ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, తన వ్యూహాత్మక అడుగులతో ఇప్పుడు దేశవ్యాప్తంగా పారిశ్రామిక వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
బెంగళూరుకు మకుటాయమానంగా భావించే ఏరోస్పేస్ రంగాన్ని తన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కర్ణాటకకు సవాలు విసురుతూ, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల బాటలు వేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కథంతా కర్ణాటకలో మొదలైంది. బెంగళూరు శివార్లలో, దేవనహళ్లి తాలూకాలో భారీ ఏరోస్పేస్ పార్కు కోసం 1,777 ఎకరాల సారవంతమైన భూమిని సేకరించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. కానీ, ఈ నిర్ణయం స్థానిక రైతుల ఆగ్రహానికి కారణమైంది.
“మా భూమి మాకు జీవనాధారం, దాన్ని లాక్కోవద్దు!” అంటూ రైతులు ఉదృతంగా నిరసనలు తెలిపారు. వారి పోరాటం ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం రైతుల ఆందోళనల ముందు వెనక్కి తగ్గక తప్పలేదు – భూసేకరణ ప్రణాళికను ఉపసంహరించుకుంది. ఇది రైతులకు పెద్ద విజయం, కానీ కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధికి తాత్కాలికంగా ఒక ఎదురుదెబ్బ.
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నారా లోకేష్ తక్షణం స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఒక సువర్ణావకాశంగా భావించారు. కర్ణాటకలో భూములు కోల్పోయిన ఆ ఏరోస్పేస్ కంపెనీలను, “రండి! మా ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా రెడ్ కార్పెట్ పరుస్తాం!” అంటూ బహిరంగంగా ఆహ్వానించారు.
ఆయన కేవలం మాటలతో సరిపెట్టలేదు. “మాకు 8,000 ఎకరాలకు పైగా సిద్ధంగా ఉన్న భూములున్నాయి, పైగా ఇవి బెంగళూరుకు చాలా దగ్గరగా ఉన్నాయి. మా ఏరోస్పేస్ విధానం దేశంలోనే అత్యుత్తమం. అద్భుతమైన ప్రోత్సాహకాలు అందిస్తాం.
ముఖ్యంగా, ప్రధాన కంపెనీల కోసం కేవలం 99 పైసలకే భూమిని కూడా కేటాయించడానికి సిద్ధం!” అంటూ బంపర్ ఆఫర్లు గుప్పించారు. ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పాలసీ’తో పాటు, ‘ఎలక్ట్రానిక్స్ పాలసీ’ ద్వారా అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు.
లోకేష్ చేసిన ఈ ‘దూకుడు’ ప్రకటనలు సహజంగానే కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కర్ణాటక మంత్రులు తమ రాష్ట్ర గొప్పదనాన్ని, ఇక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులను, ఇప్పటికే ఉన్న బలమైన పారిశ్రామిక వాతావరణాన్ని గుర్తు చేశారు. పెట్టుబడిదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేశారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణలో ఒక హోరాహోరీ ‘యుద్ధం’గా మారింది.
కర్ణాటకలో రైతుల విజయం, భూసేకరణ రద్దు – లోకేష్‌కు ఒక గొప్ప ‘ఓపెనింగ్’ ఇచ్చింది. దీన్ని అవకాశంగా మార్చుకుంటూ, ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా చూపించేందుకు లోకేష్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
ఇది కేవలం భూమి కేటాయింపు సమస్య కాదు, ఇది రాష్ట్రాల మధ్య అభివృద్ధి నమూనాలలో ఉన్న భిన్నత్వానికి, రైతుల హక్కులు, పారిశ్రామిక ప్రగతి మధ్య సమతుల్యతకు, అలాగే రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం జరుగుతున్న తీవ్రమైన పోటీకి నిదర్శనం.
ఈ రాజకీయ ‘అగ్ని’ జ్వాలలు ఏపీకి నిజంగానే విజయాన్ని అందిస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ లోకేశ్ సమయస్ఫూర్తి మీద జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది.