగన్ రెడ్డిని అభాసుపాలు చేయాలన్న ధోరణితోనే పేర్నినాని మాట్లాడుతున్నట్టు ఉంది.

అలానే సిమెన్స్ గ్లోబల్ సంస్థ వారు సిమెన్స్ ఇండియా సంస్థతో తమకు సంబంధంలేదని ఉత్తరం రాశారని సీఐడీ చీఫ్ సంజయ్ చెబుతున్నారు. సంజయ్ కు తాను నమ్మే దేవుడిపై విశ్వాసం ఉందా? తోటివారి విషయంలో అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదన్న బైబిల్ నిబంధన ను సంజయ్ విస్మరించడం బాధాకరం.

బుగ్గన వ్యాఖ్యలు ఆయనలోని ఆర్థికశాఖ నిర్వహించలేని తన అయిష్టత.. ఫ్రస్టేషన్ కు నిదర్శనం…
సిమెన్స్ సంస్థ చేసుకున్న 90 : 10 నిష్పత్తిపై బుగ్గన మతిలేకుండా మాట్లాడుతున్నాడు. బుగ్గనకు మద్యం అమ్మకాలు తాకట్టుపెట్టి అప్పులు తేవడం.. కేంద్రఆర్థికమంత్రిని ఒప్పించి అప్పులు తేవడం… ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేయడం.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు ఆపడం బాగా తెలుసు. ఆర్థికశాఖ మంత్రిగా చేయ ననిచెప్పి పారిపోదామనుకున్న బుగ్గనకు జగన్ రెడ్డి బలవంతంగా ఆశాఖ బాధ్యతలు అప్పగించి చూడాల్సిందే అని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో తనలోని ఫ్రస్టేషన్ ను బుగ్గన ఇలా సంబంధంలేని వ్యాఖ్యలతో కప్పిపుచ్చుకుంటున్నాడు.

సిమెన్స్ అధిపతిగా ఉన్న వ్యక్తి గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారికి వాంగ్మూ లం ఇచ్చిన తాలూకా కాగితాలు కూడా సీఐడీ కోర్టు ముందు పెట్టకుండా వాస్తవాలు దాచి దుష్ప్రచారం చేస్తోంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి చంద్రబాబుకి వచ్చిన నోటీసు లపై కూడా రాష్ట్రప్రభుత్వం కట్టుకథలు అల్లుతోంది. చంద్రబాబు వద్ద పీఏగా పని చేసిన శ్రీనివాస్ అనారోగ్యకారణాలతో అమెరికాకు వెళ్తే, దానిపై కూడా విషప్రచారం చేశారు. సీఐడీకి తాను అమెరికా వెళ్తున్నట్టు చెప్పినా, చెప్పలేదని దుష్ప్రచారం చేయడం ఇంకో పెద్ద తప్పు.
ఇవన్నీ చూస్తే చంద్రబాబుని శాశ్వతంగా జైల్లోనే ఉంచా లనే కుట్రలో జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఉందని అర్థమవుతోంది. పాలకుల కుట్రలు, కుతంత్రాలు ఎప్పటికీ నెరవేరవు.

సత్యాన్ని వధించి, ధర్మాన్ని చెరపట్టిన ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తాత్కాలిక ఆనందం పొందవచ్చు. తెలుగుదేశానికి సంక్షోభాలు కొత్తకాదు. ఇలాంటి సమయాల్లో కార్యకర్తలు మరింత కసితో పనిచేస్తారు. వారే ముందుండి పార్టీని నడిపిస్తారు గానీ ఎక్కడా వెనకడుగు వేయరు. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారు.. అప్పటివరకు ప్రజలు టీడీపీకి అండగా ఉండాలి.” అని జవహర్ కోరారు.

LEAVE A RESPONSE