రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య స్పష్టీకరణ

ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని, రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం మారగానే తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తీసుకొస్తామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2016 లో ఆప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) కార్యాలయానికి, దాని నివాస సముదాయాల కోసం 11 ఎకరాల భూములు కేటాయిస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్బిఐ కార్యాలయం కూడా అమరావతికి దూరం చేస్తున్నారని తెలిపారు. విశాఖ పట్నంలో 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భూములను ఆర్బీఐ కార్యాలయం కొరకు గుర్తించాలని జిల్లా కలెక్టర్ కు ఆర్థిక శాఖ లేఖ రాయటం ముఖ్యమంత్రి కుట్రలో భాగమే అన్నారు.

వైకాపా ప్రభుత్వం అమరావతి నుండి తెలుగు అకాడమీ, వక్స్ బోర్డు కార్యాలయం, కృష్ణా రివర్ బోర్డు వంటి కార్యాలయాలను ఇప్పటికే తరలించిందని తెలిపారు. రాజధానిలో 33 జీవోల ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగ, ప్రవేట్ రంగ సంస్థలకు, కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తే, వాటిని నిలిపివేసిందన్నారు. ఏ ఒక్క సంస్థను అమరావతి రాకుండా అడ్డుకున్నారన్నారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఎర్రుపాలెం నుంచి అమరావతి రైల్వే లైను కూడా రద్ధు చేశారని,80 శాతం 90 శాతం పూర్తి చేసిన భవన నిర్మాణాల పనులను కూడా పూర్తిగా అటకెక్కించారని అన్నారు.

వికేంద్రీకరణ పేరు చెప్పి, అమరావతి ప్రాంతాన్ని నాశనం చేశారని, అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో కార్యాలయాలను పెట్టి ముఖ్యమంత్రి ఏం చేస్తారని ప్రశ్నించారు.రాబోవు ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో వైకాపా ఒక్క సీటు గెలిచినా, అది అమరావతికి తీరని ద్రోహం చేసినట్లే అని హెచ్చరించారు. తెలుగు దేశం, జనసేన పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు తమ మానిఫెస్టోలలో కూడా తరలించిన కార్యాలయాల వెనక్కి తెచ్చే అంశాలను పొందుపర్చాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

Leave a Reply