Suryaa.co.in

Telangana

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకు నెల గడువిస్తున్నాం

-లేనిపక్షంలో అసెంబ్లీని దిగ్బంధిస్తాం…..
– నిరుద్యోగులూ… ఆత్మహత్యలొద్దు…. మీకు అండగా మేముంటాం
– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే… ఇదే చివరి ఉద్యమం కావాలి
– కేటీఆర్…. నీ అయ్యదే దొంగ దీక్ష…ఆధారాలు మావద్దు ఉన్నయ్
– ఉద్యోగ సంఘాల్లారా…. సీఎం అంటే మీకెందుకంత భయం?
– సీఎం నిర్ణయంతో ఉద్యోగులంతా అల్లాడుతున్నా స్పందించరా?
– కేసీఆర్ ను తరిమికొట్టండి… మీ తరపున మేం ఉద్యమిస్తాం
– బీజేపీ ‘నిరుద్యోగ దీక్ష’లో నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్
– విజయవంతంగా ముగిసిన నిరుద్యోగ దీక్ష
– పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని వేలాదిగా తరలివచ్చి సంఘీభావం తెలిపిన నిరుద్యోగులు

‘‘నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు జనవరి లోపు నోటిఫికేషన్ ఇవ్వాలి. లేనిపక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని తీరతం. మా ‘ట్రిపుల్ ఆర్’ ఎమ్మెల్యేలు (రాజాసింగ్, రఘునందన్, రాజేందర్) నోటిఫికేషన్ ఇచ్చేదాకా సభ జరగనీయకుండా అడ్డుకుంటారు. మా బీజేపీ కార్యకర్తలతో అసెంబ్లీని దిగ్బంధిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ జరపనీయం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

నిరుద్యోగులెవరూ ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందని, వారి పక్షాన తుదిదాకా పోరాడుతుందని పునరుద్ఘాటించారు. ఉద్యోగాల కోసం ఇదే చివరి ఉద్యమం కావాలని… రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ‘నిరుద్యోగ దీక్ష’ను దొంగ దీక్షగా అభివర్ణిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమంలో నీ అయ్యది దొంగ దీక్ష. బాత్రూంలోకి పోయి ఇడ్లీలు తిన్న నీచపు బతుకు నీ అయ్యది. తెలంగాణ రాకపోయినా… గంగలో పడ్డా నాకక్కర్లేదు. ఖమ్మంలో జ్యూస్ గ్లాస్ గుంజుకుని తాగి దొంగ దీక్ష చేసిన చరిత్ర నీ అయ్యది. ఢిల్లీలో 48 గంటల దీక్ష చేస్తానని చెప్పి 10 గంటలు కూడా చేయకుండా మధ్యలోనే వెళ్లి పోయి తాగి సోయితప్పి పండుకున్న చరిత్ర నీ అయ్యది’’అంటూ ధ్వజమెత్తారు.

ఏ స్థానికత కోసం ఉద్యోగులంతా నాడు తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నారో నేడు ఈ మూర్ఖపు సీఎం తుగ్లక్ నిర్ణయాలతో అదే స్థానికత ప్రశ్నార్థకంగా మారిపోవడంతోపాటు వారి కుటుంబ సభ్యులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగటి తుగ్లక్ నిర్ణయాలతో బాధపడుతున్నా…. ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

నిరుద్యోగులకు మద్దతుగా ఈరోజు ఉదయం బీజేపీ పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ ఉదయం నుండి సాయంత్రం వరకు ‘నిరుద్యోగ దీక్ష’ చేపట్టారు. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు కొనసాగించినా… ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేసినా… వాటిని ధీటుగా ఎదుర్కొని వేలాది మంది నిరుద్యోగులు నిరుద్యోగ దీక్షకు తరలివచ్చి బండి సంజయ్ కు సంఘీభావం తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ సహా రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులంతా దీక్షకు తరలివచ్చారు. దీక్ష ముగిసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ నిరుద్యోగులు, ఉద్యోగులకు అండగా ఉంటూ వారి పక్షాన తుది దాకా పోరాడతామని ప్రకటిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి…

భారత్ మాతాకీ జై, జై శ్రీరాం… వందేమాతరం, జై తెలంగాణ.. నరేంద్ర మోదీ, నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న ‘నిరుద్యోగ దీక్ష’కు విచ్చేసిన పెద్దలు, నాయకులు, కార్యకర్తలుకు, సంఘీభావం తెలిపేందుకు నిర్బంధాన్ని చేధించేందుకు అశేషంగా తరలివచ్చిన నిరుద్యోగులందరికీ నా వందనాలు..

బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రుహ నిర్భందం చేశారు. ఓయూ, కాకతీయ జేఏసీ నాయకులు, హోంగార్డ్స్ అసోసియేషన్, విద్యా వలంటీర్ల, ప్రైవేటు ఉద్యోగ సంఘం నాయకులు, సోషల్ మీడియా ఫోరం, జేఎన్టీయూసహా సంఘీభావం తెలిపిన విద్యార్థులు, నిరుద్యోగులందరికీ బీజేపీ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు.

బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్ కు వణుకు పుడుతోంది. ఇన్ని రోజులు ఈ సీఎంకు కోవిడ్ గుర్తుకే రాలేదు. ఈరోజు బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు వేలాది మంది తరలివస్తున్నారని తెలిశాకే ఆయనకు కోవిడ్ గుర్తుకొచ్చింది. ర్యాలీలు, సభలు నిషేధిస్తూ రాత్రికి రాత్రే జీవో ఇచ్చిండు. కోవిడ్ తో ఎందరో మరణిస్తే ఏనాడూ బయటకు రాని సీఎం కేసీఆర్ ఇయ్యాల నిరుద్యోగ దీక్ష ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని భయపడి జీవో తెచ్చిండు.

ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో వందల మంది యువత బలిదానాలు చేసుకున్నరు. ఎదురొస్తున్న రైలును తాకి ప్రాణత్యాగం చేసుకున్న సుమన్ లాంటి నా యువత ఎవరి కోసం చనిపోయినట్లు? ఉద్యోగాలే రాని తెలంగాణ దేనికోసమో… ప్రజలారా…. మీరంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఉద్యోగాల్లేక నిరుద్యోగలు పడుతున్న బాధను చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆత్మ ఘోషిస్తుంది. కేసీఆర్ లాంటి మూర్ఖుడి మోసపు మాటలను కూడా ఆనాడు మేధావులు అంచనా వేయలేకపోయిండ్రు. మేధావులను కూడా మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్. ఆరోజే మేధావులు కేసీఆర్ మోసాన్ని పసిగడితే… రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదు… ఉద్యోగాలొచ్చేవి కాదు.

ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులపట్ల ఈ సీఎం ఎందుకింత కక్ష కట్టిండో అర్ధం కావడం లేదు. ఆనాడు తన మాట వినకుండా సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో ఉద్యమాలు చేశారనే అక్కసున్నట్లుంది. అందుకే వాళ్లపై కక్షకట్టి హింసపెడుతుండు. 7 ఏళ్లుగా గ్రూప్-1 లేదు. మూడేళ్లుగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా… ఉన్న ఉద్యోగులను తొలగించిన మూర్ఖుడు సీఎం. 12 వేల మంది విద్యా వలంటీర్లు, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 22 వేల మంది స్కావెంజర్లను తొలగించిండు.

ఈ సీఎం కొడుకు మాట్లాడుతూ నిరుద్యోగం అతి తక్కువున్న రాష్ట్రం తెలంగాణ అని అంటుండు. సిగ్గుండాలి. 2014లో అసెంబ్లీలోనే ఈ సీఎం రాష్ట్రంలో 1 లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయని ప్రకటించిండు. అసెంబ్లీలో హామీ ఇచ్చి మాట తప్పిన సీఎంకు మా ఎమ్మెల్యేలతో ప్రివిలేజ్ నోటీస్ ఇప్పిస్తాం. ఏం సమాధానం చెబుతడో చూస్తాం.

