Suryaa.co.in

Andhra Pradesh

తాలిబన్ పాలనలోకి ఆంధ్రప్రదేశ్

మీడియా గొంతు నొక్కుతున్న జగన్
– తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు

గతంలో ఏ రాష్ట్రంలోనైనా అరాచకాలు చోటు చేసుకుంటే బీహార్ పాలనతో పోల్చేవారు. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే తాలిబన్ పాలనను తలపిస్తోంది. తన భజనపరులను అందలాలు ఎక్కిస్తూ కూలి మీడియా, నీలి మీడియాలను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ పాలన అరాచకాలు, అక్రమాలను ప్రజలకు చాటి చెబుతున్న మీడియా సంస్థలపై, మీడియా ప్రతినిధులపై వరుస దాడులు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి అంతిమ ఘడియలు సమీపించాయా అనే అనుమానం కలుగుతోంది.

రెండు రోజుల కిందట అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్మోహన రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకల పైశాచిక దాడిపై ఒక పక్క ఆందోళనలు సాగుతుంటే ప్రభుత్వం నుండి స్పందన లేకపోగా.. నేడు కర్నూలులో ఈనాడు ఎడిషన్ భవనంపై వైసీపీ గూండాలు రాళ్ళ దాడికి దిగారు. ఇటీవలే రాజధాని అమరావతి సమీపంలో అమరావతి ఇసుక రీచ్ వద్ద ఫోటోలు తీస్తున్నారని అక్కడి ఈనాడు కంట్రిబ్యూటర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇదే నెలలో ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలోనూ వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.

ప్రజాస్వామ్య మూలస్థంభాలలో ఒకటైన మీడియా ఆంధ్రప్రదేశ్ లో ఆంక్షల గుప్పిట్లో విలవిలలాడుతోంది. నిజం గొంతు నొక్కి అబద్ధాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్ళేందుకు కూలి మీడియా, నీలి మీడియాలను ఏర్పాటు చేసుకున్న జగన్మోహన రెడ్డి వాస్తవాలను వెలుగులోకి తీసుకు వస్తున్న మీడియా సంస్థలపై ప్రతీకార దాడులకు దిగుతున్నాడు.

ఎన్నికలు ముందుకు వస్తున్న తరుణంలో తన వైఫల్యాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీ గురించి ప్రజలకు తెలియజెప్పే మీడియా సంస్థలపైన, మీడియా ప్రతినిధుల పైనా దాడులు చేయడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేయాలని జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ అరాచకాలు.

మీడియా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ఏకత్రాటిపైకి వచ్చి ఆంధ్రా తాలిబన్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాలి. లేకుంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కూడా సజావుగా సాగకుండా వైసీపీ కిరాతక మూకలు విశృంఖల చర్యలు కొనసాగే ప్రమాదం పొంచి ఉంది. ప్రజాస్వామ్యవాదులారా.. పారా హుషార్..

LEAVE A RESPONSE