“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత” అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్య పునీత భారతదేశంలో ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా…. అప్పుడు ఒక మహాత్ముడు ఉదయించి ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసి, సమాజంలో నెలకొని ఉన్న అంథాచారాలను, అసమానతలను, అనాగరిక ధోరణులను, అజ్ఞానాంధకారాన్ని, అధర్మ ప్రవృత్తిని తమ ఆధ్యాత్మిక జ్యోతులతో పారద్రోలి, హైందవ సమాజానికి మరికొన్ని శతాబ్దాలకు సరిపడా ప్రేరణను, ధార్మిక చైతన్యాన్ని ప్రసాదించి అవతార పరిసమాప్తినొందుతారు. యుగయుగాల భారతదేశ చరిత్రను మనం ఒకసారి అవలోకిస్తే మనకు ఈ సత్యం అవగతమవుతుంది.
అలా ప్రతి యుగంలోనూ, ఒక యుగంలోని వివిధ కాలాలలోనూ సామాజిక పరివర్తనకై భారతదేశంలో అవతరించిన వందలాది వీరుల, ఋషిమునుల, అవతార పురుషుల, అవధూతల పరంపరకు, కోవకు చెందినవారే సద్గురు శ్రీ మళయాళ స్వామి.
కేరళలోని తిరువాయూర్ సమీపంలో కరియప్ప, నొత్తియమ్మ దంపతులకు మార్చి 29, 1885 న జన్మించారీయన. తల్లిదండ్రులీయనకు వేలప్ప అని పేరు పెట్టారు. వీరి ఇంటికి వచ్చిన ఒక సాధువు ఈయనను చూసి మీ బిడ్డ సర్వసంగపరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పారు. చిన్నతనం నుండే ఈయన అందరిలా కాక నేలమీదనే నిద్ర పోవడం, జాలి, దయ ఎక్కువగా కలిగి ఉండటం, ఇంట్లో ఉన్న పంజరంలోని పక్షులను విడిపించడం, ఇంటి దగ్గర కుటీరంలో ఎప్పుడూ ధ్యానంలో ఉండటం చేసేవాడు. ఆంగ్లం చదవటమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సంస్కృతం నేర్చుకోవడానికే ఎక్కువ ఉత్సాహం చూపేవాడు.
నారాయణ గురు మార్గంలో.…
తిరువంతపురానికి కొంత దూరంలో శివగిరి గ్రామంలో నారాయణ గురుదేవుల ఆశ్రమం ఉంది. శ్రీ నారాయణగురు సామాజిక విప్లవ కారుడు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవాడు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి, పెరింగోత్కర అనే గ్రామంలో విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు. వేలప్ప ఆయన వద్ద శిష్యునిగా చేరాడు. శివలింగస్వామి వేలప్పకు మంత్రోపదేశం చేసి, పతంజలి యోగ రహస్యాలను సాధన చేయించాడు. వేలప్పకు శ్రీ నారాయణగురు దర్శనం కూడా లభించింది. త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సులను గురువు నుంచి పొంది ఇంటికి తిరుగు పయనమైనాడు వేలప్ప.
ఇంటికి వెళ్ళేటప్పటికి తల్లి జబ్బుపడి ఉంది. ఆమెకు సపర్యలు చేసి జబ్బు నయం చేశాడు. పెద్దలు పెళ్లి చేసుకోమని కోరితే… తాను దేశాటన చేయాలని సంకల్పించానని చెప్పి తిరస్కరించాడు. దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలనూ సందర్శించాలని తన 20వ ఏట కాలినడకన బయల్దేరాడు. రోజుకు ఇరవై ముప్పై మైళ్ల వరకూ నడిచేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే, తినేవాడు. అలా తిరుగుతున్నపుడు అనారోగ్యంతో ఒక వారం బాధపడ్దా ఇంటికి వెళ్ళకుండా యాత్రను కొనసాగించాడు. ఒక రోజు కలలో ఎవరో నోట్లో మాత్ర వేసినట్టుగా అనిపించింది. అప్పటి నుండి ఆయనకు అనారోగ్యం దరిచేరలేదు. ఆ విధంగా 9 సంవత్సరాల పాటు దేశంలోని వివిధ పుణ్య క్షేత్రాలను సందర్శించాడు.