అయినా ఈ సీఎం వేసిన బిశ్వాల్ కమిటీ కూడా 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నరు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కూడా 8 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు లెక్క చెప్పిండు. అయినా నిరుద్యోగం అతి తక్కువగా ఉందని చెప్పడం సిగ్గు చేటు. తెలంగాణ వచ్చినంక కూడా 600 మంది యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్య చేసుకున్నరు. సునీల్ నాయక్ సహా వాళ్లంతా చేసిన పాపమేంది?

నా పాదయాత్రలో అడుగడుగునా నిరుద్యోగులొచ్చి బాధలు చెప్పుకుంటే నా కళ్లే చెమ్మగిల్లినయ్. టీ కొట్టు, బజ్జీల బండీ, పాన్ షాపు పెట్టుకుని బతుకీడుస్తున్నరు. సీఎం మాత్రం ఎప్పుడు ఎన్నికలొచ్చినా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊరిస్తూనే ఉన్నడు. 2014లో, 2018లో ఉద్యోగాలిస్తారనే ఆశతో నిరుద్యోగులు ఓట్లేసిండ్రు.

అందుకే నిరుద్య్గోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా….జనవరి లోపు నోటిఫికేషన్ ఇవ్వకుంటే అసెంబ్లీని దిగ్బంధిస్తాం. రాబోయ అసెంబ్లీ సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనీయం. అసెంబ్లీ లోపల మా ట్రిపుల్ ఆర్ ఎమ్మెల్యేలు.. నోటిఫికేషన్ ఇచ్చేదాకా సభను అడ్డుకుని తీరతారు. సభ బయట మా బీజైవైఎం, బీజేపీ కార్యకర్తలంతా నిరుద్యోగుల తరపున సభను దిగ్బంధిస్తాం.సీఎంకు బీజేపీ అంటే భయం.. బీజేవైఎం అంటే భయం… గతంలో బీజేపీ అడ్డుకుంటుందనే భయంతోనే అసెంబ్లీ సమావేశాలను కుదించిన చరిత్ర సీఎంది. అయినా మేం వెనుకాడం… ఉద్యోగాల నోటిఫికేషన్ వేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తాం.

నిరుద్యోగులెవరూ ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇదే చివరి ఉద్యమం కావాలి. టీఆర్ఎస్ ను తరిమికొట్టాలి. మీకు ఉద్యోగాలిచ్చే ప్రభుత్వం రావాలి. అది జరగాలంటే గొల్లకొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడాలి. తెలంగాణలో నీళ్లు-నిధులు-నియామకాల కోసం ఉద్యమిస్తే… ఆ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీ బీజేపీ. ఆనాడు కేసీఆర్ యాడికి పోయిండు? పార్లమెంట్ లో ఓటేయకుండా సోయి తప్పి పడుకున్న వ్యక్తి కేసీఆర్. ఆనాడు విజయశాంతి సభలో గర్జించింది.

ఒకడంటాడు….నాది దొంగ దీక్షట… నీ అయ్యది దొంగ దీక్ష. బాత్రూంలోకి పోయి ఇడ్లులు తిన్న నీచపు బతుకు నీ అయ్యది. తెలంగాణ గంగలో పడ్డా నాకక్కర్లేదు. నేను బతకుననని చెప్పి జ్యూస్ తాగిన నీ అయ్యది దొంగ దీక్ష. ఢిల్లీలో 48 గంటల దీక్ష చేస్తానని చెప్పి 10 గంటలు కూడా చేయకుండా పోయి తాగి పండుకున్న చరిత్ర నీది.నీ అయ్యకు చిత్థశుద్ధి ఉంటే గుండెమీద ప్రమాణం చేసి 48 గంటలు దీక్ష చేసినని చెప్పగలడా? నీ అయ్య చేసిన దొంగ దీక్ష వల్లే ఈరోజు తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నరు.

