– ప్రతి బూత్లోనూ మన ఓటును కాపాడుకోవాలి:
– అధికార కాంగ్రెస్ బిజెపి దొంగ ఓట్లు నమోదు చేసే ప్రమాదం ఉంది..జాగ్రత్తగా ఉండాలి
– ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు మన పార్టీ శ్రేణులు ప్రయత్నం చేయాలి
– ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ‘సర్’ కార్యక్రమంపై పార్టీ శ్రీనులతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ కేటీఆర్
హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పైన దృష్టి సారించి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడకుండా చూడాలని భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని అనేక రాష్ట్రాల్లో లక్షలాది ప్రతిపక్ష పార్టీల ఓట్లను బిజెపి తీసివేసిందన్న ఆరోపణలు విస్తృతంగా తలెత్తుతున్నాయన్నారు. దీనితో పాటు తాజాగా మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా లబ్ధి పొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు.
అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్‌లు ఖచ్చితంగా ఈ SIR కార్యక్రమం దుర్వినియోగం చేసే ప్రమాదం రాష్ట్రంలో ఉన్నదని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను కాపాడుకోవడంతో పాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలన్నారు.
ఈరోజు త్వరలో జరగనున్న SIR కార్యక్రమం పైన పార్టీ శ్రేణులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ మొత్తం SIR ద్వారా ఓటర్ల జాబితాలోని తప్పులను సవరించి కొత్తగా ఓటర్లను నమోదు చేసేందుకు ఉద్దేశించిందని, కాబట్టి ప్రతి బూత్ వారీగా దొంగ ఓటర్లను తొలగించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీంతోపాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకుడిని ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీ తరఫున నియమించబడే బూత్ లెవల్ ఏజెంట్లు ప్రయత్నం చేయాలన్నారు. SIR మార్గదర్శకాల ప్రకారం బూత్ లెవల్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ల నియామకానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ సూచించారు.
ఈ మొత్తం బూత్ లెవల్ ఏజెంట్ల ఎంపిక, వారి వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు అందించి వారి నియామకం వెంటనే పూర్తయ్యేలా చూసుకోవాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు పార్టీ తరఫున ఒక శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.
దీంతోపాటు రాష్ట్రంలో ‘సర్’ ఎప్పుడైనా వారం పది రోజుల్లోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నదని, ప్రారంభమైన వెంటనే వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓటర్ల జాబితా తయారీ, సవరణ వంటి అంశాల పైన ఇప్పటి నుంచే పార్టీ కసరత్తు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ‘సర్’ ప్రాధాన్యత, ‘సర్’ నిర్వహించే తీరు, అందులో బూత్ లెవల్ ఏజెంట్లు చేయవలసిన విధులు, బాధ్యతలను కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బూత్ లెవల్ ఏజెంట్లు ప్రభుత్వం చేత నియమించబడే బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవడం, కొత్త ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు, ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణ వంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుందన్నారు.
‘సర్’ అనేది రానున్న ఎన్నికలకు అత్యంత కీలకం అని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బూత్ స్థాయి నుంచి సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ‘సర్’ పైన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన వివాదాలు, చర్చలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలను, విమర్శలను దృష్టిలో ఉంచుకొని అలాంటి అవకాశం స్థానికంగా ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఇవ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా అందరి ఓటు హక్కుని కాపాడుకుంటూ ముందుకు సాగేలా ప్రయత్నం చేయాలని మరొకసారి గుర్తు చేశారు.