Suryaa.co.in

Editorial

‘ఛీ’రల మాటేంటి? ఛండాలం?!

– షర్మిల పసుపుచీరపై వివాదమవుతున్న జగన్ వ్యాఖ్యలు
– పసుపు చీరపై జగన్ వ్యాఖ్యలతో మండిపడుతున్న మహిళలు
– భారతికి పసుపు చీరలు, డ్రెస్సులు లేవా అని బీటెక్ రవి ప్రశ్న
– పసుపు చీర కట్టుకున్న భారతి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్
– సాక్షి లోగో వెనుక ఉన్నది పసుపు కాదా అన్న షర్మిల
– వైఎస్ దగ్గురుండి పసుపు కలర్ సూచించారని గుర్తు చేసిన షర్మిల
– జగనన్న ఇంత దిగజారిపోతున్నారా అని ఆవేదన
– జగన్‌కు స్పీచ్ రాస్తున్న వారిపై వైసీపీ అభ్యర్ధుల ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్నది పాత సామెత. ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన చెల్లి షర్మిల టీడీపీతో చేతులుకలిపిందని చెప్పేందుకు వాడుతున్న పదజాలం కూడా అలాగే కనిపిస్తోంది. సొంత చెల్లి చీరలపై జగనన్న చేసిన వ్యాఖ్య బూమెరాంగవడంతో, వైసీపీ అభ్యర్ధులు తలపట్టుకుంటున్నారు. ‘‘అసలు జగన్ గారికి ప్రసంగాలు రాస్తున్న వారి మెదడు మోకాల్లో ఉందా? అరికాలిలో ఉందా? అసలు వాళ్లకు మెదడు ఉందా? ఉంటే ఎన్నికల సమయంలో ఇలా స్థాయి తక్కువ పదాలు సీఎం గారితో మాట్లాడించి మా కొంప ముంచుతారా’’ అని వైసీపీ అభ్యర్ధులు మండిపడుతున్నారు.

షర్మిల కొడుకు, జగన్ మేనల్లుడు రాజారెడ్డి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు తల్లి షర్మిలారెడ్డి, తన భర్త బ్రదర్ అనిల్‌తో చాలామందని స్వయంగా కలిశారు. పెళ్లికి రావాలని ఆహ్వానించారు. తన పార్టీ కాని వారిని కూడా ఆమె పెళ్లికార్డులిచ్చి పెళ్లికి ఆహ్వానించారు. తన తండ్రితో కలసి పనిచేసిన వారినీ కలిసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అందులో భాగంగానే టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడును కూడా ఆయన ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చారు.

వైఎస్-బాబు మధ్య రాజకీయంగా ఎంత వైరం ఉన్నప్పటికీ, వారిద్దరూ గతంలో ప్రాణస్నేహితులు. వార్దిదరి బంధం గురించి, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్.. ‘అపూర్వసహోదరుల’ని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. అది వేరే కథ. అయితే షర్మిల టీడీపీ అధినేత చంద్రబబును కలిసిన సమయంలో, పసుపు చీర క ట్టుకున్నారు. సహజంగా మహిళలు శుభకార్యాల సందర్భంలో, పుసుపు చీరలే ఎక్కువ వాడతారన్న విషయం బహుశా, సీఎం జగన్‌కు ప్రసంగపాఠాలు రాసిచ్చే వారికి తెలియదన్నది కాంగ్రెస్ నేతల వ్యంగ్యోక్తి.

తాజాగా సీఎం జగన్ సొంత జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో.. తన సొంత చెల్లి షర్మిల కట్టుకున్న పసుపు చీర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా, మహిళల ఆగ్రహానికి గురయ్యారు. ‘పచ్చచీర కట్టుకుని తన తండ్రిని వ్యతిరేకించిన వారి వద్దకు వెళ్లి మోకరిల్లి, వారిచ్చిన స్క్రిప్టును మక్కీకి మక్కీ

చదివే వీరా వైఎస్ వారసులు’’? అని ప్రశ్నించిన జగన్ తీరు, మహిళాలోకానికి మింగుడుపడటం లేదు. పసుపుచీరపై జగన్ వ్యాఖ్యలు మహిళల ఓట్లకు గండికొట్టేవేనని వైసీపీ అభ్యర్ధులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. ఇది హిందువులను ఒక్కరినే కాదు. యావత్ మహిళాలోకాన్ని అవమానించే వ్యాఖ్య అన్న ఆవేదన సర్వత్రా వినిపిస్తోంది.

