– అవసరమా ఈ యుద్ధం?
ప్రపంచం మొత్తం శాంతిని కోరుకుంటుండగా..విశ్వంపై ఆధిపత్యం కోరుకునే అగ్రరాజ్యం అమెరికా సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెత్తనం చెలాయించే పరిస్థితులు కానరాక చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటే సంస్కరణలు బెడిసి కొట్టగా కేవలం స్వయంకృతంగా అగ్రరాజ్య హోదా పోగొట్టుకున్న రష్యా ఒకనాడు తనలో అంతర్భాగమైన ఉక్రెయిన్ పై ఇలా ఊహించని రీతిలో దాడికి తెగబడటం గర్హనీయం..ఈ దుశ్చర్య ద్వారా ప్రపంచానికి రష్యా ఎటువంటి సందేశం ఇవ్వదలచుకుందో అర్థం అవుతోంది.ఇది ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో ఖండించవలసిన విషయం.
ఈ యుద్ధం ఉక్రెయిన్ కోరి తెచ్చుకున్నది కాదు.పాకిస్తాన్..చైనా దేశాల్లా ఉక్రెయిన్ ఏ దశలోనూ కయ్యానికి కాలు దువ్వింది లేదు.నాటోలో సభత్వం కోరుకోవడమే ఆ దేశం చేసిన తప్పా..ఔను..అలా స్వతంత్రంగా నాటోలో చేరడం ద్వారా ఉక్రెయిన్ ఇక రష్యాలో కలిసేది లేదని చెప్పక చెప్పి ఉండవచ్చు…
అంతమాత్రం చేత అదేదో మహా నేరం అయినట్టు రష్యా ఉడుకుబోతుతనంతో యుద్ధానికి దిగబడడం తగునా..అంతేగాక యుద్ధానికి సిద్ధపడే ముందు ఎన్ని జరగాలి.. చర్చలు.. సంప్రదింపులు.. మధ్యవర్తిత్వాలు..రాయబారాలు..బేరసారాలు..ఇవేవీ ఒక పద్ధతి ప్రకారం జరపకుండా కేవలం ప్రపంచం తనను తప్పు పట్టకుండా ఉండేందుకే అన్నట్టు తూతూ మంత్రంగా జరిపించి తన ప్రయత్నాలన్నీ విఫలం అయినట్టు ప్రపంచానికి చాటి ఒక్క రాత్రిలో యుద్ధభేరి మ్రోగించింది రష్యా..వాస్తవానికి ఇవన్నీ జరుగుతుండగానే మరోపక్క సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూ రష్యా తన కుటిల బుద్ధిని చెప్పకనే చెప్పింది.ప్రపంచ దేశాలు ఇంకా రాయబార యత్నాలు సాగిస్తుండగానే పుతిన్ తన బలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి యుద్ధం మొదలెట్టేసింది..సిగ్గు సిగ్గు…
ఇన్నాళ్ళ కృషి వ్యర్దం కారాదు..
ఒకనాటి సంగతేమో గాని..ముఖ్యంగా ఆధునిక ప్రపంచం ఎన్నో దశలు దాటి వచ్చి యుద్ధాలను నివారించే స్థితికి చేరుకున్నాయి.
మధ్యమధ్యలో అనివార్య పరిస్థితులలో కొన్ని సార్లు..కొన్ని దేశాల పోకడల వల్ల ఇంకొన్ని సార్లు యుద్ధాలు జరిగినా మధ్యవర్తుల జోక్యంతో ఆగిపోయి ఇప్పుడు ఆయా దేశాలు కూడా పూర్తిగా కాకపోయినా కొంత మేర శాంతికి కట్టుబడే ఉంటున్నాయి.మన దేశాన్నే తీసుకుంటే చైనా..పాకిస్తాన్ వంటి దేశాలు ఎంతగా కవ్విస్తున్నా..రెచ్చగొడుతున్నా నిబద్ధంగా శాంతినే కోరుకుంటూ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలుస్తూ వస్తోంది.మనకే గనక అలాంటి వైఖరి విడనాడితే రోజూ యుద్దాలే..అది ఏ పక్షానికైనా కష్టమే..నష్టమే..
ఇతర ప్రియాంచానికి కూడా ఇలాంటి పరిణామాల వల్ల మనశ్శాంతి కొరవడుతుంది.
