– ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తెలంగాణ బి జే పి ఎంపీలారా.. సిగ్గుపడండి!
– నోరు విప్పని ప్రతి ఎంపీ కూడా ఈ అవమానంలో భాగస్వామే.
– నాలుగు కోట్ల ప్రజల సామూహిక స్వప్నం
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఆవిర్భావంతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు ఆయన వికృత మనస్తత్వానికి, తెలంగాణపై ఉన్న ద్వేషానికి పరాకాష్ట. వందలాది మంది బలిదానాలు, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా సిద్ధించిన తెలంగాణను ఒక శత్రు దేశంతో పోల్చడం అంటే.. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల గుండెలపై తన్నడమే.
తేజస్వీ సూర్య ! చరిత్ర తెలుసుకో!
తెలంగాణ అంటే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం సాగిన ఒక పవిత్రమైన ప్రజాస్వామ్య ఉద్యమం. అస్తిత్వం కోసం మేం చేసిన పోరాటాన్ని పాకిస్థాన్‌తో పోల్చడానికి నీకు ఎంత ధైర్యం? ఈ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, ఇది తెలంగాణ తల్లిని అవమానించడమే. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించడమే తక్షణమే తేజస్వీ సూర్య, బీజేపీ కేంద్ర నాయకత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తెలంగాణ బి జే పి ఎంపీలారా.. సిగ్గుపడండి!
రాష్ట్ర అస్తిత్వాన్ని ఒక పరాయి నాయకుడు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే.. ఢిల్లీలో నోరు మెదపని కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతకానితనాన్ని చూస్తుంటే తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది.
* మీ ఆత్మగౌరవం ఏమైంది?
* ఢిల్లీ బాసుల మెప్పు కోసం తెలంగాణ ఆత్మను తాకట్టు పెడతారా?
* సభలో మీ ఎదుటే మన రాష్ట్రాన్ని కించపరుస్తుంటే, మీ గొంతులో పచ్చి వెలగకాయ పడిందా?
మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నది తెలంగాణ ప్రజలకా? లేక తెలంగాణను అవమానించే పార్టీలకా? నోరు విప్పని ప్రతి ఎంపీ కూడా ఈ అవమానంలో భాగస్వామే.
తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. అవమానాలను భరిస్తూ పడి ఉండటానికి ఇది సమైక్య పాలన కాదు. మా స్వరాష్ట్రాన్ని, మా అస్తిత్వాన్ని కించపరిచే ఏ శక్తినైనా గద్దె దించే వరకు తెలంగాణ సమాజం విశ్రమించదు. తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ముక్కు నేలకు రాయకుంటే, తెలంగాణ గడ్డపై బి జే పి ఎంపి లను తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నాం.