– 6 ఏళ్ల కింద శరణ్యకు అండగా కేటీఆర్
– 6 ఏళ్ల క్రితం నాటి సాయం మరవని బాలిక
– నేడు పదవ తరగతి పాసై కేటీఆర్ ను కలిసిన శరణ్య
హైదరాబాద్ : కష్టాల్లో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి నిరూపించారు. ఆరు సంవత్సరాల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి ఆయన అందించిన సాయం, నేడు ఆ బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది.
2019లో ప్యారడైజ్ బాలంరాయ్‌కు చెందిన కె. నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేసే వీరికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు లేకపోవడంతో బసవతారకం ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకక వారు వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ క్లిష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ పూజిత, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించి, తన బృందాన్ని రంగంలోకి దింపారు. ట్వీట్ చేసిన అరగంటలోనే రిప్లై రావడమే కాకుండా, మరుసటి రోజు ఆదివారం (సెలవు దినం) అయినప్పటికీ, కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
కేటీఆర్ చొరవతో శరణ్యకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తి ఉచితంగా చికిత్స లభించింది. చిన్నారి శరణ్యకు స్టంట్ వేయడంతో పాటు మేజర్ సర్జరీ నిర్వహించారు. సుమారు రూ. 3 లక్షలు ఖరీదైన రేడియేషన్ థెరపీని కూడా కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించి ఉచితంగా చేయించారు. సర్జరీ నుంచి డిశ్చార్జ్ వరకు జరిగిన ప్రతి పరీక్ష (MRI సహా) ఖర్చులను కేటీఆర్ బృందమే భరించింది. “మేము ఒక్క రూపాయి కూడా ఆసుపత్రిలో ఖర్చు పెట్టలేదు” అని చిన్నారి తల్లి రాజేశ్వరి భావోద్వేగంతో తెలిపారు.
నాటి సాయంతో నేడు కృతజ్ఞతలు
ప్రాణాపాయం నుంచి బయటపడిన శరణ్య, ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 384 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తన ప్రాణాలు కాపాడిన కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపాలన్న శరణ్య కోరిక మేరకు… నేడు ఆ కుటుంబం కేటీఆర్‌ను నంది నగర్ నివాసంలో కలిసింది.
తమ బిడ్డను ఆరోగ్యవంతురాలిని చేయడమే కాకుండా, ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చదువులో రాణించేలా ప్రోత్సహించిన కేటీఆర్‌కు శరణ్య తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి శరణ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.