-రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు
– టిడిపి సీనియర్ నేతలు వర్ల రామయ్య, టిడి జనార్ధన్‌లతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
– చంద్రబాబుతోనే మాదిగలకు సామాజిక న్యాయం- వర్ల రామయ్య
– బ్రిటీషు పాలనను మించిపోయిన జగన్ రెడ్డి నియంత పాలన -టిడి జనార్ధన్
మంగళగిరి: 2000-04 మధ్య కాలంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎంతో మంది మాదిగ బిడ్డలు ఉద్యోగ అవకాశాలు పొందారని, మరలా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మాదిగలకు న్యాయం జరుగుతుందని మాదిగ సంఘాలు బేషరతుగా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపారు. శుక్రవారం పాలకొల్లులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును కలిసి మద్దతు తెలిపిన మాదిగ సంఘాల నాయకులు ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తెదేపాకు మద్దతుగా ఏకతాటిపైకి వచ్చిన మాదిగ సంఘాలన్నీ సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మరలా సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టిడి జనార్ధన్‌లు పాల్గొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల నేపధ్యంలో జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడెందుకు మాదిగ సమాజానికి చేరవేయాల్సిన ప్రచారాంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై లోతుగా చర్చించారు.
ఈ సమావేశంలో మాదిగ సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు మాదిగల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాదిగలు జరిగిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షస పరిపాలనకు చరమ గీతం పాడాలని, వైసీపీ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, అందుకు జగన్ రెడ్డి పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను మాదిగ ప్రజానీకానికి తెలియజేసి వారిని చైతన్యం చేస్తామని ముక్తకంఠంతో చెప్పారు. జగన్ రెడ్డి రాక్షస పాలనను తరిమికొట్టే మహాయజ్ఞంలో మేము సైతం భాగస్వాములు అవుతాం అంటూ స్వచ్ఛందంగా అనేక సంఘాలు ముందుకు వస్తున్నాయని, వారందరినీ కలుపుకుని జగన్ రెడ్డి పాలనకు సమాధికడుతామని అన్నారు.
సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ.. టిడిపికి సాంప్రదాయంగా మద్దతు ఇస్తున్న సామాజిక వర్గాలలో మాదిగలు ప్రధానమైన వర్గమన్నారు. చంద్రబాబు నాయుడు ఈసారి సీట్ల కేటాయింపులో సైతం దళితులలోని రెండు ప్రధాన వర్గాలైన మాలలు, మాదిగలకు సమ న్యాయం చేశారని..మాదిగలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ది తెలుగుదేశంతోనే సాధ్యం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడు అనేక రాజ్యాంగబద్ద పదవులను మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని భరోసానిచ్చారు.
టిడి జనార్ధన్ మాట్లాడుతూ..జగన్ రెడ్డి నిరంకుశ పాలన బ్రిటీష్ వలస పాలనను మించిపోయిందని, దళితులకు రాజ్యాంగబద్దంగా అమలు కావాల్సిన సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని విమర్శించారు. జగన్ రెడ్డి దళితులకు నాశిరకం మధ్యం పోసి వేలాది కోట్లు దోపిడీకి పాల్పడటమే కాకుండా 30 లక్షల మందిని అనారోగ్యం పాలు చేశాడన్నారు. వైన్, మైన్, శాండ్, ల్యాండ్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ రెడ్డి నియంతలా మారి సామాన్యుడి వాక్ స్వాతంత్ర్యపు హక్కును సైతం హరించాడని ఘాటుగా విమర్శించారు. కూర్చుని పాలన సాగించే సెక్రటరియేట్‌ను సైతం తాకట్టు పెట్టిన దౌర్బాగ్యపు ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు.
దళితులకు రాజ్యాంగబద్ద హక్కులు, మాదిగలకు సామాజిక న్యాయం జరగాలంటే అందరం కలిసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అధిక ధరలతో సామాన్యుడి నడ్డివిరిచిన జగన్ రెడ్డి తన ఆస్తులను మాత్రం దివాలా స్థాయి నుంచి లక్షలాధి కోట్లకు పెంచుకున్నారన్నారు. జగన్ రెడ్డికి ఇల్లు లేని నగరం దేశంలో లేదని, వివిధ నగరాల్లో వందలాది ఎకరాల్లో ఇళ్లులు నిర్మించుకున్న జగన్ రెడ్డి సామన్యుడికి మాత్రం సెంటు స్థలం చాలన్నట్లు వివక్షపూరితంగా వ్యవహరించాడన్నారు.
కార్యక్రమంలో మాదిగ సంఘాల నాయకులు ఏపీఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరిపోగు వెంకటేశ్వర్ రావు మాదిగ, ప్రకాష్ మాదిగ, కొదమల జెంజిమెన్ మాదిగ, పొన్నికంటి రమేష్ మాదిగ, వేజెండ్ల సుబ్బారావు మాదిగ, కలపల సురేష్ మాదిగ, తెదేపా అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షలు కోడూరి అఖిల్, గిరిజన నాయకులు అనుముల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.