రాష్ట్రంలో ఉద్యోగల పరిస్థితి ఏంది? భార్య ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర.. తల్లిదండ్రులు మరో చోట ఉన్నరు. ఉద్యోగులను ఎవరిని కదిలించినా ఏడుస్తున్నరు. ఏ ఉద్యోగి ఇంట్లో చూసినా ఏడుపులే విన్పిస్తున్నయ్. సీఎం దగ్గర మటన్, చికెన్ బిర్యానీలు తింటూ టైంపాస్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఏమైనయ్? ఎందుకు స్పందించడం లేదు? రెండేళ్లలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. అప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే పరిస్థితే లేదు. అయినా మీరెందుకు భయపడుతున్నరు? మీరు ఉద్యమం చేస్తేనే కదా… తెలంగాణ సాధించుకున్నది? అలాంటి మిమ్ముల్ని ఇబ్బంది పెడుతుంటే ఎందుకు భయపడుతున్నరో అర్ధం కావడం లేదు.

ఏ స్థానికత కోసమైతే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నరో ఆ తెలంగాణలోనే వాళ్ల స్థానికత ప్రశ్నార్థమైంది. వాళ్ల పిల్లలు, భావితరాల స్థానికత మఠాష్ అయ్యే ప్రమాదం ఉన్నా ఎందుకు మాట్లాడటం లేదు? మీరు భయపడ్డా సరే…. బీజేపీ ఈ సీఎంను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ కోసం మేం ఎంతదాకైనా కొట్లాడతాం… ఉద్యోగస్తుల్లారా… ఇకనైనా బయటకు రండి కొట్లాడండి. మీకు అండగా బీజేపీ ఉంటుంది. ప్రజలారా.. బయటకు వచ్చి ఉద్యమాల్లో పాల్గొనండి.

ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో నీ కొడుకు బినామీ సంస్థ నిర్వాకంవల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. టీఆర్ఎస్ ను పెంచి పోషిస్తున్న కార్పొరేట్ సంస్థలిచ్చే డబ్బులకు కక్కుర్తి పడి టెన్త్ విద్యార్థులందరినీ పాస్ చేసిన ఈ సీఎంను అడుగుతున్నా… ఇంటర్ విద్యార్థులు చేసిన పాపమేంది? విద్యార్థులు చనిపోతే ఎందుకు స్పందించడం లేదు. ఛీ… మానవత్వం లేని మనిషివి నువ్వు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంటర్మీడియట్ ఆత్మహత్యలకు కారకుడైన ఈ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాలి.

మేం మాట్లాడితే మాపై బెంగాల్ తరహాలో దాడులు చేస్తాడంట ఈ సీఎం … భయపడే ప్రసక్తే లేదు. మేం ఎంతదాకైనా తెగిస్తాం. బెంగాల్ లో 4 సీట్లున్న బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. అక్కడ బలిదానాలు చేసిన కార్యకర్తలే మాకు స్పూర్తి. వాళ్ల త్యాగాల స్పూర్తితో తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకుని తీరుతాం.

మేం ఎక్కడా దాడులు చేస్తలేం. మీరే పోలీసుల ద్వారా దాడులు చేయిస్తున్నరు. నిరసనలు, ఉద్యమాలను అడ్డుకుంటున్నరు. పోలీసులారా… మీ పిల్లల కోసం మేం ఉద్యమం చేస్తున్నాం. నిరుద్యోగ యువత కోసం దీక్ష చేస్తున్నం. అందుకే నిరుద్యోగ యువత మాపై నమ్మకం పెట్టుకుంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయం. పేదల కోసం, నిరుద్యోగుల కోసం తెగించి కొట్లాడేందుకు సిద్దంగా ఉన్నాం. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం.

నిరుద్యోగ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా తరలివచ్చిన నా నిరుద్యోగ యువతకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎక్కడికక్కడ అరెస్టు చేసినా… పోలీసుల వలయాన్ని చేధించుకుని వచ్చిన యువత ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఆక్రందనను ఈ సీఎం ఇకనైనా అర్ధం చేసుకోవాలి. అట్లాగాకుండా కేంద్రంపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ సంగతి తేలుస్తాం. సీఎంసహా మంత్రులు, ఎమ్మెల్యేలెవరినీ వదలబోం.

LEAVE A RESPONSE