స్వరాజ్య ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. స్వరాజ్యంతోపాటు స్వారాజ్య (ఆత్మరాజ్యం) వస్తేనే శ్రేయస్సు కలుగుతుందనీ, అందుకై సాధుసంతులు కృషిచేయాలని వేలప్ప అభిప్రాయం. గుణకర్మలను బట్టి ఏర్పడిన వర్ణాలకు ప్రాధాన్యం పోయి కులగోత్రాలకు ప్రాముఖ్యం వచ్చి, 80% ప్రజలు లౌకిక, అలౌకిక విద్యాశూన్యులుగా ఉన్నారనీ. కొందరు స్వార్థపరులు స్త్రీ శూద్రాదులకు, పంచములకు ఆత్మవిద్యాధికారం లేదని చెప్పి, వారిని దాని నుంచి దూరం చేసిన కారణంగానే భారతీయులు పరతంత్రులైనారని వేలప్ప గ్రహించి ముందుగా తాము తరించి ఇతరులను తరింపజేయాలని నిర్ణయించుకున్నాడు.
తన పుణ్యక్షేత్ర సందర్శన యాత్రలో ఆయన చివరగా తిరుమలలోని గోగర్భం చేరాడు. ఆ ప్రదేశం తపస్సుకు అనువుగా ఉన్నదని భావించి కొంతకాలం తపమాచరించి అటునుండి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేనాటికి తండ్రి కాలధర్మం చెందడంతో కొద్ది రోజుల అనంతరం తిరిగి తిరుమల గోగర్భం చేరాడు. గోగర్భంలోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ, తిరుమలలో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి, చివరికి అదీ మానేసి, పితృదేవతలకు పెట్టే పిండాలను, అంటే పచ్చి పిండిని తినేవాడు. మైసూరు తిరువెంకటాచార్యుడనే భక్తుడు వేంకటేశ్వర స్వామి పూజ చేసి ఆ ప్రసాదాన్ని రోజూ మళయాళ స్వామికి ఇచ్చి వెళ్ళేవాడు. కొందరు భక్తులు కూడా ఆయనకు ప్రసాదాలను అందిస్తూండేవారు. ఆయన భాష, వేషం చూసి అందరూ ఆయనను”మళయాళ స్వామి” అని పిలిచేవారు. అదే తరువాత స్థిర నామంగా మారింది. ఆ విధంగా తిరుమల గోగర్భంలో 12 సంవత్సరాలపాటు తపస్సు చేశారు.
అనంతరం తిరుమల విడిచి ఏర్పేడు దగ్గరి కాశీ బుగ్గలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాళహస్తి జమీందార్ కుమార వెంకటలింగమనాయుడు స్థలదానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమం1926లో ప్రారంభమైంది. శ్రీ మళయాళస్వామి తన బోధనలతో, కృషితో చుట్టుప్రక్కల గ్రామాల్లో జంతుబలులను మాన్పించారు. 1926లో సనాతన “ధర్మపరిపాలన సేవా సమాజం”ను ప్రారంభించి వివిధ ప్రాంతాల్లో ధర్మప్రచార సభలు నిర్వహించారు. ఈ సభల ద్వారా వేల, లక్షల సంఖ్యలో ప్రజలు ఉత్తేజితులయ్యారు. 1928లో వేంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు. 1935లో కన్యాగురుకులాన్ని ప్రారంభించి అన్ని కులాల వారికీ సంస్కృతం నేర్పారు. 1937 నుండి, ‘ఓంకార సత్రయాగం’ పేరున ఓంకారోపాసనను అన్ని కులాలవారికి, స్త్రీలకు ఇచ్చారు. 1945 నుండి స్త్రీలకు కూడా సన్యాస దీక్షనీయడం ప్రారంభించారు. 1951లో రెండవ చతుర్మాసం గోదావరి తీరంలో జరిగినపుడు వేలసంఖ్యలో దళితులు వారి ప్రసంగాలు వినడానికి వచ్చారు.
