ఇదేమి రాజ్యం ? ఇదెక్కడి చోద్యం ?

– ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?
– పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా?
– పట్టపగలే మీడియా సంస్థలు, ప్రతినిధులపై దాడులా?
– సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై హత్యాయత్నం
– వీడియోలలో కనిపిస్తున్న దుండగులు
-అయినా పూర్తి స్థాయి చర్యలు శూన్యం
-తాజాగా కర్నూలులో ఈనాడు ఆఫీసుపై వైసీపీ మూకలదాడి
-రాళ్లతో ఆఫీసుపై దాడి చేస్తున్నా కనిపించని పోలీసులు
– మీడియాపై బహిరంగదాడులు బెదిరింపులకేనా ?
– అమర్, కొమ్మినేని అండ్ కో నోరు తెరవరేం ?
-ఏపీలో మాయమవుతున్న ప్రజాస్వామ్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఉమ్మడి రాష్ట్రం.. అంతకుముందు మదరాసు రాష్ట్రంలో కూడా చూడని కిరాతకాలు, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగున్నరేళ్ల నుంచి చూడాల్సిరావడం మీడియా దౌర్భాగ్యం. ఉద్యోగాలు చేసుకునే మీడియా ప్రతినిధులు.. మీడియా సంస్థలపై అధికార పార్టీ గూండాలు పట్టపగలు, నట్టనడిరోడ్డున దాడులు చేసి, హత్యాయత్నాలకూ పాల్పడి వారిని మృత్యుశయ్యపై పంపించే ముందు చేస్తున్న.. ఆటవిక వికటాట్టహాసాలు పోలీసు వ్యవస్థకు వినిపించకపోవడం, కనిపించకపోవడమే దారుణం.

రాష్ట్రం విడిపోయిన తర్వాత.. అంతకుముందు.. పాలకులు-మీడియా మధ్య ఎన్ని ఘర్షణలున్నా, ఎవరి పరిథిలో వారు పోరాడేవారు. ఒక్కోసారి పాలకులు-మరోసారి మీడియా సంస్థలే సర్దుకుపోయి, సమన్వయం పాటించేవి. పాలకులు ప్రెస్మీట్లలో తమకు నచ్చని మీడియాపై సెటైర్లు వేస్తే, మీడియా కూడా తమ కాలమ్స్, పాలకులపై అంతకుమించిన సెటైర్లు వేసే సందర్భాలు చూశాం. పాలకులకు ఎంత వ్యతిరేకంగా రాసినా, ఖండన – వివరణలు పంపించేవే తప్ప.. జర్నలిస్టులు-మీడియా సంస్థలపై భౌతిక దాడులకు దిగిన సందర్భాలు లేవు.

అయితే ఎన్టీఆర్ హయాంలో జరిగిన పింగళి దశరథరామ్ హత్య.. వ్యక్తిత్వ హనన స్థాయి నుంచి, శృతిమించిన విమర్శల నేపథ్యంలో జరిగిందన్నది నాటి జర్నలిస్టుల ఉవాచ. ఏదైనా ‘తాను అనుకున్న’ నిజాలను నిర్భయంగా ప్రచురించిన పింగళి హత్యను, ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిందే. నాగరిక సమాజంలో ఉన్న వారెవరూ, ఇలాంటి అనాగరిక – కిరాతక చర్యలను
ఆమోదించరు.

ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో గత నాలుగున్నరేళ్ల నుంచి.. అలాంటి ఆటవిక-కిరాతక చర్యలు నిర్నిరోధంగా జరుగుతున్నా, పోలీసు వ్యవస్థ ప్రేక్షకపాత్ర పోషించడం వినా మరేమీ చేయలేక చేష్టలుడిగి చూస్తుండటం దారుణాతిదారుణం. చీరాలలో నాటి వైసీపీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయుల చేతిలో చావుదెబ్బలు తిన్న జర్నలిస్టుకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. తాజాగా అనంతపురం రాప్తాడులో.. సీఎం జగన్ సభకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్పై వైసీపీ మూకలు ఆటవికంగా దాడి చేయడంతో, అతను ఇప్పుడు చావుతో పోరాడాల్సిన విషాదం. అసలు మనం బతుకుతన్నది. నాగరిక సమాజంలోనేనా ?

