– కేసీఆర్‌కు వెల్లువెత్తిన పరామర్శలు
– ఆసుపత్రికి రేవంత్, బాబు, చిరంజీవి, జానారెడ్డి
– రేవంత్ రాకను విమర్శిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
– తనను ఏడాదిపాటు సీఎంగా ఉంచాలని కేసీఆర్‌ను రేవంత్ వేడున్నారట
– పొన్నాల వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్
– పొన్నాల నేల-చౌకబారు వ్యాఖ్యలపై ఆగ్రహం
– రేవంత్ రుచించని కాంగ్రెస్ వర్గాలు
– బాబు పరామర్శపై సెటిలర్లలో అసంతృప్తి
– బాబు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చారా అని ప్రశ్నల వర్షం
– అది రేవంత్,బాబు సంస్కారానికి నిదర్శనమని మరికొందరు వ్యాఖ్యలు
– ఇద్దరూ హుందాతనం ప్రద ర్శించారన్న ప్రశంసలు
– పరామర్శలపై సరికొత్త చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎవరైనా ప్రముఖులు అనారోగ్యం పాలైతే వారిని పరామర్శించే సత్సంప్రదాయం రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఎంతటి శత్రువైనా ఆసుపత్రిలో ఉంటే వారిని పలకరించి, పరామర్శించే ఆరోగ్యకరమైన సంప్రదాయం ఉండేది. అది రాజకీయాలు హుందాగా ఉన్న రోజుల్లో!
ఒకప్పుడు ఇద్దరూ అపూర్వ స్నేహితులయినప్పటికీ, వైఎస్-బాబును రాజకీయాలు విడదీశాయి. అలా ఇద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం పూడ్చలేనంత దూరం పెరిగింది. అలాంటి సమయంలో కూడా.. చంద్రబాబుపై నక్సల్స్ జరిపిన దాడిని ఖండిస్తూ, వైఎస్ తిరుపతిలో ధర్నా నిర్వహించి, బాబుకు సంఘీభావం ప్రకటించారు. సభలో టీడీపీ- కాంగ్రెస్ మధ్య సవాళ్లు-ఆవేశకావేశాలు వినిపించినా, అటు ఇటు ఉన్న పెద్దమనుషుల జోక్యంతో అవి చల్లారేవి. అసెంబ్లీ బయట ఇరు పార్టీల నేతలూ ఛలోక్తులు విసురుకునే వారు. ఇవన్నీ అప్పట్లో సుహృద్భావ రాజకీయాలు, సజావుగా నడిచిన రోజుల్లో కనిపించిన దృశ్యాలు.
ఇప్పుడు కాలం మారింది. పైగా తరం కూడా మారింది. రాజకీయాలంటే ప్రత్యర్ధులన్న భావన స్థానంలో, శత్రువులన్న భావన స్థిరపడింది. విపక్షాలపై అడ్డగోలు కేసులు, మానసిక-ఆర్ధిక-రాజకీయ వేధింపులు, హత్యలు, కక్ష సాధింపు రాజకీయాలొచ్చేశాయి. చివరాఖరకు అవి తమను ప్రశ్నించే వారిని జైళ్లకు పంపించే అనాగరిక-అనారోగ్య-నియంత లక్షణాలకు చేరాయి. ఒకప్పుడు రేవంత్‌రెడ్డిని కేసీఆర్.. ఇప్పుడు చంద్రబాబునాయుడును జగన్మోహన్‌రెడ్డి జైళ్లకు పంపించిన ఉదంతాలు అందరికీ గుర్తే.
చివరకు రేవంత్‌రెడ్డి తన బిడ్డ పెళ్లిని, జైలు నుంచి వచ్చి చేయాల్సిన విషాద ఘటన. కుమార్తె పెళ్లిని బంధుమిత్రులంతా దగ్గరుండి జరిపించినా, తన బిడ్డ పెళ్లికి తాను స్వయంగా ఉండి ఏర్పాటుచూడాల్సిన ఒక తండ్రి, దానికి భిన్నంగా జైల్లో ఉండి అతిథిగా వచ్చి పోవడం, ఏ తండ్రినయినా మానసికంగా కుంగదీసేదే. అలాంటి మానసిక వేదన అనుభవించిన నేత రేవంత్, ఇప్పుడు తెలంగాణ సీఎం అయ్యారు. తనపై కేసు పెట్టిన అధికారే ఇప్పుడు తనకు సెల్యూట్ కొట్టి, మళ్లీ అదే శాఖకు అధిపతి అయిన వైచిత్రి.