శ్రీమళయాళస్వామి బ్రహ్మవిద్యా ప్రచారంతో పాటు, సంఘసంస్కరణకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. బ్రాహ్మణేతరులకు సన్యాసదీక్షనిచ్చి, వారిద్వారా మఠమందిరాలను ప్రారంభింపజేశారు. అస్పృశ్యతానివారణ, వరకట్నాల నిషేధము, వితంతువులకు పునర్వివాహలు, శుభకార్యాల్లో ఆడంబరాల తొలగింపు, వేశ్యల నాట్యాలు ఆపించడం ఇలా అనేక మంచి పరిణామాలకు కారణమయ్యారు. “యధార్ధభారతి” అనే పత్రికను నిర్వహించారు. వారు రచించిన ‘శుష్కవేదాంత తమోభాస్కరం’ అన్న గ్రంథమూ, వారు ప్రవచించిన ‘దయగల హృదయమే దైవమందిరము’ అనే సూక్తి విస్తృత ప్రచారం పొందాయి.
కేరళలో శ్రీ నారాయణగురు వలే అన్ని కులాలవారికీ, ప్రధానంగా నిమ్నకులాలవారిలో విద్యాబోధన, ధర్మప్రచారము, తాత్త్విక బోధనలద్వారా వారికి ఉన్నతిని కలుగ చేస్తూ సామాజిక వివక్షను రూపుమాపడానికి కృషి చేశారు. కోస్తాజిల్లాల్లోని ప్రజలపై స్వామిజీ, వారి ఆశ్రమాల ప్రభావం ఇప్పటికీ ఎంతో ఉంది. వారు జూలై 23, 1962న సమాధి పొందారు. వారు దేహ ముక్తులైన తర్వాత పూజ్యశ్రీ విమలానంద గిరి స్వామి, వారి తదనంతరం శ్రీ విద్యానందగిరి స్వామిలు ఆశ్రమ పీఠాన్నధిష్ఠించి ఆశ్రమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రస్తుతం పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వామి మార్గదర్శనం చేస్తున్నారు. ఆశ్రమ ప్రారంభం నుంచి నేటి వరకు గత 95సం||లుగా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ప్రతి ఏడాదీ మూడు రోజులపాటు శ్రీ సనాతన వేదాంత సభలు నిర్వహిస్తూ వస్తున్నారు.
కులముయెంచనేల గుణమున్న చాలని
జ్ఞానవిద్యలన్ని జనులకొసగె
పరమకరుణమూర్తి మలయాళ స్వాములు
శాంతికేతనంబు సమరసంబు
అనుష్ఠాన వేదాంతాన్ని పండితలోకానికే కాకుండా, పామరులకి ప్రచారం చేసిన యోగి, వ్యాసాశ్రమ వ్యవస్థాపకుడు. తెలుగు నాట వేలాది గ్రామాలకి వేదాంత అంతర్గత సమరసతా సుగంధాన్ని వ్యాపింపజేసిన సమతాజ్ఞాన కుసుమం ఆయన.
గ్రామీణ ప్రాంతాల్లోని చదువురాని భక్తుల్లో హిందూధర్మం పట్ల అవగాహన కలిగించి, గీతా పారాయణ అభ్యాసం చేయించారు స్వామీజీ . దళితులకు సైతం పూజావిధానం, ఆచార వ్యవహారాలు, నియమ నిష్ఠలలవర్చిన ఘనత సద్గురు మలయాళ స్వాముల వారిదే. జనులందరిలో సమత్వ బుద్ధి సిద్ధించాలని, భగవంతుని ఆర్ధ్ర హృదయంతో వేడుకున్న స్వామీజీ ఆకాంక్షని మనందరం నెరవేర్చాలి.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి
(vskandhra.org)