– నేడు చదలవాడ ఉమేష్ చంద్ర ఐపిఎస్ 26వ వర్ధంతి
– ఫ్యాక్షనిజంను ఉక్కు పాదంతో అణిచివేసిన పోలీస్ అధికారి
– నక్సలిజంను నామరూపాలు లేకుండా చేసేందుకు బీజం
– ఆయుధం లేకున్నా సాయుధులను తరిమిన ధైర్యం ఆయనది
పోలీస్ యూనిఫాం అంటే కేవలం అధికారం కాదు, ప్రజల కోసం ప్రాణం అర్పించటం అని నిరూపించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. సమైక్య ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో చదలవాడ ఉమేశ్ చంద్ర ఐపీఎస్ అంటే మరుపు ఎరుగని పేరు, ఇది ఒక అమర వీరుని గాధ.
కేవలం ముప్పై మూడు ఏళ్ల చిన్న వయస్సులోనే ప్రజల భద్రత కోసం ప్రాణాలు ధారపోసిన మహా మనిషి. పోలీస్ యూనిఫాం ధరించటం అంటే గొప్ప బాధ్యత అన్న విషయాన్ని తన జీవితం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. నేరస్ధులను ఎదుర్కోవడంలో ఆయన చూపిన కఠినత్వం ఒక కోణం అయితే, ప్రజల పట్ల చూపిన మమకారం, మానవత్వం మరో కోణం.
ఇలా భిన్న పార్శ్వాలకు న్యాయం చేయగలిగిన సమర్ధత ఆయనకే సొంతం. కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ప్రదర్శించిన అచంచల ధైర్యం ఉమేష్ చంద్రను ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. పోలీస్ కు పర్యాయ పదమే ఉమేష్ చంద్ర అన్న తీరుగా జన జాగృతమై నిలిచారు.
ఉమేశ్ చంద్ర ప్రస్థానం ప్రజలు మరువలేనిది. కడప జిల్లా ఎస్పీగా పనిచేసిన కాలంలో ఆయన చూపిన ధైర్యం నేటికీ జ్ఞాపకాల్లో నిలిచి ఉంది. అక్కడి ప్రజలు ఇప్పటికీ నాటి రోజులను కధలుగా చెప్పుకుంటుంటారు. నక్సలైట్లను ఎదుర్కోవడంలో ఉమేష్ చంద్ర చూపిన కఠిన వైఖరి ఆ తరువాత ఆయనను బలి కోరింది. అయితే, సాధారణ ప్రజలు, బాధితుల పట్ల చూపిన సానుభూతి ఆయనను ప్రజల మనిషిగా మార్చింది.
ప్రజల సమస్యలు స్వయంగా వినటం, వారిని నేర ప్రవృత్తి నుంచి కాపాడటం, పోలీస్ స్టేషన్లను ప్రజలకు అండదండలు అందించే సేవా కేంద్రాలుగా మార్చడం ఇవన్ని ఆయన అడుగు జాడలే. కడపలో ఆయనను పబ్లిక్ పోలీస్ (ప్రజల పోలీస్)గా పిలిచేవారు. ఉమేష్ చంద్ర కడప ఎస్ పిగా ఉన్న సమయంలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. వాటిని తనదైన శైలిలో నిర్వహించి వేలాది ప్రజలు స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు.
ఎంతలా అంటే ఉమేష్ చంద్ర లాంటి ఒక్క అధికారి ఉంటే చాలు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నంతగా. 1991 బ్యాచ్ ఐపిఎస్ అధికారిగా ఎంపికైన ఉమేష్ చంద్ర 1999లో మృతి చెందారు. మొత్తంగా ఆయన పదవీకాలం ఏడెనిమిది సంవత్సరాలు మాత్రమే. కానీ ప్రతి పోస్టింగ్ సంచలనమే. కులం, మతం, ప్రాంతం తేడా లేదు ఆయన కళ్లముందున్నవి రెండే అంశాలు. సదరు వ్యక్తి దోషా, నిర్దోషా అన్నది మాత్రమే. నేరస్తుడయితే అణిచివేతే. నిరపరాధిగా భావిస్తే తానే అండ దండ.
అమర వీరుడి ఆఖరి క్షణాలు
1999 సెప్టెంబర్ 4న హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ సెంటర్ వద్ద నక్సలైట్లు జరిపిన దారుణ దాడిలో ఉమేశ్ చంద్ర వీర మరణం పొందారు. ఆయన మృతి ఈ దేశ పోలీసు చరిత్రలోనే అజరామర వీరగాథగా నిలిచింది. ఆ భయానక ఉదయం ఉమేశ్ చంద్ర పై నక్సలైట్లు దాడి చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో గన్‌మాన్ రామచంద్ర రెడ్డి, డ్రైవర్ సత్యనారాయణలతో పాటు ఆయన సైతం బలయ్యారు. కానీ చివరి క్షణం వరకూ ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. చావుకు ఎదురు వెళ్లారు.
