Suryaa.co.in

Telangana

యూపీఎఫ్ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ గా గట్టు రామచందర్ రావు

– పూలే విగ్రహం ఏర్పాటు డిమాండ్ ను ప్రభుత్వం గౌరవించాలి
– మాజీ స్పీకర్ మధుసూదన చారి

హైదరాబాద్: బీసీ హక్కుల సాధనకై ఉద్యమించడానికి ఏర్పడిన యూనైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గా గట్టు రామచందర్ రావు నియమితులయ్యారు. సోమవారం నాడు ఫ్రంట్ అడ్ హాక్ కమిటీని ఎన్నకుంది. ఫ్రంట్ కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి, కాసాని జ్ఞానేశ్వర్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదన చారి మాట్లాడుతూ….. జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. అసమానతలు, దుర్మార్గాలు ఉన్న సమాజాన్ని మార్చాలని, ఆయా జాతులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్న ఆలోచనతో సంస్కరణలకు పూనుకున్నారని వివరించారు. జ్ఞానమే సకల సమస్యలకు పరిష్కారమని గ్రహించిన పూలే ఆ దిశగా పనిచేశారని చెప్పారు. విద్య కోసం తన భార్య సావిత్రి పూలేతో కలిసి ఎంతో కృషి చేశారన్నారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను ప్రభుత్వం గౌరవించి ఆచరించాలని సూచించారు.

చట్టసభల్లో ఉన్నవారికి నిత్యం ఆరాద్యుడైన పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సమాజం నుంచి మంచి డిమాండ్ వస్తే పాలకులు స్వీకరించాలని, కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు కాబట్టి పోరాటబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

గట్టు రామచందర్ రావు మాట్లాడుతూ…. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, బలహీనవర్గాలను రాజకీయంగా అణచివేస్తున్నారని మండిపడ్డారు. సీఎం సొంత సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ పరిపాలన సాధ్యంకాదని సీఎం ప్రకటించడం దారుణమన్నారు. సన్న చిన్నకారు రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

బీసీలు ఐక్యపోరాటాలకు సిద్ధంకాకపోతే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తమకుతాము అణగదొక్కుకున్నట్లవుతుందని స్పష్టం చేశారు. బీసీ హక్కుల సాధన ఉద్యమంలో భాగంగా మొదటిగా అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ అంశాన్నికి అన్ని రాజకీయ పార్టీలు మద్ధతివ్వాలని, తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.

కాగా, ఫ్రంట్ కో-కన్వీనర్ గా తాడూరి శ్రీనివాస్, కాసాని వీరేశ్ ముదిరాజ్, ఆర్జేసీ కృష్ణ, రాజారాం యాదవ్, బొల్ల శివశంకర్, కోలా శ్రీనివాస్, ముప్పు భిక్షపతి, రాచమల్ల బాలకృష్ణ, రాగిపెల్లి రవీంద్ర చారి, ఆర్వీ మహేందర్ రావు, ప్రచాక కార్యదర్శిగా ఆలకుంట హరి, విద్యార్థి విభాగం కన్వీనర్ గా ఎల్చాల దత్తాత్రేయ, కోకన్వీనర్ గా అశోక్ యాదవ్, బొడ్డుపల్లి లింగం, మహిళా కన్వీనర్ లుగా గీతా గౌడ్, బాలమణెమ్మ, బొమ్మ ప్రవళిక నియమితులయ్యారు.

LEAVE A RESPONSE