Suryaa.co.in

Features

అది మోసపూరిత వ్యాపారమే…

లేని దైవాన్ని ఉన్నాడని చెప్పి
దైవ క్షేత్రంలో
ప్రజలకు టికెట్స్ పెట్టి
దర్శనం కోసం, పూజల కోసం,
ప్రార్థనల కోసం
దేవుళ్ళ పెళ్ళి అని,
ఉత్సవాలని
డబ్బు గుంజడం,
దైవ కార్యం అనకు…
అది మోసపూరిత వ్యాపారమే…

పేరులో కొన్ని అక్షరాలను
మాత్రమే మార్చుకొమ్మని
మార్చుకుంటే డబ్బు గలగల వచ్చి పడుతుందని, ఐశ్వర్యవంతుడివి అయిపోతావ్ అని,
మీ కష్టాలన్నీ తీరుతాయని
న్యూమరాలజీ చెప్పి
దాన్ని వాడుకుని
డబ్బు సంపాదిస్తున్నావంటే,
అదేమీ సేవ కాదు
అదేమీ నిజం కాదు
అంతా మోసమే.
అది మోసపూరిత వ్యాపారమే…

జ్యోతిష్యం అంటూ ,
హస్తసాముద్రికం అంటూ ,
చిలక జోస్యం అంటూ,
గవ్వల జోస్యం అంటూ,
సోది అంటూ,
మూఢత్వంతో ,
మూర్ఖత్వంతో రాసిన
పంచాంగాలను వల్లెవేస్తూ,
నివారణ దోషాలకు పైకం లాగేస్తుంటే
అదేమీ మానవ సేవ కాదు.
దారుణమైన మోసకారి తనమే
అది మోసపూరిత వ్యాపారమే…

భూమి గుండ్రంగా ఉన్నది
దానికి మూలలు లేవు.
మూలమలుపులు లేవు.
మనం ఉన్న భూమికి మూలలు లేనిది
నీవు కట్టుకున్న ఇల్లుకు మూలలు ఎలా ఉంటాయి
ఆ మూలల్లో దేవుళ్ళు ఎలా ఉంటారు
మూలలు అని మనం అనుకునేది
కేవలం మన అవసరం కోసమే.
పైసా పైసా కూడబెట్టి కష్టపడి ఇల్లు కట్టుకుంటే వాస్తు పేరుతో గోడల్ని పడగొట్టి కొత్త గోడలుకట్టించి ఆర్థికంగా నష్ట పరిచి,
మేము వాస్తుశాస్త్రజ్ఞుల మని
ప్రజలను వంచించే వెధవల్లారా
మీ వాస్తు ఆపండి.
మీది అంతామోసపూరిత వ్యాపారమే.

ఉంగరాలు, తాయెత్తులు,
రుద్రాక్షలు,రంగురాళ్లు,
అమ్ముకుంటూ జనానికి
ఏదో మంచి చేస్తున్నానని చెప్పుకోకు.
అమాయకులైన,
అజ్ఞాను లైన,
ప్రజలను వంచించకు,
ప్రజలను బాగు చేస్తున్నానని అనుకోకు
అదంతా ప్రజలను మోసం చేయడమే
అది మోసపూరిత వ్యాపారమే….

పరిశుద్ధ జలాలు,
మహిమగల నూనెలు
అమ్ముకుంటున్నావంటే
అది దేవుని మహిమ అని
నీ ద్వారా వారికి రోగాలు నయం అవుతాయని డబ్బులు అందే మార్గమో అనకు
అది మోసపూరిత వ్యాపారమే..

కులాల కుళ్ళుతో ఒకరిని ఒకరు కొట్టుకొని
మనలో మనం చావాలని
రాజకీయ నాయకుల దుష్ట పన్నాగం.
కులాలు కూడు పెట్టవు.
మతాలు ప్రాణం నిలపవు.
మనిషికి మనిషే సహకారము,
అవసరము,
కులాల విభజన కుళ్లు రాజకీయం కోసమే.
అగ్రవర్ణాల ఆధిపత్యం కోసమే.
వారి సుఖం కోసమే.

మతాల జెండాలు మోయడం,
మత నియమాలు పాటించడం,
మతాల రంగులు పూసుకొని తిరగడం ,
మతపరమైన దుస్తులు ధరించడం,
దేశభక్తి కాదు
కేవలం కనపడని వినపడని
సాక్షాధారాలు లేని మూఢ భక్తి మాత్రమే.

మతాల జెండా
జాతీయ పతాకం ఎన్నటికీ కాదు
అది కేవలం –
ఏదో ఒక వర్గ ప్రయోజనాలు కాపాడడం కోసం మాత్రమే..

మత ధర్మం పేరుతో
గుళ్ళూ గోపురాల నిర్మాణం
యజ్ఞయాగాదుల నిర్వహణ
విగ్రహాలు పెట్టడం
మత విశ్వాసాలతో
భూముల ఖబ్జాలు
మత దురహంకారంతో
అమాయకుల నుండి కొల్లగొట్లే ఓట్ల కోసమే,
అలా వచ్చిన అధికారంతో
శాశ్వతంగా సమాజాన్ని నిలువునా చీల్చే పాట్లు
నీ ఆస్తులను రక్షించుకునే ఫీట్లు
అన్నీ, అన్నీ కేవలం
మోసపూరిత వ్యాపారమే

ఇది కేవలం కొందరి అధికారహస్తగతం చేసుకోవడానికేనని
ఇది కేవలం కొందరి దోపిడి కోసమని,
ఇది సోమరిపోతులు తిని కూర్చుండటానికని
అమాయకులైన అన్ని మతాల,
మెజారిటీ ప్రజలకు అర్థం కానంతవరకు

వారు మన భావొద్వేగాలతో,
మన అజ్ఞానంతో,
మన అమాయకత్వంతో,
మన నిర్లక్ష్యంతో ఆటలాడుకుంటారు.

ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా ప్రజల ధన మాన ప్రాణాలను కొల్లగొడుతూనే ఉంటారు. ప్రజలను శాశ్వత బానిసలుగా చేసేస్తారు.జాగ్రత్త……తస్మాత్ జాగ్రత్త.
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– రూపావత్ కొండయ్య

LEAVE A RESPONSE