ఇంతకూ ఆ ఫొటోగ్రాఫర్ చేసిన నేరం.. సీఎం సభలో వెనక్కివెళుతున్న జనాలు, ఖాళీ కుర్చీల ఫొటోలు తీయడమే. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాటల ప్రకారం.. వైసీపీ సభలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 నిషేధం. అయినా అక్కడికి వెళ్లడం నిస్సందేహంగా వారి తప్పే. పిలవని పేరంటానికి వెళ్లి, చావునోట్లోలపెట్టడం అవసరమా ?

ఆ ఘటనలో సదరు ఫొటో గ్రాఫర్కు జరగరానిది జరిగితే, ఆ మీడియా సంస్థలు ఉద్యోగులను ఆదుకుంటాయనుకోవడం భ్రమ. యాజమాన్యాల కోరికలు నెరవేర్చేందుకు ఉద్యోగులు, ఇలా సమిథలు కావాల్సిన పనిలేదని ఇన్ని అనుభవాల తర్వాతయినా గుర్తిస్తే మంచిది.

అనుమతిలేని సభకు వెళ్లడం అతగాడు చేసిన తప్పే అనుకుందాం. వృత్తిధర్మం కోసం చేసిన ఓవరాక్షనే అనుకుందాం. కానీ వారిపై అమానవీయంగా దాడిచేసిన వైసీపీ అధికార మీడియా చేస్తుందేమిటి? చంద్రబాబునాయుడు-పవన్ -లోకేష్ సభలపై వైసీపీ మీడియా చేస్తుందేమిటి ? వారిని నిషేధించినప్పటికీ, మిత్రపత్రిక సౌజన్యంతో ఫొటోలు వేసి, కథనాలు వండి వార్చడం లేదా ? వ్యక్తిగతంగా

వారిపైనా, వారి పార్టీ కార్యక్రమాలపై బురద చల్లడం లేదా ? వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లేదా ? చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో వైసీపీ మీడియా టీడీపీ-వారి నాయకులు-సభలపై, ఏ స్థాయిలో విజృంభించిందో మర్చిపోతే ఎలా ? వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ‘నారాసుర రక్తచరిత్ర’ అని, చంద్రబాబునాయుడే హత్య చేయించారంటూ రాసిన కథనాలు వండి వార్చలేదా ? అయితే అవన్నీ తప్పులేనని, ఇంటిదొంగలే వివేకాను కడతేర్చారని ఆయన బిడ్డనే చెప్పడాన్ని మర్చిపోతే ఎలా ?

ఇలాంటి కథనాలు రాసినప్పుడు, వైసీపీ మీడియా సంస్థలపై చిన్న రాయి కూడా పడలేదు కదా ? అందులో పనిచేసే జర్నలిస్టులకు రవంత గాయం కూడా కాలేదే ? మరి ఇప్పుడే ఎందుకీ అరాచకం ? ఇలాంటి ఆటవిక న్యాయంతో, అధికారపార్టీ మీడియాకు ఇచ్చే సంకేతాలేమిటి? కొడాలి నాని అనే ప్రజాస్వామ్య ప్రియుడు మరో అడుగు ముందుకేసి.. దాడి సమయంలో రామోజీరావు – రాధాకృష్ణ ఉంటే సున్నంలో ఎముకలు లేకుండా, కీళ్లు విరిచేవారంటూ చేసిన హెచ్చరిక మంగళగిరిలోని పోలీసు ప్రధానకార్యాలయాధిపతి చెవికి వినిపించకపోవడం వింత. నాని మాటలు టీవీల్లో వినిపించకపోవడం విడ్డూరం. ఆ వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న స్పృహ లేకపోవడమే ఆశ్చర్యం.