తుపాకీ లేకపోయినా దుండగులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఆయుధం లేనప్పటికీ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొద్ది నిమిషాల పాటు సాయుధ నక్సలైట్లకు ఎదురు నిలిచారు. వారిని పరుగులు పెట్టించారు. ఉమేష్ చంద్ర వద్ద ఆయుధం లేదని గమనించిన దుండగులు కురిపించిన బుల్లెట్లు ఆయన శరీరాన్ని ఛిద్రం చేశాయి.
ఆయన రక్తం నేలపై చిందింది. ఆయన పేరు ఆకాశంలో శాశ్వత జ్యోతి అయింది. ఆయన వీరత్వం గగనాన్నంటింది. అకస్మాత్తుగా ఎదురైన ప్రమాదంలోనూ ఆయన చూపిన ధైర్యం, ఆ ఉద్విగ్న క్షణాలను వీరోచిత గాథగా మార్చింది. నిజానికి తన ప్రాణం కాపాడుకోవాలనుకుని ఉంటే సాధ్యమయ్యేదేమో. కానీ ఆయన ఆ పని చేయలేదు. మృత్యువుకు ఎదురు వెళ్లారు. ప్రాణం తృణ ప్రాయం అన్న తీరుగా పోరాడారు. కొన్ని నిమిషాల పాటైనా ప్రత్యర్ధులకు భయం చూపారు. వారిని పరుగులు పెట్టించారు. చివరకు విధి ఆడిన వింత నాటకంలో నేలకొరిగారు.
కాలేజీలో గోల్డ్ మెడల్ – విశ్వవిద్యాలయంలో టాపర్
1966 మార్చి 29న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో జన్మించిన ఉమేశ్ చంద్ర చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సత్యనిష్ఠతో ముందుకు సాగారు. హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదువుకుని, నిజాం కాలేజీలో తన మేధస్సుతో ఎకానమిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. విద్యలోనే కాదు, సమాజం కోసం ఏదో చేయాలనే తపనలోనూ ముందుండే ఆయన 1991లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికై, దేశ సేవకు అంకితమయ్యారు.
ఐపిఎస్ శిక్షణ కాలం మొదలు ఎఐజి (క్రీడలు, సంక్షేమం) వరకు
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ శిక్షణ కాలంలోనే ఆయన కఠిన శ్రమ, సాహసస్వభావం సహచర అధికారులందరినీ ఆకట్టుకుంది. శిక్షణ పొందుతున్న సమయంలో ఉమేష్ చంద్ర వేగం నాటి బోధకులను ఆశ్చర్య పరిచేది. వరంగల్‌లో ఏఎస్పీ గా విధులు నిర్వహించిన సమయంలో నక్సలైట్ల ఉనికిని సవాలుగా మారారు. వారికి సింహస్వప్నమే అయ్యారు.
పులివెందుల, కడప జిల్లాల్లో ఏఎస్పీ , ఎస్పీగా పనిచేసి ఫ్యాక్షన్ కలహాలను అణచివేసి కడప సింహంగా పేరు గడించారు. ఉమేష్ చంద్ర పేరు చెబితే నేరస్థులకు కంటి మీద కునుకు ఉండేది కాదంటే అతి శయోక్తి కాదు. కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు నక్సలైట్లను ఏరివేసి సమాజంలో శాంతి వాతావరణాన్ని నెలకొల్పారు. చివరగా హైదరాబాదులో ఏఐజీ (క్రీడలు, సంక్షేమం)గా పనిచేశారు. ఎక్కడ పనిచేసినా వినిపించే ఒకే ఒక్క మాట – “ఉమేశ్ చంద్ర అంటే ధైర్యానికి ప్రతీక”.
ప్రజల హృదయాల్లో నిలిచిన అధికారి
ఉమేశ్ చంద్ర ప్రజల పట్ల మమకారం కలిగిన అరుదైన పోలీస్ అధికారి. పోలీస్ అంటే భయపడే పాత భావనను చెరిపేసే ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు, పోలీస్ అంటే ఒక రక్షణ వలయం అని ప్రజల మనసులో నమ్మకం నాటారు. చట్టం పెద్దల చుట్టం అన్న నానుడికి చరమగీతం పాడుతూ, స్వయంగా పేదవారి ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు వినేవారు. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలవడం, నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా, నిరపరాధులపై పూర్తి సానుభూతితో వ్యవహరించడం ఉమేష్ చంద్ర ప్రత్యేకతలు. ఆయనతో అనుబంధం ఉన్న సాధారణ ప్రజలు, ఎవరికి వారు ఉమేశ్ చంద్రను తమ సొంత మనిషి గా, కుటుంబ సభ్యునిగా గర్వంగా చెప్పుకునే వారు.