ఇప్పుడు రష్యా..ఉక్రెయిన్ దేశాల నడుమ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం కలవరపడడం లేదా..అలాగే..!!
రష్యా ధోరణి కారణంగా ఇప్పటికే ప్రపంచం మొత్తం ప్రశాంత వాతావరణం నెలకొంది..యుద్ధం రెండు దేశాల మధ్యనే అయినా కల్లోలం అన్ని దేశాలపైనా ప్రభావం చూపుతుంది..కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.ఇప్పటికే ఆ సూచనలు మొదలయ్యాయి.
అంతే గాక ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వివిధ దేశాల పౌరుల కోసం ఆయా దేశాల ప్రజలు..ప్రభుత్వాలు ఎంతగా కలవరపడే పరిస్థితులు నెలకొన్నాయో కళ్ళారా చూస్తూనే ఉన్నాం.
ఇక ఉక్రెయిన్ ప్రజలు ప్రత్యక్షంగా నరకాన్నే చూస్తున్నారు.కొన్ని లక్షల జీవితాల గతులే మారిపోతున్నాయి.వేలాది ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.అన్నెం పున్నెం ఎరుగని పసిమొగ్గలు అల్లాడి పోతున్నాయి.మానవ హక్కుల పరిరక్షణకు దిక్కేలేదు.ఆ చిన్నదేశం మొత్తం స్మశానవాటికగా మారిపోయింది.జనం ప్రాణాలు కాపాడుకునే దారుల కోసం వెతుకులాడుతూ ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు.ఈ రాజకీయాలు..అరాచకాలతో సంబంధం లేని ఇతర దేశాల వారు..ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఉక్రెయిన్ నుంచి బయటడతామా అని ఆశగా..ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.ఇండియా వంటి కొన్ని దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించుకునే ఏర్పాట్లు చేస్తుంటే ఇంకొన్ని దేశాలు ఆ అవకాశం లేక చేతులెత్తేస్తున్నాయి.అమెరికా అయితే అలాంటి పౌరుల భవిష్యత్తును గాలికే వదిలేసింది.
చేతులు కలుపుదాం
ఇప్పుడిక ప్రపంచ దేశాలు..వాటిని ఒక్క త్రాటిపై నడిపించే సంస్థలదే బాధ్యత. వీలైనంత త్వరలో ఈ యుద్ధానికి ముగింపు చెప్పించాలి.ఇప్పటికే ప్రపంచ శాంతికి తీరని విఘాతం ఏర్పడింది. అదిగాక కొన్ని దేశాలు అటు..ఇంకొన్ని దేశాలు ఇటు అయిపోయి ఒక అనవసర అంశంపై ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉండవచ్చు.ఇలాగే జరుగుతుందని కాకపోయినా ఇదంతా మరో ప్రపంచయుద్ధానికి దారి తీసే ముప్పు కూడా ఉంటుందేమో..ఎందుకైనా మంచిది..మేలుకోవాల్సిన అవసరం ఉంది.శాంతి దిశగా ప్రయత్నాలు మొదలైనా రష్యా నుంచి సానుకూల స్పందన రావడం లేదు.మొదటి దశ చర్చలు విఫలమై కూర్చున్నాయి.
రష్యా మొండి వైఖరి ఎటు పోయి ఎక్కడికి దారి తీస్తుందో..!?
రష్యా బహుశా..!?
వాస్తవానికి రష్యా ఆలోచన వేరే విధంగా ఉంటుంది..ఆనాడు అఖండ సోవియెట్ నుండి విడివడి పోయిన భాగాలన్నిటినీ మళ్లీ తన గుప్పిట్లోకి తెచ్చుకావాలన్న ఆలోచన పుతిన్ మస్తిష్కంలో పాతుకుపోయింది.అందుకు ఉక్రెయిన్ తో ఆ ఆలోచన అమలుకు పుతిన్ శ్రీకారం చుట్టారు.దీన్ని ఇక్కడే తుంచేయకపోతే మరిన్ని దేశాలు రష్యా కుటిల ఆలోచనలకు బలయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఈ విషయంలో రష్యాను ఒంటరిని చేసినా తప్పులేదు.
ప్రపంచ శాంతి అన్నిటి కంటే ముఖ్యం..దాని రక్షణే అందరి తక్షణ కర్తవ్యం…
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286