రాక్షసత్వాన్ని అడ్డుకుని, దుండగులను దండించాల్సిన ఖాకీలు కళ్లుమూసుకోవటం ఏమి న్యాయం ? ఇలాంటి ఘటనలు మరికొన్ని జరిగితే ఇక ప్రజలకు పోలీసు వ్యవస్థపై ఏం గౌరవం- నమ్మకం ఉంటుంది? వ్యవస్థపై నమ్మకంపోతే, ఇక పోలీసు వ్యవస్థ ఉనికి సంగతేమిటి? రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా, బహు భేషుగ్గా ఉన్నాయని చెప్పుకునే పోలీసు బాసులు.. రాప్తాడు- కర్నూలులో జరిగిన గూండాయిజానికి, ఏం సమాధానం చెబుతారన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. జవాబు చెప్పే ధైర్యం ఉందా ? పోలీసులే చెప్పాలి!

సహజంగా రాష్ట్రంలో ఎక్కడైనా ఒక తరహా నేరం జరిగితే, అలాంటి తరహా నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న చోట, కాపలా కట్టుదట్టం చేస్తారు. సర్వీసులో చేరే పోలీసులక, ట్రైనింగ్ కాలేజీలో చెప్పే ప్రాధమిక పాఠమిది. రాప్తాడులో ఫొటోగ్రాఫర్పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో నేరతీవ్రత-దుండగుల లక్ష్యాన్ని పోలీసులు పసిగట్టాలి. ఆ ప్రకారం అలాంటి ఘటనలు జరగకుండా, మీడియా సంస్థల కార్యాలయాల దగ్గర భధ్రత పెంచాలి. కనీసం నిఘా వేయాలి. ఇది కదా పోలీసింగ్ అంటే!

ప్తాడు ఘటన తర్వాత పోలీసులు ఆపని చేసి ఉంటే తాజాగా కర్నూలులో ఈనాడు ఆఫీసుపై, వైసీపీ మూకలు జెండాలు పట్టుకుని మరీ రాళ్ల దాడి చేసేవి కాదు. పట్టపగలే స్వైరవిహారం చేసేవే కాదు. ఎక్కడో బీహార్ మాదిరిగా అల్లరిమూకలు.. ఒక మీడియా సంస్థ కార్యాలయంపై నిర్భీతిగా సామూహిక దాడి చేస్తే, అక్కడ పోలీసులే కనిపించకపోవడం బాధ్యతారాహిత్యం ! దీనికి ఎవరు బాధ్యులన్నది ప్రశ్న.

రెండురోజుల వ్యవధిలో రెండుచోట్ల, మీడియాపై ‘అధికారపార్టీ ముద్దుబిడ్డలు’ రాళ్లు పట్టుకుని, స్వైరవిహారం చేస్తుంటే… పేరుగొప్ప వీరవిప్లవ జర్నలిస్టు నేత్రాశ్రీ దేవులపల్లి అమర్, మొన్నటి వరకూ ప్రెస్ అకాడెమీని వెలిగించి నీతిసూక్తి ముక్తావళి వినిపించే శ్రీమాన్ కొమ్మినేని శ్రీనివాస్ ఎక్కడ? దాడులపై వారి స్వరపేటిక మూగబోయిందేం? పదవులు తీసుకున్న మొహమాటం వారి పెదవులు మూయించాయా? ఇదే ఘటన వైసీపీ అధికార మీడియాపై జరిగితే.. ఈ
ఉత్తమ-నిఖార్సయిన- పరిశుద్ధ జర్నలిస్టుల నోళ్లు ఇలాగే మూతపడేవా ? ప్రజాస్వామ్యం.. జర్నలిస్టు హక్కులు.. గొడ్డలిపెట్టు.. అప్రజాస్వామ్యం.. నియంతలు వంటి.. మాదాల రంగారావు స్టైలు ‘ఎర్ర డైలాగు’లు రావూ! మరిప్పుడు ఆ స్వేచ్ఛ ఏ జమ్మిచెట్టుమీద ఎక్కించారన్నది జర్నలిస్టుల ప్రశ్న.

Leave a Reply