– ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబ సభ్యులకు పరామర్శ
– సిరిసిల్లకు తరలిన ఆరుగురు మృతుల భౌతిక కాయాలు
హైదరాబాద్ : సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నిన్న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి చేరుకున్న ఆయన, మృతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు.
అనంతరం, అక్కడ ఉన్న మృతుల కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడారు. ఆత్మీయులను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న వారిని ఆయన ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఇలా అకాల మరణం చెందడం తీరని లోటు అన్నారు.
ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం మరియు ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత, ఆరుగురి మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి స్వగ్రామమైన సిరిసిల్లకు తరలించారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను తరలించే వరకు కేటీఆర్ అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ విషాద ఘటనతో అటు సిరిసిల్ల నియోజకవర్గంలోనూ, ఇటు ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.