(ఇంద్రాణి)
శబరిమల ఆలయంలోకి యుక్తవయస్సు నుండి ఒక వయస్సు వచ్చే వరకు ఉన్న మహిళల ప్రవేశం నిషిద్ధం. దానిని మహిళల పట్ల వివక్ష అని కొందరంటారు, మరికొందరు మతాచారం అంటారు. ముస్లిం మతంలో ఉండే ఆంక్షలు వారికి ఉన్నాయి. ప్రతి మతంలోనూ కట్టుబాట్లు, నిబంధనలు మహిళల చుట్టూనే తిరుగుతాయి. మతాచారాల విషయాలను ఆధారం చేసుకుని వచ్చిన సాంఘిక కట్టుబాట్లు కూడా మహిళలకే వర్తిస్తాయి.
సమాజంలో స్త్రీ పరిస్థితి ఏమిటి అనేది పక్కన పెడితే, కుటుంబాలలో స్త్రీల పరిస్థితి అద్భుతం అనుకునే స్థాయిలో లేదు. ఒక్క భారతదేశంలో మహిళల పరిస్థితి మాత్రమే ఇలా ఉందనుకోవడానికి లేదు, ఈ వివక్ష ప్రపంచమంతటా ఉన్నది.మన దేశంలో మాత్రం స్త్రీని పూజించాలి అని ఒక గౌరవాన్ని ఆపాదిస్తారు. పూజించే దేవుడికి పెట్టిన నైవేద్యం మనమే తిన్నట్లు, పూజించే స్త్రీల హక్కులను సమాజమే తినేస్తుంది. సమాజం మారిపోయింది. స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఇప్పటి స్త్రీలకు ధారాళమైన స్వేచ్ఛ ఉంది అని అంటారు.
నిజమే స్వేచ్ఛ ఉంది. అది ఎంతవరకు అంటే కుటుంబంలోని పురుషులు ఒప్పుకున్నంత వరకు. కుటుంబాలలో స్త్రీలకు ఉండే స్వేచ్ఛ ఆ కుటుంబంలోని పురుషుల ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుంది. తండ్రికీ, అన్నదమ్ములకు ఉండే ప్రాధాన్యత తల్లికి, అక్కాచెల్లెళ్లకు ఉండదు. అది ఆస్తి సంబంధిత విషయమే కానవసరం లేదు, సాధారణ విషయమే కావచ్చు. అటువంటి విషయాలు అనేకం ఉంటాయి. తల్లి తన కష్టసుఖాలను కొద్దిగా పెద్దయిన ఆడపిల్లలతో పంచుకుంటుంది. అలా ఇటువంటి పరిస్థితుల్లో పెరిగే పిల్లలు వ్యవస్థీకృతంగా అలాగే పెరుగుతారు.
తల్లి మరణించినప్పుడు ఆస్తిపాస్తుల విషయాలపైన వివాదాలు చర్చకు రావు. కానీ తండ్రి మరణించగానే ఆస్తి పంపకాల చర్చ మొదలవుతుంది. అప్పటి నుండి తల్లి సెకండ్ క్లాస్ సిటిజన్ అయిపోతుంది. ఆమె చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ముందే సాంఘిక దురాచారాలకు బలి అవుతారు స్త్రీలు, దానికి తోడు ఆస్తి వివాదాలు. ఎంత చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్న మహిళలకైనా ఇదే పరిస్థితి.
ఒక ఉదంతంలో తండ్రి మరణించిన తరువాత తల్లికి వచ్చే పెన్షన్ డిపాజిట్ అయ్యే బ్యాంకు కార్డ్ అమెరికాలో ఉండే కుమారుడు తీసుకుని వెళ్ళాడు. కారణం, తల్లి ఆ పెన్షన్ లో నుండి కుమార్తెకు ఇస్తుందని భయం. తల్లికి అన్ని వసతులు ఏర్పాటు చేసేవాడు. చూసే ప్రపంచానికి ఏది లోటు చేస్తున్నట్లుగా ఉండదు. కానీ తల్లికి స్వేచ్ఛ మాత్రం ఉండదు. ఆమె భర్త వలన ఆమెకు వచ్చే పెన్షన్ మీద సర్వాధికారాలు ఆమెకు ఉంటాయి. కానీ తెలియకుండానే పిల్లల పెత్తనం నడుస్తుంది.
ఇక సంతానం లేని వారి పరిస్థితి మరో రకం. భర్తకు తలకొరివి పెట్టేవారితో మొదలయ్యే పంచాయతీ ఆమె బ్రతికున్నంత కాలం నడుస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉండే స్త్రీలు తమకు తెలియకుండానే భయంతో నలిగిపోతూ ఉంటారు. ఆస్తి తనదే అయినా పూర్తి స్థాయిలో భయం లేని పెత్తనం చేసే పరిస్థితి ఉండదు. సాంఘిక కట్టుబాట్లలో కనిపించని మరో పార్శ్వం ఇది.