ఇక చంద్రబాబు నాయుడు నేరాలకు సంబంధించి.. ఇప్పటివరకూ ఒక అరపేజీ ఆధారం కూడా సమర్పించని జగన్ సర్కారు, ఆయనను 53 రోజులు జైల్లో ఉంచింది. రాజకీయ నేతలకు జైళ్లు కొత్త కాక పోయినా, వయసు ఇబ్బంది కలిగించే అంశమే. పైగా తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా, ఏ సందర్భంలో జైలుకు వెళ్లని చంద్రబాబు చర్మవ్యాధులే జైలు జీవితంలో ఇబ్బంది పెట్టాయి. కఠోర యోగాతో మాత్రమే ఆయన ఆత్మస్థైర్యంతో నిలబడ్డారన్నది నిష్ఠుర నిజం. బాబు జైల్లో ఉన్నప్పుడు జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పరామర్శించి, రెండు పార్టీల పొత్తును జైలు బయట ఉన్న మీడియా సమక్షంలో ప్రకటించారు.
సీన్ కట్ చేస్తే..
హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో తుంటిమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న మాజీ సీఎం- బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఒకప్పుడు ఏపీలో తన ఓటమికి జగన్‌తో కలసి పనిచేసి, రిటర్ను గిఫ్టు ఇచ్చిన కేసీఆర్‌తో, బాబు ఇప్పటివరకూ ఏ సందర్భంలోనూ కలసిన దాఖలాలు లేవు. చంద్రబాబు బెయిల్‌పై హైదరాబాద్ వచ్చి చికిత్స తీసుకున్న సమయంలో, సీఎంగా ఉన్న కేసీఆర్ ఆయనను పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా, చంద్రబాబు వెళ్లి కే సీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు కూడా బాబుకు స్వాగతం పలికారు.
ఉభయకుశలోపరి కబుర్ల తర్వాత ‘‘మీకు విల్‌పవర్ ఉంది. మరేం ఫర్వాలేదు. కోలుకుని బయటకు వస్తారం’’టూ, బెడ్‌పైన ఉన్న కేసీఆర్‌కు ధైర్యం చెప్పారు. ఇది చంద్రబాబు సంస్కారం కావచ్చు.
తనను జైల్లో ఉంచి, కనీసం కూతురు పెళ్లిని కూడా దగ్గరుండి చేయించే అవకాశం లేకుండా చేసిన కేసీఆర్‌పై కోపాన్ని పక్కనపెట్టి.. సాటి మనిషిగా రేవంత్‌రెడ్డి చేసిన పరామర్శపై, రాజకీయ-సామాన్యవర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. కేసీఆర్ ఆర్యోగం కుదుటపడేందుకు అధికారులు అక్కడే ఉండి, తనకు నివేదికలివ్వాలని రేవంత్ ఆదేశించారు. ప్రభుత్వం అన్ని సహాయసహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇది వయసు చిన్నదైనా.. రాజకీయాలను పక్కనపెట్టి రేవంత్ హుందాతనంతో చూపిన పెద్ద మనసు.
అయితే అటు చంద్రబాబు-ఇటు రేవంత్‌రెడ్డి ఇద్దరూ కాలాన్ని మర్చిపోవడమే చిక్కులు తెచ్చింది. పదేళ్లు తెలంగాణ పాలకుడిగా ఉన్న కేసీఆర్‌ను పరామర్శించే సత్సంకల్పంతో వెళ్లిన రేవంత్‌రెడ్డిని, బీఆర్‌ఎస్ వర్గాలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. అటు ఎన్నికల ముందే కారెక్కిన పొన్నాల లక్ష్మయ్య చేసిన ఒక స్థాయి తక్కువ-నేలబారు-చౌకబారు వ్యాఖ్య.. ఇలాంటి పరామర్శల పర్యటనలకు వెళ్లాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించాయి.
