తిరుపతి మహతి కళాక్షేత్రంలో అక్టోబరు 30 మరియు 31 వ తేదీల్లో నిర్వహించనున్న గో మహా సమ్మేళనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు.
టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో ఆయన సమ్మేళనం ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రాంతం నుంచి ఎంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, రైతులు వస్తున్నారనే వివరాలు సిద్ధం చేయాలన్నారు. సమ్మేళనానికి హాజరవుతున్న ముఖ్యులతో స్వయంగా మాట్లాడాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం కు ఆయన సూచించారు. స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధితులకు తిరుమలలోని మఠాలు, వివిధ ప్రాంతంలోనూ, రైతులు, ఇతర ప్రతినిధులకు తిరుపతిలోని శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయంతో పాటు రెండు మరియు మూడవ సత్రాల్లో వసతి ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గో మహా సమ్మేళనానికి ఇప్పటివరకు 27 మంది స్వాములు వస్తున్నట్టు సమాచారం ఇచ్చారని జేఈవో తెలిపారు. వేదిక వద్ద, మహతి లోని ప్రవేశ మార్గాల వద్ద పూర్తిస్థాయిలో శానిటైజర్ లు మాస్కులు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. సమ్మేళనం నిర్వహణ కోసం కోఆర్డినేషన్, వసతి, రిసెప్షన్, స్టేజి, మీడియా మరియు పబ్లిసిటీ, ఫుడ్, హాస్పిటాలిటీ, రవాణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జిబిషన్, డయాస్, సెక్యూరిటీ, హెల్త్ అండ్ శానిటేషన్ లాంటి 25 కమిటీలను నియమించామని వీరబ్రహ్మం వివరించారు.
ఈ కమిటీల భాద్యతలు, విధులపై మంగళవారం సాయంత్రం లోగా స్పష్టత రావాలని ఈవో ఆదేశించారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, గోశాల డైరెక్టర్
హరినాథ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
మౌంట్ అబూలో శ్రీవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నవైవి సుబ్బారెడ్డి:
రాజస్థాన్ రాష్ట్రం లోని మౌంట్ అబూలో సోమవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర కామత్, రాజస్థాన్ మంత్రి ప్రమోద్ జైన్, గుజరాత్ మంత్రి జీతూ భాయ్ చౌదరి, మౌంట్ అబూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు సుబ్బారెడ్డి కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సుబ్బారెడ్డి గుజరాత్ రాష్ట్రం అంబాజి లోని ‘అంబ’ అమ్మవారిని దర్శించుకున్నారు.