అందరూ అలాగే ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం మహిళలు ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగాలు కూడా మహిళల ఇటువంటి పరిస్థితిని మార్చలేకపోతున్నాయి. సాంఘిక దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నంత కాలం ఈ పరిస్థితిలో మార్పు ఉండదు. చదువుకుని ఉద్యోగం చేస్తున్న స్త్రీలు కూడా ఇటువంటి బాధలు అనుభవిస్తూనే ఉన్నారు.
ఓ పదిహేడు సంవత్సరాల పిల్లవాడు తండ్రి చనిపోయిన తరువాత తన తల్లి పూలు పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ, ఆమె కట్టు బొట్టును శాసించిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వితంతువు అయిన తల్లి ఎవరితోనైనా మాట్లాడితే తప్పు పట్టే పిల్లలను కూడా చూస్తూనే ఉన్నాము. పురోగమనంలో ఉండవలసిన సమాజం రోజురోజుకూ మూఢ నమ్మకాలు, అరాచకపు ఆచారాలకు బలవుతుంటే అభ్యుదయం అసాధ్యమైపోతుంది. శబరిమల గుడిలోకి మహిళలు ప్రవేశించకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. మణికంఠుడి పైన నమ్మకం ఉన్న మహిళలు న్యాయస్థానం తీర్పు ఇచ్చినంత మాత్రాన మతాచారానికి వ్యతిరేకంగా గుడిలోకి ప్రవేశించరు.
దైనందిన జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో గుడి ప్రవేశానికి ఆస్కారమే లేదు. షాబానో తన భరణం కోసం రెండు దశాబ్దాలు న్యాయపోరాటం చేసింది. న్యాయస్థానం ఆమెకు ఆ హక్కును దఖలు పరిచింది. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం చట్టం చేసే పరిస్థితి వచ్చిన తరువాత, ముస్లిం మతపెద్దల నుండి, సమాజం నుండి ఎదురైన వ్యతిరేకతకు తలొగ్గి, తన పోరాట ఫలితాన్ని తానే చట్టం చేయవద్దని కోరింది. ముస్లిం సమూహం ఆమెను కొట్టలేదు, తిట్టలేదు, కానీ ఆమెలోని పట్టుదలను అణిచివేయగలిగింది. అది ప్రస్తుత సమాజ పోకడ. ఆ పోకడకు చాలామంది మహిళలు బలవుతున్నారు. కనిపించకుండానే లింగ వివక్ష సమాజాన్ని ఏలుతున్నది. ఇంటా బయటా, ఆఖరుకు రాజకీయాలలో కూడా ఈ వివక్ష అణువణువునా కనిపిస్తున్నది.
రాజకీయాలలో వచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా రాజకీయం అవుతున్నది. దశాబ్దాల తరబడి బిల్లు పైన చర్చ నడుస్తూనే ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉంటున్న పార్టీలు మహిళలను ఆ చట్టం తీసుకొస్తామని ఊరిస్తూనే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తున్న సమయాన్ని ఒక పెద్ద ఈవెంట్ మాదిరిగా చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారే కానీ, దేశంలో సగానికి పైగా ఉన్న మహిళల హక్కుగా ఆ బిల్లును తీసుకోవడం లేదు.
మహిళా బిల్లుకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరుతూ నరేంద్రమోదీ మహిళా పార్లమెంటేరియన్స్తో ముచ్చటించారు. సూచనలు, సలహాలు స్వీకరించే దశ దాటిపోయింది. దశాబ్దాల తరబడి మహిళా రిజర్వేషన్ నలుగుతూనే ఉన్నది. ఇప్పటికి ఒక తీరం చేరే ఆశ కనిపిస్తున్నది. హక్కుల కోసం పోరులో మహిళల పాత్ర కూడా రోజురోజుకూ తరిగిపోతున్నది. ఇప్పటివరకు మహిళా రిజర్వేషన్ చట్టం కాకపోవడంలో అందరూ పాత్రధారులే. అందువలనే మహిళా రిజర్వేషన్ అనేది ఒక తాయిలం అయిపోయింది.
అయితే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు అవ్వగానే మహిళల సమస్యలన్నీ తీరిపోవు. సమాజంలో, కుటుంబాలలో లింగ వివక్ష కొనసాగినంత కాలం సమస్యలు సమసిపోవు. సాంఘిక కట్టుబాట్ల రూపంలో ఉండే వివక్షను గుర్తించి వాటిని రూపుమాపాలి. వివక్ష లేని సమాజంలో మాత్రమే సమాజ హితం కోసం పోరాడగలిగే మహిళలు చట్టసభలకు రాగలుగుతారు.!