‘‘దయచేసి నన్ను కనీసం ఏడాదైనా సీఎంగా ఉండనివ్వండి’’ అని రేవంత్‌రెడ్డి, మంచం మీద ఉన్న కేసీఆర్‌ను, చేతులెత్తి వేడుకున్నారని పొన్నాల చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. కేసీఆర్‌కు నమస్కరిస్తున్న రేవంత్ ఫొటోనుద్దేశించి పొన్నాల చేసిన ఈ వ్యాఖ్య.. చౌకబారు-నేలబారు-మరగుజ్జు రాజకీయాలకు పరాకాష్ట. నిజానికి రేవంత్‌రెడ్డి-చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించాల్సిన అవసరం లేదు.
సాటి మనిషిగా, ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు వారిని పలకరించి, నాలుగు సానుభూతి మాటలతో ధైర్యం చెబితే అది వారికో నైతికబలం. ఈ పరామర్శల అర్ధం అదే. కానీ రాజకీయాల్లో వికటకవిగా ప్రచారం ఉన్న పొన్నాల, ఆ పరామర్శకు వక్ర-వికృత-పైత్య-పైశాచిక భాష్యం ఇస్తే.. ఇకపై ఎవరైనా పరామర్శకు వెళ్లాలంటే పదిసార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో జరగబోయేది ఇదే.
నిజానికి రేవంత్‌రెడ్డి యశోదా ఆసుపత్రికి వెళ్లి, కేసీఆర్‌ను పరామర్శించడం కాంగ్రెస్‌లో మెజారిటీ వర్గాలకు నచ్చలేదు. కూతురి పెళ్లి కూడా చూడకుండా, నియంతగా జైల్లో పెట్టిన కేసీఆర్‌ను పరామర్శించటం ఏమిటన్నది బహుశా వారి అభ్యంతరానికి కారణం కావచ్చు. అటు చంద్రబాబుకూ టీడీపీలో దాదాపు ఇలాంటి పరిస్థితి. జగన్‌తో చేతులు కలిపి తన ఓటమికి కారణమైన, తెలంగాణలో టీడీపీ కనుమరుగుకు కారణమైన కేసీఆర్‌ను పరామర్శించడమే, వారి అభ్యంతరానికి కారణంగా కనిపిస్తుంది.
ఈ ఎన్నికల్లో కేవలం జగన్‌కు, కేసీఆర్ సహకరిస్తున్నారన్న ఏకైక కారణంతోనే సెటిలర్లు, కాంగ్రెస్‌ను గెలిపించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ ఇద్దరూ కేసీఆర్‌పై తమ వ్యక్తిగత కోపాన్ని పక్కనపెట్టి, సాటి మనిషిగా కష్టంలో ఉన్న కేసీఆర్‌ను పరామర్శించి, మర్చిపోయిన హుందాతన రాజకీయాలను మళ్లీ గుర్తు చేయడం గొప్ప విషయం. ఇది స్వాగతించదగ్గ పరిణామం కూడా.
కేసీఆర్ కూడా తనను నమ్ముకున్న వారిని, మిత్రులు ఆపదలో ఉన్నప్పుడు వారికి చేయూతనందించారు. ఎంతోమంది కవులు-కళాకారులు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, వారికి బోలెడంత ధనసాయం చేశారు. తన మిత్రులు చావు బతుకుల్లో ఉన్నప్పుడు స్వయంగా ఇంటికి-ఆసుపత్రికి వెళ్లి, వారి కుటుంబాలను ఆదుకున్న ఘటనలు కోకొల్లలు.
ఇలాంటి దాతృత్వ-మానవత్వ అంశాలలో కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. టీఆర్‌ఎస్ స్థాపనకు ఆర్ధికంగా సహకరించిన తన సహచరుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైద్య చికిత్స ఖర్చులన్నీ కేసీఆరే భరించారట. ఇలాంటి సుహృద్భావ పరామర్శల పర్వంలో.. పొన్నాల చేసిన నేలబారు వ్యాఖ్య, ఒక మాయనిమచ్చ అన్నది మనం మనషులం అన్నంత నిజం.!
1 COMMENTS