బదిలీ వద్దంటూ బారులు తీరిన ప్రజలు
కడప ఎస్ పిగా పనిచేస్తున్న ఉమేష్ చంద్రను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీ వద్దంటూ తమకు ఆయనే ఎస్ పిగా కావాలంటూ జనం రోడ్డెక్కారు. కన్నీరు మున్నీరయ్యారు. సగటు ప్రజల మనస్సుకు దగ్గరైన ఓ అధికారికి ప్రజలిచ్చే వీడ్కోలు ఇంతలా ఉంటుందా అని రాష్ట్రం ఆశ్చర్యపోయింది. ప్రతి ఒక్కరూ తమ సొంత కుటుంబ సభ్యునికే వీడ్కోలు పలుకుతున్న చందంగా బాధాతప్త హృదయాలతో తల్లడిల్లి పోయారు.
చివరి సారిగా కడపను వీడుతూ అయన ప్రయాణిస్తున్న వాహనం వెంబడి పరుగులు తీశారు. అడ్డు పడ్డారు. కాని వారి చేతిలో ఏమీ లేదు. అవి ప్రభుత్వ ఆదేశాలు. చేసేది లేక అయిష్టంగానే చేతులు ఊపారు. అంతిమంగా చప్పట్లు చరిచారు. వాహనంపై పూల జల్లు కురిపించారు. బాణసంచా కాల్చారు. మళ్లీ తమ జిల్లాకే తిరిగి రావాలని ఆశీర్వదించారు. కానీ ఎవ్వరి ఊహకు అందని రీతిలో ఆయన అచిర కాలంలోనే తిరిగిరాని లోకాలకు చేరువయ్యారు.
మృతి అందరిది.. స్మృతి కొందరిదే
చరిత్రలో చెరిగిపోని పేరు ఉమేశ్ చంద్ర. మరణం తర్వాత ఆయనను గౌరవిస్తూ ప్రజలు విగ్రహాలు ప్రతిష్టించారు. ఎక్కడైతే చదలవాడ అసువులు బాశారో అదే ఎస్. ఆర్. నగర్ సెంటర్లో 2000 సంవత్సరంలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ నివాళులు అర్పించడం సంప్రదాయంగా మారింది.
ఉమేష్ చంద్ర జీవిత చరిత్ర యువ పోలీస్ అధికారులకు పాఠ్యాంశంగా బోధించబడుతోంది. పోలీస్ శిక్షణా శిబిరాల్లో ఆయన గాథ నిజాయుతీని పురి గొలుపుతుంది. కడప, హైదరాబాద్, తెనాలిలో ఆయన పేరుతో కూడిన రహదారులు, విగ్రహాలు ప్రజలకు స్ఫూర్తి నింపుతున్నాయి. ప్రజాసేవ, కర్తవ్యనిబద్ధతతో కూడిన ఆయన కథ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఉమేశ్ చంద్ర జీవితం ఒక పోలీస్ అధికారి డైరీ కాదు, అది ఒక యుగం. చిన్న వయస్సులోనే ఆయన దివికేగినా ప్రతి తెలుగు వాడి గుండె లోనూ శాశ్వతంగా ఉన్నారు. న్యాయమైన పాలన అంటే కేవలం చట్టం అమలు చేయడమే కాదు, ప్రజల భద్రత కోసం ప్రాణాలనైనా త్యజించే తపన అని నిరూపించారు. ఆయన మరణం ఒక విషాదం, ఆయన స్ఫూర్తి ఒక శాశ్వత దీప్తి.
నేటి తరం పోలీస్ అధికారులు, యువత, భావి నాయకులు, ప్రజలందరూ ఆయన జీవితం నుంచి నేర్చుకోవలసిన పాఠం ఇది. నిజాయితీతో నిలిచినవారు మరణించినా, వారి గొప్పతనం శతాబ్దాల పాటు ఆచంద్రార్కం నిలిచే ఉంటుంది. ప్రజాసేవే పరమ ధర్మం.
రవి కుమార్ బొప్పన
boppanaravikumar@gmail.com
9491112555
(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాచార విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గౌరవ గవర్నర్‌కు ప్రధాన ప్రజా సంబంధాల అధికారిగా, శాసనసభలో గౌరవ స్పీకర్‌కు మీడియా లైజన్ అధికారిగా వ్యవహరించారు.)