జ్యోతిష్కుడు అన్న పేరుతో ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ‘మంత్రం’ అంటూ ఒక వికృతాన్ని చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇతనికి మంత్రం అంటే ఏమిటో తెలియదు.
“ఓం శ్రీం లక్ష్మీం ప్రణవ రూపాయ నమః” అంటూ ఇతడు మంత్ర శాస్త్రాన్ని వక్రీరిస్తున్నాడు. ఇది మంత్రం కానేకాదు; అతడి సొంత పైత్యం.
వినండి: https://www.facebook.com/share/r/1DAND55JbP/
లక్ష్మి అన్నది ప్రణవం రూపం ఎలా అవుతుంది? లక్ష్మి ప్రణవం రూపం కాదు. ఓం అన్నా ప్రణవం అన్నా ఒకటే. ఓం అన్న తరువాత మళ్లీ ప్రణవం, ప్రణవ రూపం అనడం మంత్ర శాస్త్రంలో ఉండదు. అసలు ప్రణవం అంటే ఏమిటి?
“తస్య వాచకం ప్రణవం” అని పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడింది. అంటే బ్రహ్మంకు పేరు ప్రణవం అని అర్థం. అలాంటిది లక్ష్మి ప్రణవ రూపం ఎలా అవుతుంది. అవదు. ఇది ఘోరమైన తప్పు. మంత్ర దోషం.
మంత్రాలలో ఓం కారానికి ప్రత్యేకమైన స్థానముంది. ‘మంత్రాణాం ప్రణవశ్శిరః’ అని శాస్త్రోక్తం. మంత్రానికి ఓం శిరస్సు వంటిది. కాబట్టి ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. ఒక సారి ఓం ప్రయుక్తమైనాక మళ్లీ ‘ప్రణవ రూపం’ అనడం ఉండదు. కనుక ఈ మంత్రం శాస్త్రోక్తమైన, నిజమైన మంత్రం కాదు.
ఈ జ్యోతిష్కుడు తన వికృత జ్ఞానంతో సృష్టించిన వైపరీత్యం ఈ మంత్రం అన్నది. ఇలాంటి వాటి వల్ల ఘోరాలు జరుగుతాయి. మంత్రాలు అంటూ ఇలాంటి వాటిని వ్యాపింపజేస్తున్న వారు ప్రజలకు, మంత్రశాస్త్రానికి, సనాతనానికి తీవ్రంగా హాని చేస్తున్నారు.
మంత్రాలు ఋషుల చేత ఒక నియమిత పద్ధతిలో నిర్మించబడ్డాయి. మంత్రం దేవతకు సంకేతం. ఈ మంత్రాలలో పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగ భేదాలున్నాయి. పుంలింగ దేవతలవి పుంలింగ మంత్రాలు. స్త్రీ లింగ దేవతలవి స్త్రీలింగ మంత్రాలు. పుంలింగ మంత్రాలను సౌర మంత్రాలు అని అంటారు. స్త్రీ లింగ మంత్రాలను సౌమ్య మంత్రాలు అంటారు. స్త్రీ లింగ మంత్రాలను విద్య అని అంటారు.
పుంలింగ మంత్రాలు ‘హుం’ లేదా ‘ఫట్’ అని ముగుస్తాయి. స్త్రీ లింగ మంత్రాలు ‘ ‘స్వాహా’ లేదా ‘ఠం’ అని ముగుస్తాయి. నపుంసక లింగ మంత్రాలు ‘నమః’ అని ముగుస్తాయి. నమః అని ముగిసే నపుంసక లింగ మంత్రాలో శక్తి ఉండదు. ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని ‘శారదా తిలకం’, ‘ప్రపంచసార తంత్రం’, ‘నారదీయ పాంచరాత్రం’, ‘ప్రయోగసారం’, ‘కౌలావలీయ తంత్రం’ వంటి తంత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి.
మంత్ర శాస్త్రోక్తంగా ఒక స్త్రీ దేవత మంత్రం ‘నమః’ అని ముగియకూడదు. అలా ముగిస్తే ఆ మంత్రం నపుంసక లింగ మంత్రం అయిపోయి నిర్వీర్యం అయిపోతుంది లేదా చెడిపోతుంది. ఇలా చెడిపోయిన మంత్రం ఎవరికైనా తీవ్రమైన హాని చేస్తుంది.
ఈ ప్రాథమికమైన ‘చదువు’ కూడా లేకుండా ఇటువంటి జ్యోతిష్కులం అని ప్రచారం చేసుకుంటున్న వాళ్లు మంత్రం పేరుతో ప్రజలకు హాని చేస్తున్నారు. ఇలాంటి జ్యోతిష్కులు అనబడుతున్న వాళ్లకు ఎవరూ బలి కావద్దు; కాకూడదు.
‘జన హితార్థం ఈ విషయం బహిరంగంగా తెలియజేయడమైనది’
– రోచిష్మాన్
9444012279