అయితే దీనిపై షర్మిల.. తన జగనన్నకు ఘాటైన జవాబివ్వడంతో, వైసీపీ తెల్లముఖం వేయాల్సివచ్చింది. ‘‘ సాక్షి పత్రిక పేరు చుట్టూ పసుపు ఉంటుందని జగనన్న మర్చిపోయినట్లున్నారు. దానిని స్వయంగా నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డిగారే సూచించారు. పసుపు శుభసూచికం. మనం కూరల్లో కూడా పసుపు వేసుకుంటాం. నేను పసుపుచీర కట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి, ఆయనకు మోకరిల్లానట. వీళ్లకు

ఏమైనా బుద్ధి ఉందా? వేలమంది ఎదుట సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడతారా? పసుపు ఏమైనా టీడీపీ పేటెంటా? నేను కాదు.. మోదీకి, బీజేపీకి మోకరిల్లింది నువ్వు. బీజేపీ స్క్రిప్టు చదువుతున్నది నవ్వు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చూసి మక్కీకి మక్కీ చదివేది నువ్వు. నేను కాదు. సొంత చెల్లి కట్టుకునే చీరలపైనా మాట్లాడుతున్నావంటే ఎంత దిగజారుతున్నావో నీకు అర్ధమవుతోందా’’ అని షర్మిల వాతలు పెట్టిన వీడియో, సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. షర్మిల ఎదురుదాడిపై వైసీపీ వ్యూహబృందం, మాటలేక మౌనంగా ఉండటం ప్రస్తావనార్హం.

అటు సోషల్‌మీడియాలో కూడా జగన్ ప్రస్తావించిన, పసుపు చీర హాట్‌టాపిక్‌గా మారింది. ఆ సందర్భంగా జగన్-భారతీరెడ్డి కలసి ఉన్న ఫొటోలు ఉత్సాహవంతులు విడుదల చేశారు. అందులో భారతీరెడ్డి పసుపు చీర-డ్రెసు వేసుకున్న ఫొటోలు ఉండటంతో, వైసీపీ ఆత్మరక్షణలో పడింది. జగన్‌పై పోటీ చేస్తున్న బీటెక్ రవి కూడా, ‘జగన్.. ఒకసారి భారతీరెడ్డి రూములో ఆమెకు ఎన్ని పసుపు చీరలు, ఎన్ని పసుపు డ్రెస్సులున్నాయో ఓసారి చూడు’’ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇవన్నీ సోషల్‌మీడియాకు మహా మేతగా మారాయి.

ఏదేమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తన సొంత చెల్లి కట్టుకునే చీర రంగుపై, వేలమందిలో బహిరంగంగా మాట్లాడటాన్ని మహిళాసమాజం అంగీకరించడం లేదు. ఇది సీఎం స్థాయిని తగ్గించుకోవడమేనన్న వ్యాఖ్యలు అటు వైసీపీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. వైసీపీ మహిళా నేతలు సైతం ఇలాంటి వ్యాఖ్యలు, తమకే సిగ్గేస్తున్నాయనడం పరిశీలిస్తే.. జగన్ తన చెల్లి కట్టుకున్న చీరపై చేసిన వ్యాఖ్యలు, క్షేత్రస్థాయిలో ఎంత వ్యతిరేకపవనాలు వీస్తున్నాయో స్పష్టమవుతోంది.

అయితే ఇదంతా తమ అధినేతను మెప్పించేందుకు, ఆయనకు ప్రసంగాలు రాస్తున్న మేధావుల ఓవర్‌యాక్షనేనని వైసీపీ సీనియర్లు మండిపడుతున్నారు. ‘‘ప్రసంగాలు రాసే వారికి మహిళల మనోభావాలు తెలిసట్లు లేవు. సున్నితమైన అంశాలు ఎన్నికల సమయంలో ఎంత కొంపముంచుతాయో వారికి అర్ధంకాకపోవడం, అలాంటి వారంతా జగన్‌గారి దగ్గర ఉండటం మా ఖర్మ’ అని ఓ మంత్రి వాపోయారు.

LEAVE A RESPONSE