(ఇంద్రాణి)
దేశంలో బీజేపీ గాలి బలంగా వీస్తున్నది అనే దానికి సంకేతం అన్నట్లుగా.. దేశం మొత్తం మోడీ మయం అని బీజేపీ వారి సామాజికమాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి. వాస్తవం అయితే అయ్యుండవచ్చు, కాదనటానికి పెద్దగా కారణాలు కనిపించటం లేదు. కానీ ప్రస్తుతం ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కొలమానంగా ఆ విషయాన్ని నిర్ణయించటం హేతుబద్ధం కాదు.
మొన్న జరిగిన ఎన్నికలలో పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్డీఏ వశమవుతాయని ఎప్పటినుండో అందరూ అంటున్నదే. కేరళలో సీపీఎం ఓడిపోవటం వలన కొత్తగా బీజేపీకి వచ్చే లాభం ఏమీ లేదు. అదే సమయంలో కేరళలో యునైటెడ్ ఫ్రంట్ గెలుస్తుంది అని కూడా చాలాకాలం నుండి ప్రచారం జరుగుతున్నదే.
అయితే 2021 శాసనసభ ఎన్నికలలో సాధించిన ఓట్ల శాతంతోనే బీజేపీ రెండు శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తిరువనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ, ఆ శాసనసభా నియోజకవర్గాన్ని గెలవలేకపోయింది. ఏదైనా శాసనసభలోకి అడుగుపెట్టటం మాత్రం బీజేపీ ఘనవిజయంగానే భావించాలి.
చీమ దూరే సందు దొరికితే చొచ్చుకుపోగల నేర్పు బీజేపీ సొంతం. కమ్యూనిస్టుల కోటను కాంగ్రెస్ బద్దలు కొట్టి విజయం సాధించటం కంటే, బీజేపీ కేరళ రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టటమే కమ్యూనిస్టులకు పెద్ద గండంగా మారే అవకాశం ఉన్నది. తాను బలంగా ఉన్న రాష్ట్రాలలో గెలిచిన పార్టీలను చీల్చటం బీజేపీకి పెద్ద కష్టం కాదు. కానీ కేరళలో ఇంకా అంత బలం లేదు కాబట్టి, యూడీఎఫ్ ప్రభుత్వం పైన కంటే.. ఓటమిలో ఉన్నప్పుడు పార్టీలలో జరిగే అంతర్గత పోరును ఉపయోగించుకోవటం, తమ పార్టీని బలోపేతం చేసుకోవటం బీజేపీ దగ్గర దారిగా భావిస్తుంది.
కాబట్టి దిగువస్థాయి నాయకులను కాపాడుకోవటం ఎల్డీఎఫ్ లో ఉన్న పార్టీలకు కొద్దిగా కష్టమే. తమిళనాడులో ఇప్పటివరకు వెలుగుచూస్తున్న వార్తల ప్రకారం.. బీజేపీ గతంలో ఉన్న ఓటుబ్యాంకును సాధించలేకపోయింది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు స్టాలిన్‌ను చావుదెబ్బ కొడితే, బీజేపీకి నిరాశను మిగిలించాయి. కేరళలో తనకున్న ఓటు బ్యాంకును కాపాడుకోగలిగిన బీజేపీ, తమిళనాడులో విజయ్ దెబ్బకు గతంలో ఉన్న ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి.
తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి పాలవటం మాత్రం అవినీతి పట్ల ప్రజలు విసుగు చెందారనటానికి తార్కాణంగానే భావించాలి. బీజేపీతో చేతులు కలిపి ఏఐఏడీఎంకే నష్టపోయింది అనుకోవటానికి కూడా అవకాశం లేదు. బీజేపీ ఓట్ల వ్యతిరేకతే ఏఐఏడీఎంకే ఓటమికి కారణమైతే స్టాలిన్‌ను గెలిపించి ఉండేవారు. కానీ డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి రెండు బలమైన కూటములను కాదనుకుని టీవీకే (TVK) ని గెలిపించారంటేనే వారి పట్ల విసుగు చెందారని అనుకోవచ్చు.
పార్టీ ఓడిపోవటం వేరు, ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ పెద్ద ఓడిపోవటం వేరు. అయితే స్టాలిన్‌కు వ్యక్తిగత ఓటమి కొత్త కాదు. కాకుంటే ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోవటం కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ గెలుస్తుంది అని ఎవరూ పెద్దగా అనుకోలేదు. కానీ ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి విజయ్ గెలుపు పట్ల కొద్దిగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ తమిళపీఠంపై ఆసీనుడవబోతున్నాడు విజయ్.
కాకపోతే తమిళనాడులో దశాబ్దాల ద్రావిడ రాజకీయ సంప్రదాయానికి తమిళులు వీడ్కోలు పలికినట్లుగానే కనిపిస్తున్నది. బీజేపీతో చెలిమిని తిరస్కరించిన విజయ్, తన ప్రసంగాలలో ‘అధికార భాగస్వామ్యం’ అనే పదాన్ని పదే పదే ప్రయోగించారు. గతంలో తమిళనాడులో మైనారిటీ ప్రభుత్వాలు నడిచాయి కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కాలేదు. బీజేపీతో చెలిమిని తిరస్కరించటానికి సైద్ధాంతిక విభేదాలే కారణమని విజయ్ ధైర్యంగా చెప్పటాన్ని మాత్రం అభినందించాలి.
భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేకపోయినా, అప్పటికే విజయ్ సీబీఐ అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాడు. అయినా భయపడకుండా ఒకడుగు ముందుకే వేసి దూసుకుపోయాడు. అయితే సంకీర్ణంలో ఇమడటం తెలియని తమిళనాడు కాంగ్రెస్ నాయకులైనా, మరే ఇతర పార్టీల నాయకులైనా తొలిసారి సంకీర్ణంలోకి అడుగుపెట్టవలసిన పరిస్థితిని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. బీజేపీ నాయకుడు అన్నామలై మాత్రం చాలా హుందాగా, ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి గౌరవించటం తన బాధ్యత అని చెప్పి తన విజ్ఞతను చాటుకున్నాడు.
ఇక దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన పశ్చిమబెంగాల్ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనానికి మమతాబెనర్జీ అడ్డుకట్ట వేయలేకపోయారు. మమత గెలుపు కూడా కొద్దిసేపు ఊగిసలాటకు గురై మరలా కుదుటబడింది. ఒకనాటి టీఎంసీ ముఖ్యుడు సువేందు అధికారి ప్రస్తుతం భవానీపూర్‌లో వెనుకంజలో ఉన్నప్పటికీ, నందిగ్రామ్‌లో మాత్రం ముందంజలోనే ఉన్నారు. సువేందు అధికారి రెండు చోట్ల ఎందుకు పోటీ చేశారో గమనిస్తే.. మమతాబెనర్జీని తరిమి తరిమి ఓడగొట్టాలి అనే ఆలోచన.
ఆమెను సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌లో గత శాసనసభ ఎన్నికలలో ఓడించారు. 2021 ఎన్నికలలో మమత తన సొంత నియోజకవర్గం, అప్పటికే రెండుసార్లు గెలిచివున్న భవానీపూర్ నుండి పోటీ చేయకుండా.. తన పార్టీ నుండి బహిష్కృతుడై బీజేపీలో చేరిన సువేందు అధికారి పైన పంతంతో నందిగ్రామ్ నుండి పోటీ చేశారు. ‘తాళం వేశాను కానీ గొల్లెం మరిచాను’ అన్నట్లు ఆ ఎన్నికలలో రాష్ట్రంలో పార్టీని గెలిపించుకున్నారు కానీ ఆమె ఓటమి పాలయ్యారు.
మరలా భవానీపూర్ నుండి ఉపఎన్నికలో పోటీచేసి గెలిచారు. ఇప్పుడు సువేందు అధికారి తన సొంత నియోజకవర్గం నందిగ్రామ్ నుండి పోటీ చేస్తూనే, మమత పైన సవాల్ విసిరి భవానీపూర్ నుండి ఆమె పైన పోటీ చేశారు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది కాదు ఇక్కడ సమస్య. శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేది వ్యక్తిగత బలనిరూపణకా లేక వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటానికా అని ప్రశ్నిస్తే వారిద్దరి దగ్గరా సమాధానం ఉండదు. మమతను భవానీపూర్‌లో ఓడించగలిగితేనే పశ్చిమబెంగాల్ ప్రజలకు సేవచేసే అవకాశం లభిస్తుందని రాజ్యాంగంలో ఎక్కడా లిఖించలేదు.
వ్యక్తిగత ఇగోలు నిరూపించుకోవటానికి రాజకీయ వేదికలను వాడుకోవటం ఎంతవరకు సబబో ఆలోచించాలి. ప్రజాక్షేత్రంలో ఇగోలకు తావులేదు, ఉండకూడదు. చాలామంది రెండు స్థానాల్లో పోటీ చేస్తారు.. గెలుపు ఓటముల అంచనాలు తారుమారు అవుతాయేమోనన్న భయంతో. కానీ సువేందు అధికారి, మమతాబెనర్జీ వారి బల నిరూపణకు, వారి ఈగోని సంతృప్తి పరచుకోవటానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ వారణాసి నుండి మోడీ పైన పోటీ చేయటం కూడా అలాంటిదే. అప్పుడు ఒకవేళ కేజ్రీవాల్ గెలిచినా ఆయన ప్రధానమంత్రి అవరు. కానీ ఏమి ఆశించి పోటీ చేశారు అంటే.. మోడీని ఎదిరించగల ధీమంతుడు అనిపించుకోవడానికి. అందువలన ప్రజలకు ఒనగూడే లాభం శూన్యం. స్పీకర్‌గా ఉండి, ఢిల్లీ వెళ్ళటానికి సాదాసీదాగా రైల్వే స్టేషన్లో బెంచీ మీద దినపత్రిక చదువుతూ కూర్చున్న సోమనాథ్ చటర్జీ లాంటి వారిని దగ్గరగా చూస్తూ పెరిగిన బెంగాల్ రాజకీయనాయకులు కూడా ప్రజాక్షేత్రాన్ని ఇలా ఉపయోగించుకోవటం బాధాకరం.
ఒకవేళ సువేందు భవానీపూర్‌లో ఓడిపోతే ముఖ్యమంత్రి రేసు నుండి ఆయనను తప్పించటానికి ఆశావహులు ఇది ఒక కారణంగా చూపించే అవకాశం కూడా ఉంటుంది. సువేందు బీజేపీకి పాతకాపు అయితే కాదు.
మొత్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ప్రజలు వారి భావజాలాన్ని చూపించారు. ఓడిపోయిన పార్టీలు క్షేత్రస్థాయిలో కారణాలు అన్వేషించాలి. గెలిచిన వారు.. ప్రజలు రేపు తమను కూడా ఓటమిపాలు చేస్తారు అనే ఆలోచనతో ఆచితూచి అడుగులు వేయాలి.!